ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by M.Rajitha |
ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి నియమించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రం మధ్యన సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడంలో, సమన్వయాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడి ఛైర్మన్ గా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి కేంద్ర మంత్రి అమిత్ షా ఛైర్మన్ గా పునర్నిర్మించారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో సభ్యులుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రతిపాదించిన కేంద్రమంత్రులు, వీరితోపాటుగా శాశ్వత ఆహ్వానితులుగా మరికొంతమంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. అందులో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నియమించారు. వీరంతా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకావచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తో పాటుగా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా కొంత మంది కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి నియమించారు. ఆయా రాష్ట్రాల మధ్యన ఉన్న వివాదాలను పరిష్కరించి జాతీయ సమైఖ్యతకు కృషి చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ నిరంతరం సమన్వయం చేయడం, కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాల అమలును పర్యవేక్షించడం వంటి విధులను ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంది. అంతే కాకుండా, కౌన్సిల్ దృష్టికి వెళ్లబోయే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రక్రియను సులభతరం చేయడంలో స్టాండింగ్ కమిటీ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో శాశ్వత ఆహ్వానితుడిగా అవకాశం కల్పించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోడికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed