- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫాసిజం.. ఓ అందమైన వికృతరూపం!
కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చూశాను. ఎవరో ఒక యువతి అన్నం పళ్లెం పట్టుకొని ఆవు పక్కన కూర్చుంది. అక్కడ కింద పడ్డ పేడ తీసి పళ్లెంలో వేసుకుని, అన్నంతో పాటు కలుపుకొని తింది. అలాంటి వీడియో చూస్తే ఎవరికైనా అసహ్యం కలగాలి. నాకెందుకో భయం వేసింది. భారత రాజ్యాంగ రూపకర్తలకు కోటి దండాలు పెట్టాలని అనిపించింది. వాళ్లు గనక మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించకుండా ఉంటే, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా ఉంటే ఏం జరిగేది? రాచరిక వ్యవస్థలో ఇటువంటి వాళ్లు గనక రాజులై ఉంటే తమ రాజ్యంలోని ప్రజలందరి చేత అన్నానికి బదులు ఆవు పేడ తినిపించేవారు. తినకపోతే శిక్ష విధించేవారు. అప్పుడప్పుడూ కొందరు అంటుంటారు - మనదేశానికి రాచరికమే కరెక్ట్ అని. దయచేసి కలలో కూడా అటువంటి మాట అనుకోవద్దు. చందమామ కథల్లో చదివినంత ఉదారమైన రాజులు, రాజ్యాలు ఎక్కడా లేవు. ఎవరి పరిధిలో వారు కఠినంగానే ఉన్నారు. వారి వల్ల జనం ఇబ్బంది పడ్డారు. ప్రజాస్వామ్య రాజ్యమే మనకు రక్ష.
'SALÒ', లేదా 'The 120 Days of Sodom' అనే ఈ సినిమాలోనూ అలాంటిదే ఒక సన్నివేశం ఉంది. తమ మాట వినలేదన్న కారణంతో ఒక అమ్మాయిని నగ్నంగా చేసి ఆమె చేత మానవ విసర్జితాన్ని(Feces) తినిపిస్తారు. ఈ సన్నివేశం చూడగానే ఆవు పేడ తిన్న ఆ యువతే గుర్తొచ్చింది. మానవ విసర్జితాన్ని బలవంతంగా తినే యువతిని కొంత కాలానికి దాన్ని ఇష్టంగా తినేలా తయారు చేయడమే 'ఫాసిజం'. హింసను, దుర్మార్గాన్ని, క్రౌర్యాన్ని సాధారణీకరించడమే 'ఫాసిజం'. అదే సినిమాలో మనకు అర్థమయ్యే అతి ముఖ్యమైన విషయం.
మూడు వారాలకే నిషేధం..
Pier Paolo Pasolini అనే ఇటాలియన్ దర్శకుడు 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. కవి, నవలాకారుడు, పాత్రికేయుడు, నాటక రచయిత, నటుడు. బతికింది 53 ఏళ్లు. తీసింది 20 సినిమాలు. మరో 14 సినిమాలకు రచనా సహకారం అందించారు. వాటిల్లో కొన్ని సినిమాలకు సంగీతం అందించడంతోపాటు నటించారు కూడా! తన ముక్కుసూటితనం కారణంగా బోలెడన్ని వివాదాలు మూటగట్టుకున్నారు. తాను స్వలింగ సంపర్కుడినని బహిరంగంగా ప్రకటించారు. 1975లో హత్యకు గురయ్యారు. ఆయన మరణించిన మూడు వారాల తర్వాత ఈ సినిమా విడుదలైంది. అలా 'Salo' ఆయన చివరి సినిమాగా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషల్లో రూపొందించారు. తొలుత ప్యారిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ చిత్రం, ఆపైన ఇటలీలో విడుదలైంది. ఆ తర్వాత మూడు వారాలకే ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇరాన్, ఫిన్లాండ్ తదితర అనేక దేశాల్లో ఈ సినిమాను నిషేధించారు. మనదేశంలో ఈ చిత్రం ఎక్కడా విడుదల కాలేదు. కానీ 2012లో ఢిల్లీలో జరిగిన 'The Osian Cinefan Film Festival'లో 'Section on Freedom of Expression' విభాగంలో ఈ సినిమాను ప్రదర్శించారు. అలా ఈ సినిమా తొలిసారి భారతదేశంలో అధికారికంగా ప్రదర్శితమైంది.
ఫాసిజానికి మూలాన్ని చూపించి..
ఈ సినిమాకు మూలం Marquis de Sade అనే రచయిత రాసిన 'The 120 Days of Sodom'. 1785 లో రాసిన ఈ నవల 1905లో ప్రచురితమైంది. అందులో మూలకథను తీసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో ప్రత్యేకమైన కథ అంటూ ఉండదు. ఉన్నదంతా భయంకరమైన హింస. జుగుప్స కలిగించే సన్నివేశాలు. ఇటలీలో బాగా డబ్బులున్న నలుగురు నడి వయస్కులు 18 మంది యువతీ యువకులను కిడ్నాప్ చేయిస్తారు. నాలుగు నెలల(120 రోజుల)పాటు వారిని ఒక భవంతిలో బంధించి, అన్ని రకాల హింసలూ పెడతారు. ఆ హింసల్లో శారీరక, మానసిక, లైంగిక అంశాలన్నీ కలిసి ఉంటాయి. ఆ నలుగురు నడివయస్కులకు తగ్గట్టు ఆ యువతీ యువకులను తయారు చేసే బాధ్యతను అక్కడే ఉన్న వేశ్యలు తీసుకుంటారు. రోజూ ఆ 18 మందిని పెట్టే హింసలు మనకు తెరపై కనిపిస్తూ ఉంటాయి. అదే ఈ సినిమా. దుస్తులు లేకుండా సంచరించడం, మలద్వార రతి(Anal Sex), మానవ విసర్జితాన్ని తినడం(Eating Feces), స్త్రీ వేషాల్లోని పురుషులు మరో పురుషుణ్ని పెళ్లి చేసుకోవడం, అందరూ చూస్తుండగా సెక్స్ చేయడం, అత్యాచారం, మానవ శరీర భాగాలు కోయడం.. ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. అయితే అన్నీ చాలా సహజంగా జరిగిపోతున్నట్లు కనిపిస్తాయి తప్పించి అదేదో నేరంగా,ఘోరంగా కనిపించదు.
సినిమా మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది. అన్నింట్లోనూ హింసే! చూస్తున్నంతసేపూ హింసే మన కళ్ల ముందు కనబడుతూ ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. పైకి కనిపించే దృశ్యాలను దాటి, నిశితంగా పరిశీలించి చూస్తే లోతైన విషయాలు మన కంటబడతాయి. అధికారం తమ చేతిలో ఉన్నవారు నిస్సహాయుల మీద చేసే దారుణాల తీరు ఇందులో చూడదగ్గ తొలి అంశం. తాము ఆదేశించింది తప్పక జరిగి తీరాలనే ఆలోచన ఎంత క్రూరత్వానికి ఒడిగడుతుందో చూపడం రెండో అంశం. నిండా ఫాసిజం పేరుకుపోయిన మనుషులు హింసను ఎంతగా సాధారణీకరిస్తారో చెప్పడం మూడో అంశం. ఏదో ఒక విషయంలో మేము ఆధిక్యత కలిగి ఉన్నామన్న భావనే ఫాసిజానికి మూలం అనే అతి సూక్ష్మమైన అంశాన్నీ ఈ సినిమా చూపిస్తుంది. ఆ స్థితిలో ఎవరు ఎంత క్రూరంగా మారగలరు అనేది వారికి ఉండే అవకాశాలను బట్టి ఉంటుంది.
ప్రతి సన్నివేశంలో..లోతైన అర్థం
ఈ సినిమాలోని నలుగురు నడివయస్కులూ కోపం ప్రదర్శించరు. క్రూరంగా ఉండరు. చాలా నిదానంగా, శాంతంగా మాట్లాడుతారు. తేనె పూసిన కత్తుల్లా ఉండటం ఫాసిస్టుల నైజం అని చెప్పకనే చెప్తారు. ఆ నలుగురికీ నాలుగు పదవులు ఉంటాయి. సామంతరాజు, బిషప్, న్యాయాధికారి, అధ్యక్షుడు. రాచరిక వ్యవస్థకు మూలమైన ఈ నలుగురినీ పాత్రలుగా మార్చడంలోనే దర్శకుడు Pier Paolo Pasolini ఉద్దేశం మనకు అర్థమవుతుంది. వీరంతా కలిసి యువతను ఆకట్టుకుంటూ, వారిని హింసించి తమకు అనుకూలంగా మార్చుకునే క్రమాన్ని సినిమాలో చూపించారు. వీరికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. అవి తమ ఆనందం కోసమే తప్ప అక్కడున్న యువత కోసం కాదు. వాళ్లున్న ఆ భవంతిని ఒక దేశంగా భావిస్తే, నాయకులు తమ ప్రజల్ని ఎలా హింసిస్తూ తమ పబ్బం గడుపుతున్నారో అర్థమౌతుంది.
ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం వెనుకా ఒక లోతైన అర్థం ఉంటుంది. ఓ ఫాసిస్టు తమ విసర్జితాన్ని బలవంతంగా యువతి చేత తినిపించిన సన్నివేశాన్ని గమనిస్తే, తమ ఆలోచనలను బలవంతంగా యువతకు ఎక్కిస్తున్న ఫాసిస్టు ధోరణి కనిపిస్తుంది. చిత్రంలో ఓ యువతిపై ఒక యువకుడు అందరి ముందూ అత్యాచారం చేస్తుంటే, మరో వ్యక్తి వచ్చి అతనితో కలిసి ఆ దారుణానికి తోడుగా నిలుస్తాడు. ఫాసిస్టుల రాజ్యంలో స్త్రీల మీద జరిగే దారుణాలను అడ్డుకోకపోగా, వాటికి మరింత ఊతమిస్తారనే విషయాన్ని ఆ సన్నివేశం మనకు చూపుతుంది. ఆ భవంతిలో యువతకు బలవంతపు పెళ్లిళ్లు, వారి మీద విచ్చలవిడి శృంగార చేష్టలు చూస్తే ఫాసిస్టు నాయకులు ప్రజల ఆహారం, పెళ్లిళ్లు, సంస్కృతి వంటి అంశాల మీదా పెత్తనం చేయాలని చూసే ప్రయత్నం అని తెలిసిపోతుంది.
The Progressive Struggle for Democratization of Expression and for Sexual Liberation has been superseded and cancelled out by the decision of consumerist power to grant a tolerance as vast as it is false అనేది దర్శకుడు Pier Paolo Pasolini మాట. ప్రజాస్వామ్య బద్ధమైన భావవ్యక్తీకరణ కోసం, లైంగిక స్వేచ్ఛ కోసం జరిగే పోరాటాన్ని అణచివేయడమే Consumerist Power ఉద్దేశం. దానికొక సాక్ష్యంగా నిలిచే సినిమా అది. ఇందులో ఫాసిజానికి ఉదాహరణగా ఆయన ఏ ఒక్క దేశాన్నీ, జాతినీ, మతాన్నీ చూపించలేదు. అన్నింటా పేరుకున్న అతి పెద్ద రుగ్మతే ఫాసిజం అని, అదో అందమైన వికృతరూపమని సినిమా ద్వారా కళ్లకు కట్టారు.
ఈ సినిమా లింక్ కోసం క్లిక్ చేయండి
- విశీ (సాయి వంశీ)
90108 66078