- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ను ఆపేందుకే ఈ పొత్తా!?
ఉక్కు కరుగుతోంది. లావా చల్లారుతోంది. మేరు పర్వతం వణుకుతోంది. కఠిన నిర్ణయాలు తీసుకునే ధీశాలి ఇప్పుడు లేరు. వారిప్పుడు మహిళా రెజ్లర్ల ముందు నిలబడి ‘బేటీ బచావో’ అనలేరు. పార్లమెంటులో నిలబడి అదానీ డిఫెన్స్ కంపెనీలో చైనా జాతీయుడు పెట్టుబడి పెట్టలేదని గట్టిగా చెప్పలేరు. ఓడిశాలో వందల మంది ప్రయాణికులు చనిపోయినా రైల్వేమంత్రి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు. మళ్ళీ వీరంతా ఒకప్పుడు మన్మోహన్ సింగ్‌ను ‘తోలుబొమ్మ ప్రధాని’ అని ఎద్దేవ చేసినవారే. ఇప్పుడు వీరినే ఇంకెవరో ఆడిస్తున్నారనే అనుమానం రోజురోజుకు బలపడుతోంది.
హ్యాట్రిక్ కోసం కాంగ్రెస్!
గత ఏడాది చివర్లోనే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో జైరాం ఠాకూర్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే బీజేపీకి తొలి దెబ్బ తగిలింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం కనుక కాంగ్రెస్ కూడా దాన్ని ఘన విజయం అనుకోలేదు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర పనిచేస్తున్నదని మాత్రం అనిపించింది. ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కర్ణాటకలో బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం సామాన్యమైన విజయం కాదు. రెవెన్యూ పంపిణీలో కేంద్రప్రభుత్వం దక్షిణ భారత్‌పై పక్షపాతాన్ని చూపుతున్నదని ప్రజల్లో బలంగా ఉంది, కానీ కర్ణాటక ప్రజలు నమ్మకపోవడంతో దక్షిణాదిలో వున్న ఒక్క రాష్ట్రాన్ని కూడా బీజేపీ కోల్పోయి ‘ఇప్పుడు బీజేపీ ముక్త దక్షిణ భారతదేశం’ అయింది. దీనిని బట్టి రేపు ‘బీజేపీ ముక్త సంపూర్ణ భారతదేశం’ అనే నినాదం ముందుకు వచ్చినట్లయింది. క్రికెట్‌లో ఒక సంప్రదాయం ఉంటుంది. వరుస రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన బౌలరు మూడో బంతి విసరడానికి సిద్ధపడితే దాన్ని హాట్రిక్ బాల్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ హ్యాట్రిక్ బాల్‌ను విసరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా వికెట్ పడితే ఆ ఓటమిని బీజేపీ తట్టుకోలేదు. ఇది 2024 మ్యాచ్ (ఎన్నికల)పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడానికి ఏమి చేయడానికి అయినా బీజేపీ సిద్ధపడుతుంది.
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు దక్కడమే గాక వరుస ఉపఎన్నికల్లో మరో రెండు విజయాలు చేకూరడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తనదైన శైలిలో ప్రచారం సాగించారు. దాన్ని నమ్మి కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీ వైపు చూడటం మొదలెట్టారు. కానీ అంతలోనే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఈ ప్రచారం బుడగలా పేలిపోయింది. సంజయ్ బండి వేగానికి బ్రేకులు పడ్డాయి. బీజేపీ ఊపును చూసి వచ్చిన వారు కూడా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఉక్కబోతకు గురవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
టీడీపీ అవసరమెందుకు..
అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ ఎన్నికల ఫలితంతో టీ-బీజేపీ ఉత్సాహాన్ని కోల్పోవడంతో బీజేపీ కేంద్ర పెద్దలు కలత చెంది, పరిస్థితిని చక్కదిద్దడానికి సాక్షాత్తు అమిత్ షా రంగంలోనికి దిగి టీడీపీ నేత చంద్రబాబుకు కబురు పెట్టారు. అందుకే ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో అమిత్ షా చంద్రబాబుల సమావేశం అనేక ప్రత్యేకతల్ని సంతరించుకుంది. చంద్రబాబు గతంలో ఎన్డీయేతో మూడుసార్లు జతకట్టినా, 2019 లోక్‌సభ ఎన్నికల ముందు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీని విమర్శించారు. అయితే ఇదంతా గతం. ఏపీలో జగన్ వైసీపీని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా ఎదుర్కోలేననే చంద్రబాబు భయపడి, ఇటీవలి టీడీపీ మహానాడులో జగన్ ‘నవరత్నాలు’కు పోటీగా కొన్ని ‘వజ్రాలను’ ప్రకటించారు. దానికి అంతగా సానుకూల స్పందన వచ్చినట్టు లేదు. అందుకే 2014 మోడల్‌లో జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకోవాలని ఆతృత చూపుతున్నారు. అందుచేత ఐదేళ్ల తరువాత అమిత్ షాతో సమావేశం చాలా ఆనందాన్ని ఇచ్చి వుంటుంది. అయితే చంద్రబాబు ఎంత చేసినా, ఏపిలో బీజేపీకి జగన్‌తో ఎలాంటి ఇబ్బందీ లేదనుకోవచ్చు. ఎందుకంటే 22 మంది లోక్‌సభ సభ్యులు, ఓ డజను మంది రాజ్యసభ సభ్యులువున్నారు. అయినా కేబినేట్‌లో ఒక్క మంత్రిపదవిని కూడా ఆశించకుండ కేంద్రానికి ఉచిత సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి. అందుకే ఈ సమావేశం తెలంగాణలో జరిగే ఎన్నికల కోసం మాత్రమే జరిగిందని ఏపీ ఎన్నికల పొత్తు కోసం కాకపోయిండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్‌ను నిలవరించడానికి తనకు టీడీపీ అవసరమని బీజేపీ గట్టిగా భావిస్తోంది. దానికోసం సందర్భాన్ని బట్టి బీఆర్‌ఎస్‌తో జతకట్టడానికి కూడా ఆ పార్టీ వెనుకాడకపోవచ్చు. బీజేపీ కోరితే కేసీఆర్ కాదనలేక పోవచ్చు. ఎందుకంటే కేసీఆర్‌కి కూడా కావాల్సింది కాంగ్రెస్ పతనమే! అప్పుడే కేసీఆర్ మీద బండి సంజయ్ గొంతు తగ్గించినట్టు, కాంగ్రెస్ మీద కేసీఆర్ గొంతు పెంచినట్టు స్పష్టంగానే కనిపిస్తోంది.
ఎవరికి నష్టం!
తెలంగాణలో టీడీపీకి 10-15 నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభిమానులున్నారు. వాళ్ళు బీజేపీకి సహకరిస్తారా? సహకరించినా వాటి ప్రభావం ఎంత? అనేవి కీలక ప్రశ్నలు. పదేళ్ళు పాలించిన కారణంగా కేసీఆర్ మీద కూడా ప్రజల్లో అసమ్మతి వుంది అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావొచ్చు. మరోవైపు టి- కాంగ్రెస్ శిబిరంలో మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవలి జరిగిన కర్ణాటక ఫలితాలు, ప్రియాంక సభ కాంగ్రెస్‌లో ఉత్సాహన్ని నింపాయి. అలాగే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు కూడా సొంతగూటికి చేరుకునే ప్రయత్నాల్లో వున్నారని వినిపిస్తుస్తోంది. అయితే బీజేపీతో టీడీపీ ప్రేమాయణం ఏపీలో టీడీపీకి లాభమా? నష్టమా? అనేది కూడా పెద్ద ప్రశ్న. జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయడం టీడీపీకి లాభమే. గత ఎన్నికల ప్రచారం గుర్తున్నవారు బీజేపీతో టీడీపీ పొత్తును అవకాశవాదంగా భావించే వీలు లేకపోలేదు. అలాగే, బీజేపీ అంటే గిట్టని సమూహాలు మొత్తంగా కాకపోయినా కొంత మేరకైనా టీడీపీకి దూరం కావచ్చు. అయితే, ఏపిలో టీడీపీ లాభనష్టాలతో బీజేపీకి పనిలేదు. తెలంగాణలో టీడీపీని వాడుకోవడం వరకే దానిపని.
ఏయం ఖాన్ యజ్దానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్
9010757776