ఆషాఢం.. సంబురాల బోనం

by Ravi |   ( Updated:2022-09-03 16:31:45.0  )
ఆషాఢం.. సంబురాల బోనం
X

ఈ ఆలయంలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు, కుడివైపున మాణిక్యాలు అమ్మవారు సింహాసనంపై కొలువై ఉంటారు. పసిడి వర్ణ కాంతులు విరజిమ్మే ముఖానిందంతో అమ్మవారి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా పోత లింగన్న ప్రదేశం, మాతంగేశ్వరీ ఆలయాలు కొలువుదీరి ఉంటాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మంటప ప్రాంగణంలో 210 సంవత్సరాల కాలం నాటి వేప చెట్టు సతత హరితంగా కనిపిస్తుంది. తెలంగాణ జానపద, కళా సంస్కృతిని చాటిచెప్పే ఈ ఆలయం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇంత విశిష్టత కలిగిన ఆలయానికి అంకురార్పణ చేసిన సురిటి అప్పయ్యకు తగిన గౌరవం దక్కకపోవడం బాధాకర విషయం.

షాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, వాటి పరిసర ప్రాంతాలలో బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. లష్కర్ బోనాలుగా పిలువబడే ఉజ్జయినీ మహంకాళి జాతర ఇదే నెలలో జరుగుతుంది. గోల్కొండ, లాల్ దర్వాజా బోనాలు కూడా ఈ నెల ప్రత్యేకమే. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతోపాటు 1,016 బోనాలు సమర్పించారు. ఇది యూనివర్సల్ రికార్డుగా నిలిచిపోయింది. రెండు శతాబ్దాలకు ముందు సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య ముదిరాజ్ బ్రిటిష్ సైన్యంలో పని చేసేవాడు. 1813లో అతడిని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి డోలీ బేరర్‌గా బదిలీ చేశారు. సరిగా అదే సమయంలో హైదరాబాదులో కలరా సోకి వేలాది మంది చనిపోతున్నారు. ఈ విషయం తెలిసి ఎంతో వేదనకు గురైన అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని శరణు వేడాడు.

హైదరాబాదులో కలరా తగ్గితే అమ్మవారి ప్రతిమను అక్కడ ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తామని మొక్కుకున్నాడు. ఇక్కడ క్రమంగా వ్యాధి తగ్గిపోవడంతో 1815లో హైదరాబాదుకు వచ్చిన అప్పయ్య తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి పాత బోయిగూడకు దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి కర్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో అప్పయ్య అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసంలో కావడంతో ఇక్కడా అదే సమయంలో అమ్మవారి జాతర జరిపారు. పక్కనున్న పాతబావిని బాగుచేసే క్రమంలో అమ్మవారి మాణిక్యాల విగ్రహం దొరికింది. దానిని కూడా అమ్మవారి పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారుగా పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి బోనాల పండుగ మొదలైంది. 1864లో కర్ర విగ్రహాలను తీసివేసి ఇప్పుడున్న విగ్రహాలను ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మించారు. యేటా గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాక ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం అమ్మవారికి ఎదుర్కోలు జరుగుతుంది. తర్వాత 15 రోజులపాటు నగరంలో ప్రతీ ఇంటిని అమ్మవారు సందర్శించి ఆశీర్వదిస్తుందని నమ్మకం. 15వ రోజున ఉదయం నాలుగింటికి ప్రధాన మంగళహారతితో మొదలయ్యే జాతరను లష్కర్ బోనాలని పిలుస్తారు.

ఇప్పుడే నిర్వహించడానికి కారణం

ఈ జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. అమ్మవారికి శివసత్తులతో, పోతురాజుల నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. అందుకే భక్తులు బోనం కుండలో భోజనం తయారు చేసి, వేప రెమ్మలతో, మామిడాకుల తోరణాలతో, పసుపు కుంకుమ లేక, తెల్ల ముగ్గుతో అలంకరించి, దానిపై ఒక దీపం పెడతారు. దీంతోపాటు పాలు, పెరుగు, బెల్లం లేదా ఉల్లిపాయలతో కూడిన మట్టి లేక రాగి బోనం కుండలను మహిళలు తలపై పెట్టుకొని అమ్మవారి గుడికి చేరుకుంటారు.

ఈ మహా పర్వదినాన్ని ఆషాఢ మాసంలోనే జరపడానికి అప్పయ్య ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో దర్శించుకోవడం ఒక కారణమైతే, ఇదే మాసంలో ఆడబిడ్డలు మెట్టింటి నుంచి పుట్టింటికి రావడం కూడా మరో కారణం. అందుకే తెలంగాణ ప్రజలందరూ మహంకాళి అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి నూతన వస్త్రాలను బహుకరించి, ఒడి బియ్యం పోసి తమ మొక్కులు తీర్చుకుంటారు. జాతర చివరి రోజున అమ్మవారు ఒక జోగినిని ఆవహించి భవిష్యవాణిని తెలుపుతారు. 1953 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నది. జాతరకు సుమారు 40 నుంచి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

ఆయనకు గుర్తింపు దక్కాలి

ఈ ఆలయంలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు, కుడివైపున మాణిక్యాలు అమ్మవారు సింహాసనంపై కొలువై ఉంటారు. పసిడి వర్ణ కాంతులు విరజిమ్మే ముఖానిందంతో అమ్మవారి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా పోత లింగన్న ప్రదేశం, మాతంగేశ్వరీ ఆలయాలు కొలువుదీరి ఉంటాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మంటప ప్రాంగణంలో 210 సంవత్సరాల కాలం నాటి వేప చెట్టు సతత హరితంగా కనిపిస్తుంది.

తెలంగాణ జానపద, కళా సంస్కృతిని చాటిచెప్పే ఈ ఆలయం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇంత విశిష్టత కలిగిన ఆలయానికి అంకురార్పణ చేసిన సురిటి అప్పయ్యకు తగిన గౌరవం దక్కకపోవడం బాధాకర విషయం. ఇప్పటికీ ఆ కుటుంబంలో ఏడో తరంవారికీ గుర్తింపు లేదు. ప్రభుత్వం పునరాలోచించి ఈ ఆలయ స్థాపకుడు అయిన సురిటి అప్పయ్య ముదిరాజ్ విగ్రహాన్ని నెలకొల్పి, వారి కుటుంబ సభ్యులకు ఆలయపాలనలో కీలక బాధ్యతలు అప్పగించాలి.

డా. పోలం సైదులు ముదిరాజ్

94419 30361

Advertisement

Next Story