- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ పర్వం: ఏడేండ్లుగా ప్రమోషన్లు నిల్
'అంగడిలో అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని' అన్నట్లుగా ఉంది రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వందలాది స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. అర్హత కలిగిన వేలాదిమంది ఉపాధ్యాయులూ ఉన్నారు. అయినా, టీచర్లకు ప్రమోషన్లు ఉండవు. మొత్తం 33 డిపార్టుమెంట్లలో గత ఏడేండ్లుగా ప్రమోషన్లు ఇవ్వని ఏకైక డిపార్టుమెంట్ విద్యాశాఖే! అదీ కేవలం టీచర్లకు మాత్రమే. బోధనేతర సిబ్బందికి ఠంచన్‌గా ప్రమోషన్లు ఇస్తున్నారు. వాస్తవానికి టీచర్ల ప్రమోషన్లకు ఇప్పుడు ఎలాంటి అడ్డంకులూ లేవు.
ఏండ్ల తరబడి పదోన్నతులు కల్పించకుండా విపరీత జాప్యం చేయడం ఉపాధ్యాయులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నియామకమైన పోస్టులోనే సర్వీస్ అంతా పనిచేసి, చివరికి ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే రిటైరయ్యే పరిస్థితి దాపురిస్తుందేమోనని టీచర్లు బాధపడుతున్నారు. అర్హతలు ఉండి, ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ పదోన్నతికి నోచుకోకుండానే వందలాదిమంది టీచర్లు ఇప్పటికే రిటైరయ్యారు.
ఏపీలో నెలనెలా, టీఎస్ లో ఇలా!
ఏండ్ల తరబడి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఉన్న టీచర్లు తమ విధి నిర్వహణలో ఉత్సాహం చూపగలరా? ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, విద్యారంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారానికి అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా, ఉపాధ్యాయ, పర్యవేక్షణాధికారుల పోస్టులను ఏండ్ల తరబడి భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టడం విద్యారంగానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం కలగజేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్ల పాలనలో కేవలం ఒకే ఒకసారి 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. ఆ తర్వాత ప్రమోషన్ల ఊసే లేదు. గతేడాది రాష్ట్రంలో అన్ని శాఖలలో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి, ఉపాధ్యాయులను విస్మరించారు.
మండల విద్యాధికారి (ఎంఈఓ) పోస్టుల భర్తీ పరిస్థితి మరీ ఘోరం. 2005లో చివరిసారిగా ఈ పోస్టులను పదోన్నతులతో భర్తీ చేశారు. ఆ తర్వాత ఈ పదిహేడేండ్లలో ఒక్క ఎంఈఓ పోస్టును కూడా నింపలేదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 528 ఎంఈఓ పోస్టులలో 21 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. మిగతా 507 పోస్టులు ఖాళీయే. ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టుల పరిస్థితీ ఇంతే. 4,421 ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టులలో 1981 పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. ఎంఈఓ, హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. నూటికి నూరు శాతం పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సిందే. సంవత్సరాల తరబడి హెడ్మాస్టర్లు లేని ఉన్నత పాఠశాలలు, ఎంఈఓలు లేకుండా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు సక్రమంగా నడుస్తాయా? విద్యాప్రమాణాలను ఆశించగలమా?
ఇదీ పరిస్థితి
ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే డిప్యూటీ ఈఓ పోస్టుల దుస్థితీ అంతే. మొత్తం పోస్టులు 66. ఆరుగురు అధికారులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. మిగతా అరవై పోస్టులను పుష్కర కాలంగా నింపడం లేదు. ఏడు జిల్లాలలో మాత్రమే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. మిగతా 26 జిల్లాలకు ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. ఇంకా విషాదం ఏంటంటే, కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాలకు డీఈఓ పోస్టులు కూడా మంజూరు చేయలేదు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్లు, డైట్ లెక్చరర్లు, డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈఓ అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంది.
దీంతో పాఠశాలల పర్యవేక్షణ గాడి తప్పింది. రాష్ట్రంలో 45 శాతం హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు, 96 శాతం ఎంఈఓ, 91 శాతం డిప్యూటీ ఈఓ, 79 శాతం డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ప్రమోషన్లతో భర్తీ కావాల్సిన వేలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ఖాళీ ఏర్పడిన నెల రోజుల్లోనే టీచర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రతినెల కాకపోయినా కనీసం ఏడాదికి ఒకసారి భర్తీ చేసినా బాగుండేది. ఏడేండ్లుగా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దాఖలాల్లేవు. ప్రమోషన్లు కల్పిస్తే విద్యారంగానికి మేలు జరుగుతుందనీ, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయనే విషయాలను విస్మరించి, కేవలం ఉపాధ్యాయులకు ప్రయోజనం కల్పించే అంశంగా ఉన్నతాధికారులు చూడడమే అసలు విషాదం.
కలిసికట్టుగా కృషి
ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు ఈ నెల ఎనిమిదిన వనపర్తి బహిరంగసభలో, మర్నాడు శాసనసభలో ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించడంతో ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. అయితే, విద్యాశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. హైస్కూల్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ వరకే మేనేజ్మెంట్ల వారీగా ప్రమోషన్లు కల్పించాలని అధికారులు యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు మేల్కోవాలి. భేషజాలను వదిలివేయాలి. తమ మధ్య ఉన్న విభేదాలను తాత్కాలికంగానైనా పక్కనబెట్టి కల్సికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
స్కూల్ అసిస్టెంట్, హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులతో పాటు ఎంఈఓ, డైట్ లెక్చరర్, డిప్యూటీ ఈఓ, డీఈఓ పోస్టులకు సైతం పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అప్ గ్రేడెడ్ భాషాపండిట్, పీఈటీ పోస్టులకూ ప్రమోషన్లు ఇవ్వాలి. శాసనసభలో మూడేళ్ల క్రితం సీఎం ప్రకటించిన పదివేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను వెంటనే మంజూరు చేసి, పదోన్నతులు కల్పించాలి. జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ల కోసం వేలాది మంది ఉపాధ్యాయులు రెండు దశాబ్దాలుగా చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారు. జేఎల్ ప్రమోషన్లకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అవసరమైతే, చట్టం తేవాలి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలి.
మానేటి ప్రతాపరెడ్డి
టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు
98484 81028