- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు
తమ వృత్తినే పవిత్ర కార్యంగా భావించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజ సేవకులుగా, నవభారత ప్రగతిశీల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రూప శిల్పులుగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యా య దినోత్సవ శుభాకాంక్షలు. ఆధునిక సాంకేతిక యుగంలో విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో బంది కావడంతో వారు టీచర్లను వ్యాపార వస్తువులుగా, మర యంత్రాలుగామార్చారు. దీంతో వారిలోని కొంతమంది సమాజ శ్రేయస్సును మరిచి, కార్పొరేట్ శక్తుల లాభార్జన కోసమే పని చేయాల్సిన దుస్థితి దాపురించింది.
భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. ప్రపంచ దశను మార్చిన, మార్చుతున్న అనేక మంది ప్రముఖులను ఈ సమాజానికి అందించిన క్రాంతి ప్రదాతలు ఉపాధ్యాయులు. విశిష్ట స్థానంలో ఉన్న ఉపాధ్యాయులకు నాటితో పోల్చితే నేడు సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గాయి. దీనికి కారణం కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు, ఉపాధ్యాయుల స్వలాభాపేక్ష. వ్యాపార దృక్పథం, సోషల్ మీడియా ప్రభావం.
ఆదర్శ ఉపాధ్యాయులు వీళ్లే..
అనేక మంది గురువులు సమాజం కోసం వారి జీవితాలను, జీతాలను త్యాగం చేస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో... బిహార్ రాష్ట్రంలో కరోనా సమయం నుంచి విద్యార్థులు సరిగా తరగతులకు హాజరు కావడం లేదని, వారికి సంతృప్తికరంగా పాఠాలు చెప్పడం లేదని భావించి ఓ కళాశాలలో లాలన్ అనే ప్రొఫెసర్ తన 33 నెలల జీతం 22 లక్షల రూపాయలని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. బోధించకుండా జీతం తీసుకుంటే అది నా బోధనావృత్తికే అన్యాయం చేసినట్లు అని అధికారులకు లాలన్ లేఖ రాసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇక ఉపాధ్యాయులు తలుచుకుంటే విద్యార్థుల జీవన రూపురేఖల్ని మార్చేయగలరని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం కాలనీ ప్రాథమిక పాఠశాలకి చెందిన ఉపాధ్యాయిని శ్రీలత. తను పనిచేస్తున్న ప్రాంతంలో పాఠశాల లేకపోవడంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రతి నెల మూడున్నర వేల రూపాయలు అద్దె కడుతూ తన భర్తతో కలిసి సర్వే చేసి ఆ గ్రామంలో ఉన్న 40 మంది బడి ఈడు పిల్లల్ని గుర్తించి వారందరినీ పాఠశాలలకు తీసుకువచ్చి పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఆమె కృషిని గుర్తించిన జిల్లా కలెక్టర్ పాఠశాలకు పక్కా భవనం కోసం ₹20 లక్షలు విడుదల చేశారు. శ్రీలత వంటి వారు ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచారు.
ఉపాధ్యాయుల మార్గదర్శనంలోనే..
నాడు ఉపాధ్యాయులు వారు పనిచేసే ప్రాంతంలో నివసిస్తూ ప్రజలతో మమేకం అయ్యేవారు. వారి కష్టసుఖాల్లో భాగస్వాములై, అనేక సామాజిక ఉద్యమాలకు రూపకర్తలుగా మారారు. సామాజిక సమస్యలపై ప్రజలతో పాటు వీరు కూడా ముందు వరుసలో ఉండి ప్రజల కోసం పోరాడేవారు. అందుకే ప్రజల్లో ఉపాధ్యాయులను గొప్ప వ్యక్తులుగా చూసేవారు. అయితే నాటితో పోల్చుకుంటే నేటితరం ఉపాధ్యాయుల్లో కొంతవరకు సామాజిక స్పృహ తగ్గిందని చెప్పవచ్చు. ప్రజా ఉద్యమాల్లో వీరి భాగస్వామ్యం కూడా తగ్గింది. ప్రగతిశీల చైతన్యపూరిత భావజాలంకు బదులుగా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, స్వార్థచింతన విద్యారంగంతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా నెలకొన్నాయి. దీంతో ప్రజలకు ఉపాధ్యాయులకు మధ్య అవినాభావ సంబం ధం తగ్గింది. గతంతో పోలిస్తే నేటితరం ఉపాధ్యాయులపై ప్రజ ల్లో ప్రేమ అభిమానాలు, గౌరవం కూడా కొంతమేర తగ్గాయి. దీర్ఘకాలికంగా ఇది సమాజానికి చేటు చేస్తుంది. ఆరోగ్యవంతమైన, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం.
నేటి బాలలే రేపటి పౌరులు. వారికి నైతిక విలువలు, మానవీయత, శాస్త్రీయ పరిజ్ఞానం పర్యావరణ పరిరక్షణ, ప్రగతిశీల భావనలు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు బోధించి రాబోయే తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఉపాధ్యాయుల మార్గదర్శనంలో నవభారత నిర్మాణం జరుగుతుందని, ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశిద్దాం.
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)
పాకాల శంకర్ గౌడ్
98483 77734