చిరుద్యోగులపై పన్ను భారం

by Ravi |   ( Updated:2024-03-10 00:45:45.0  )
చిరుద్యోగులపై పన్ను భారం
X

నెల జీతం వస్తే గాని జీవితం గడవని సామాన్య మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుల్లో పెట్టినటువంటి నిబంధనల కారణంగా ఉద్యోగులు తమ రెండు నెలల జీతాన్ని పన్ను కింద చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగికి కేవలం తన జీతమే ఆధారం. వారికి వచ్చే ఆ జీతంతోనే కాలం వెల్లదీస్తారు వారికి ఇంకా వేరే ఆదాయం మార్గాలు ఉండవు. వారి జీతంతోనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఈఎమ్ఐలతో కొట్టుమిట్టాడుతున్న ఉద్యోగస్తులకు ఫిబ్రవరి నెల వచ్చిందంటే గుండె దడ దడ కొట్టుకుంటుంది. సంవత్సరం కాలం ఉద్యోగం చేస్తే ఐటీ పేరుతో రెండు నెలల జీతం ఆదాయ పన్నుకే చెల్లిస్తే ఆ తర్వాత రెండు మూడు నెలలు కష్టంగా గడపవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఫిబ్రవరి నెల వచ్చిందంటే ఐటీపై పెదవి విరుస్తూ ఆవేదన చెందే ఉద్యోగులు, ఐటీ స్లాబులను మార్చాలని ఉద్యోగ సంఘాలు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదేళ్లుగా మారని ఐటీ స్లాబులు…

పది సంవత్సరాలుగా ఉద్యోగులపై విధిస్తున్న ఆదాయ పన్ను స్లాబులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మార్చిన దాఖలాలు లేవు. దీనిపై ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం వచ్చిన సందర్భాల్లో ప్రతిపక్షాలు గొడవ చేసి ఐటీ తను కట్టే నెల దాటిపోగానే దానిపై మాట్లాడటం లేదు, ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ అంశంపై పార్లమెంటులో పాలకపక్షం గానీ.. ప్రతిపక్షం గానీ ఎటువంటి చర్చలు లేకుండానే ముగిస్తున్నాయి. ఉద్యోగుల పక్షాన పార్లమెంట్ సభ్యులు మాట్లాడకపోవడం దురదృష్టకరమైన విషయం.

సమస్యలను పట్టించుకోని సంఘాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం విధించే ఆదాయపు పన్ను ఉద్యోగులపై ఆర్థిక భారంగా మారిన ఈ అంశంపై ఉద్యోగుల పక్షాన కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులకు పట్టింపు లేదు. ఈ విషయంపై స్లాబులను సవరించాల్సిందిగా ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి తీసుకురావడం లేదు. అదేవిధంగా ఆదాయపు పన్నులను తగ్గించే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. ఉద్యోగుల సమస్యలపై స్పందించే ఉద్యోగ సంఘాల నాయకులు ఆదాయపు పన్ను అంశంపై మాత్రం స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ సంఘాలు స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తే కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఆలోచించి ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఐటీ స్లాబుల ప్రకారం ప్రతి ఉద్యోగి సంవత్సరంలో తన ఆదాయంలో దాదాపు రెండు నెలల జీతాన్ని పన్ను రూపంగా చెల్లించాల్సి రావడంతో ఉద్యోగస్తులుఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ మౌనం ఎందుకు?

అందుకే గత కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆదాయపు పన్నుల స్లాబ్ సవరణ వెంటనే చేపట్టాలి. దీనికై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. అలాగే ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో ఉద్యోగస్తులు తమ సమస్యను ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీనిపై స్పందించి కేంద్రానికి ఐటీ స్లాబుల విధానంలో మార్పు చేయాల్సిందిగా కోరాలి.

దర్శనం దేవేందర్,

ఫిజికల్ డైరెక్టర్

99896 51768

Advertisement

Next Story