Satellite Internet: శాటిలైట్ స్పెక్ట్రమ్ 3-5 ఏళ్లు ఇవ్వాలని కోరుతున్న దేశీయ టెలికాం కంపెనీలు

by S Gopi |
Satellite Internet: శాటిలైట్ స్పెక్ట్రమ్ 3-5 ఏళ్లు ఇవ్వాలని కోరుతున్న దేశీయ టెలికాం కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌కు సంబంధించి స్థానిక కంపెనీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. తాజాగా స్వదేశీ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు స్పెక్ట్రమ్ కేటాయింపు 3-5 ఏళ్ల వరకు మాత్రమే కేటాయించాలని కోరుతున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం సమీక్ష జరపాలని ఒత్తిడి చేస్తున్నాయి. వేలం రూపంలో కాకుండా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఎయిర్‌వేవ్‌లను నిర్ణయించిన ధరకు అందించడం జరుగుతుందని ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతింద్ర సింధియా ప్రకటించిన నేపథ్యంలో కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున, స్పెక్ట్రమ్ కేటాయింపు తక్కువ కాలానికి పరిమితం చేయాలని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది. దీనివల్ల గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న ఎలన్ మస్క్ స్టార్‌లింక్, అమెజాన్‌కు చెందిన కైపర్ లాంటి వాటితో జియో, ఎయిర్‌టెల్ పోటీ పడనున్నాయి. అయితే, స్టార్‌లింక్ మాత్రం స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ 20 ఏళ్లు ఉండాలని కోరుతోంది. దీనివల్ల తమ మూలధన పెట్టుబడులను తిరిగి పొందగలమని, సరసమైన సేవలు అందించగలమని చెబుతోంది. ఇదే అభిప్రాయాన్ని అమెజాన్ కైపర్ సైతం వ్యక్తం చేస్తోంది. స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ వ్యవధిని 20 ఏళ్లు లేదా లైసెన్స్ గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది కావాలని అడిగింది. తద్వారా ఉపగ్రహ సేవలను సకాలంలో అందించడం సులభతరం అవుతుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed