- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ భేటీ.. రాజకీయాలకు అతీతం
ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలుసుకోవడం శుభపరిణామంటూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యమ కారులు కూడా ఈ చర్యలను స్వాగతిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర సహకారం ఎంతగానో అవసరం అని అంటున్నారు. రాజకీయాలు ఏవైనా కేంద్రంతో సఖ్యత కోరే వేపుగా ఒక మర్యాదపూర్వక సంప్రదాయాన్ని పునరుద్ధరించిన తెలంగాణ ప్రభుత్వ చర్య ఆదర్శప్రాయం.
రాగద్వేషాలకు అతీతం తమ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రుజువు చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలోనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదే తరహాలో తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలుసుకొని తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలపడాలనే ఆకాంక్షతో పాటు పరిపాలనలో వ్యక్తిగత, రాజకీయ వైషమ్యాలకు తావివ్వరాదనే సంకేతాలను ముఖ్యమంత్రి తన ఆలోచనా సరళితో రుజువు చేశారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకుంటూనే మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేస్తామని ప్రకటించిన విధంగానే కార్యాచరణ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.
వైషమ్యాలను పక్కన పెట్టి..
గత పాలకుల చర్యల కారణంగా కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడంతో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమ రంగం కుదేలైంది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు జరపాల్పిన కార్యక్రమాలు, పథకాలు అటకెక్కాయి. కేంద్రం సహాయం అందిస్తామని ముందుకొచ్చినా వద్దుపో అనే ధోరణిని అవలంభించడంతో రాజకీయ వైరం పెరిగింది. వైషమ్యాలు బలపడి చివరికి ప్రోటోకాల్ నిబంధనలను కూడా తుంగలొ తొక్కిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు.
గవర్నర్‌తో కయ్యం, ప్రధానమంత్రితో వైరం లాంటి వైఖరి ఇక ముందు ఉండరాదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు బలపడాలని కోరుకుంటోంది. రాజకీయంగా సిద్ధాంతపరంగా ఉన్న విబేధాలు పాలనాపరంగా జరిగే అభివృద్ధి, సంక్షేమాలకు అడ్డుగా పరిణమించరాదని భావించింది. అందుకే ఒకడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు ఉన్న వైరం కొనసాగించరాదని నిర్ణయించుకుంది. మర్యాదలు, సహాయ సహకారాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కలిసికట్టుగా అమలు చేయడానికి ఆసక్తి కనబరిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా పయనిస్తుందనే ఆందోళనను ప్రధానమంత్రి దృష్టికి తెచ్చింది. కేంద్రం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరింది. కేంద్రం నుండి వచ్చే నిధులకు కోత విధించరాదని విజ్ఞప్తి చేసింది.
కేంద్రంతో సఖ్యత ముఖ్యం!
ఈ పరిణామాలను రాష్ట్రంలోని అభివృద్ధి కాముకులు స్వాగతిస్తున్నారు. శుభపరిణామం అని అభినందిస్తున్నారు. ఉద్యమ కారులు కూడా ఈ చర్యలను స్వాగతిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర సహకారం ఎంతగానో అవసరం అని అంటున్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించడానికి ఇదో మంచి పరిణామం అని పేర్కొంటున్నారు. కేంద్రంతో సఖ్యత లోపించడంతో విభజన హామీలు అమలుకు నోచుకోలేదన్నది జగమెరిగిన సత్యం. ఇక మీదట అలాంటి సమస్య ఉత్పన్నం కారాదన్నది ఇప్పటి ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఉద్యమ కారుల ఆకాంక్షల మేరకు కేంద్రంతో సఖ్యతతో కూడిన మెరుగైన సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సి ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నప్పటికీ తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేకపోయారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కూడా పునర్విభజన చట్టంలో పొందు పర్చబడి ఉంది. కేంద్రంతో వైరం కారణంగా గత ప్రభుత్వం ఈ రెండు కీలకమైన హామీలను సాధించడంలో ఘోరంగా విఫలమైంది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్దరణ, ఐఐఎం ఏర్పాటు అంశాల్లో కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటికి తోడు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 2,233 కోట్లు, పెండింగ్ గ్రాంట్లు మరో 1,800 కోట్లు కేంద్రం నుండి రావాల్సి ఉంది. వీటితో పాటు కేంద్ర సహాయంతో ఇంకెన్నో సాధించుకొనే అవకాశం ఉంది. అందుకే రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారు.
రాష్ట్రం నష్టపోరాదు
రాష్ట్రంలోకి పెట్టుబడులను స్వాగతించాలన్నా, మౌలిక సదుపాయాలను విస్తరించాలన్నా, జాతీయ ప్రాజెక్టులను సాధించాలన్నా కేంద్ర సహకారం తప్పనిసరి. రాజ్యాంగబద్దంగా ఏర్పడిన ప్రభుత్వాల మధ్య పరిపాలనా పరమైన సంబంధాలు బలంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకు సాగుతుందనే నానుడి నుండి గత ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని కారణంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ఇక మీదట అలాంటి పరిస్థితి ఉత్పన్నం కారాదని జనమంతా కోరుకుంటున్నారు. నిరుద్యోగం సమస్య సమసిపోవాలన్నా, వ్యవసాయ రంగం మరింత ముందుకు సాగాలన్నా, పారిశ్రామిక ప్రగతి సాధించాలన్నా, పేదరికాన్ని నిర్మూలించాలన్నా సమాజ శ్రేయస్సు దృష్ట్యా చేసే ఆలోచనలతో సాగించే ఆచరణాత్మక కార్యాచరణ అత్యంత ఆవశ్యకం. ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని ఆశిద్దాం.
తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు, నిర్బంధాలు కొత్తేమీ కాదు. పాలకుల పనితీరును బేరీజు వేయడంలో దిట్ట. ఎలాంటి ప్రలోభాలకు లొంగని మనస్తత్వం మన ప్రజలది. అందుకే పాలకులు కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించినంత కాలమే మనుగడ సాగించగలరు. ప్రజల మెప్పు పొందలేని నాడు తీర్పు ఎలా ఉంటుందో ఇటీవలి ఎన్నికలే ప్రత్యక్ష తార్కాణం. కేంద్ర-రాష్ట్ర పాలనాపరమైన సంబంధాల్లో రాజకీయ వైరుధ్యాలు, వ్యక్తిగత వైషమ్యాలకు తావుండరాదనే రాజ్యాంగ మూల సూత్రాన్ని పాటించి పాలకులు ముందుకు సాగాలని ఆశిద్దాం.
కొలను వెంకటేశ్వర రెడ్డి
రిటైర్డ్ ఎస్పీ (జైళ్ల శాఖ)
80960 95555