సంక్షోభంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు..

by Ravi |   ( Updated:2024-09-12 01:00:37.0  )
సంక్షోభంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు..
X

ఆర్థిక స్థోమత లేని పేదలు ఎందరో తమ కన్న బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యనే ఆధారమని భావించి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రభుత్వమైతే, పేద విద్యార్థులకు మంచి విద్య అందించడానికి అండగా ఉంటూ ఉచిత విద్య, వసతి భోజనం అందిస్తూ పేద విద్యార్థుల విద్యా వికాసానికి తోడ్పా టును, బాల బాలికలకు కార్పొరేట్ స్థాయి విద్యనూ అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఆ మాటలు ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. హాస్టల్లో విద్యార్థులకు అన్నంలో పురుగులు రావడం, ఆహారం కల్తీ జరగడం, ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థుల అస్వస్థత, హాస్టల్లోకి వన్యప్రాణులు రావడం విద్యార్థుల భయాందోళనలు ఇలా నేడు హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించకపోతే హాస్టల్ అంటే ధడేల్ అనే పరిస్థితి ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు దాదాపు 1000కి పైగా ఉండగా ఇందులో ఐదు సొసైటీల విద్యార్థులు మూడు లక్షల పైననే ఉన్నారు. గత కొద్ది నెలలుగా కొంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, 500లకు పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం, సంక్షేమ హాస్టళ్ల అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సమీకృత సంక్షేమ హాస్టళ్లు 2000 పైన ఉన్నాయి. ఇందులో పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 497, ఫ్రీ మెట్రిక్ హాస్టళ్లు 1523 ఉన్నాయి. అన్ని హాస్టళ్లలో కలిపి 3 లక్షల 50 వేలకు పైబడి విద్యార్థులు ఉంటున్నారు.

బాధలు భరించలేక..

హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సమస్యలు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోవడమే. 2018 నుంచి ఇప్పటివరకు మెస్ చార్జీలు పెంచలేదు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం కొండెక్కాయి. మెనూ ప్రకారం భోజనం ఉంటుంది. కానీ వండే వంటలకు సంబంధించి కొన్ని నాసిరకం వస్తువుల వినియోగిస్తున్నారు. కూరగాయలు కుళ్లిపోయి రావడం జరుగుతోంది. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదుల్లో ఫ్యాన్‌లు, సరిపడ లైట్లు కూడా లేవు. అనేక చోట్ల తాగునీటి శుద్ధి యంత్రాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా పనిచేయడం లేదు. స్నానం చేసేందుకు వేడినీరు అందించే వాటర్‌ హీటర్‌లు కూడా అందుబాటులో లేవు. విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విష పురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నరపాటు వసతి గృహాలన్నీ మూసి ఉన్నా తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన సంక్షేమ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. పైగా రాష్ట్రవ్యాప్తంగా వందలాది సంఖ్యలో హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒకే భవనంలో రెండు మూడు హాస్టళ్లు ఉన్న పరిస్థితి. కొన్ని పక్కా హాస్టల్స్ శిధిలావస్థకు చేరుకోవడం, పెచ్చులూడి పోవడం, చుట్టూ ప్రహరీ లేకపోవడంతో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులు బాధలు భరించలేక సమస్యల పరిష్కారం కోసం నేడు రోడ్డు ఎక్కి తీవ్ర ఆగ్రహ నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది.

విద్యార్థుల సంక్షేమంపై దృష్టిపెట్టాలి!

గత ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, నిధులు కేటాయించి, ఎప్పటికప్పుడు మెస్ చార్జీలు పెంచి, సొంత భవనాలు నిర్మించి ఉంటే ఉంటే నేడు విద్యార్థులకు ఇన్ని ఇబ్బందులు ఉండకపోవు. ఆనాడు కన్నెత్తి చూడలేదు కానీ నేడు హాస్టల్ గురుకులాల విద్యార్థుల సమస్యలు ఉన్నాయి అంటూ మాట్లాడున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ చూస్తున్న సందర్భంగా సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలాల విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను, గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, నిత్యం అధికారులు పర్యవేక్షించడమే పై సమస్యలకు పరిష్కారం. పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఉంటుం దని రుజువు చేయాలి. మెస్ చార్జీల పెంపు, హాస్టళ్లకు ప్రత్యేక నిధుల కేటాయింపు చేసి అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి సొంత భవనాలు వెంటనే నిర్మించి సంక్షేమ హాస్టళ్ల, గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలిచి వారి సంక్షేమానికి కృషి చేయాలి.

- కసిరెడ్డి మణికంఠ రెడ్డి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

75695 48477

Advertisement

Next Story

Most Viewed