- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ తొలి మలి ఉద్యమాల సాక్షి
ముచ్చర్ల సత్యనారాయణ తెలంగాణ తొలి ఉద్యమం నుండి మలి ఉద్యమం వరకు పోరాడి గెలిచి నిలిచిన పోరాట యోధుడు. ఆయనది ఎక్కడ కూడా మడమతిప్పని గుణం. ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించని ధిక్కారం. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడిన రాజకీయ నేత. అనుక్షణం ప్రజలకోసం తపించి పేదలంటే ప్రేమను మూటగట్టుకున్న బుద్దిజీవి. ఏ వేదికెక్కినా పద్యం, పాట, మాట తన లయతో ఆకట్టుకునే గొప్ప భావుకత తన సొంతం.
సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేటట్లు..
ఇంతటి సద్గుణాలు ఉంచుకొని ముచ్చటంత మంత్రిగా పనిచేశారు సంగంరెడ్డి ముచ్చర్ల సత్యనారాయణ. తెలంగాణే ఊపిరిగా బతికి తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చివరూపిరిదాకా నడిసిండు. తన డిక్షనరీలో రాసుకున్న రెండు సిద్ధాంతాలు ఆయనకు అతి ప్రధానం. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన, రెండవది బహుజన రాజ్య స్థాపన. ఈ రెండు సిద్ధాంతాలు ఇంకా వెయ్యి సంవత్సరాల దాకా చెక్కుచెదరనివి. 1953లో తెలంగాణలో ఉద్యమ అలజడికి ప్రధాన బిందువు ఐన నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి విద్యార్థులను కాల్చి చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆంధ్రుల దురాగతాలను, దోపిడీ విధానాలను, సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేటట్లు తన యాస, భాషలతో చైతన్యం చేశాడు. 1983లో కొత్తగా వచ్చిన పార్టీ టీడీపీ ద్వారా రాజకీయ కురువృద్ధుడు హయగ్రీవచారి ఓడించి చరిత్రలో చెరిగిపోని విజయాన్ని కైవసం చేసుకున్నాడు. కవిగా, రచయితగా, వక్తగా, అపారమైన అనుభవమున్నోడు. సంజీవ రెడ్డి మామ పాట ఇప్పటికీ తనతో కలిసి తిరిగిన ఉద్యమకారుల నోట పలుకుతుందంటే ఆ సాహిత్య పదునెమిటో అర్థం అవుతుంది. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బతుకు అనే పాటలో బొగ్గు ఇనుముల గనులు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ సీమలో వెలుగునోయి రతనాలు, అభివృద్ధికిచటెంతో అవకాశమున్నదోయ్, అందుకే ఆంధ్రుల ఆశమెండైపాయే అనే పాదాలు నిష్కళంక వివరిస్తాయి.
చివరి వరకూ ప్రజల తరఫున..
సత్యనారాయణ ప్రజల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించే వాడంటే కిలోమీటర్ల కొద్ది కాలినడకన గిరిజన ప్రాంతాలు తిరిగేవాడు. ఆయన వచ్చిండంటే గిరిజనులు ముఖ్యంగా కోయవాళ్ళు ఆయన చుట్టూ మూగేవాళ్ళు. ఆత్మీయంగా మంచి చెడ్డలు చెప్పుకునేవాళ్లు. స్వేచ్ఛగా మాట్లాడేవాళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ళు ఆయనను దేవుని లెక్క చూసేవాళ్ళు. ప్రజల తెలంగాణ కావాలని కొట్లాడినోడు ఒకానొక సమయంలో తన అధిష్టానాన్ని ఎదిరించినోడు. ఒకనొక చివరి సందర్భంలో నా తెలంగాణ పచ్చపచ్చగా ఉండాలని కలలు కన్నాను. సమస్త కష్టజీవులు, ఉత్పత్తి కులాలు బాగుపడాలని అందుకోసం జీవితమంతా తపించిన, పోరాడిన కానీ జరిగిందేమిటి? అంటూ ఆవేదన చెందాడు. ఒక దోపిడిదారుడు పోయి మరో దోపిడీ దొంగను అధికారంలోకి తీసుకరావడం కోసమేనా తెలంగాణ ఉద్యమం జరిగింది? దోపిడీ పీడన లేని ప్రజా తెలంగాణ కోసం మళ్లీ పోరాడాలని ఉంది. ఈ భూమ్మీద అన్యాయం దోపిడీ ఉన్నంతకాలం ప్రజల తరపున నిలబడి పోరాడాలని ఉంది. కానీ శరీరం సహకరించడం లేదు. అయినా చివరి శ్వాస వరకు ప్రజల కొరకు పోరాడాలని ఉందని ముగించారు. సమాజమంటే ఎనలేని ప్రీతి, ప్రజలంటే వల్లమాలిన ప్రేమ ఉండి తెలంగాణ కోసం తొలి మలి ఉద్యమాలకు సాక్షిగా నిలబడిన అలుపెరగని పోరాటమూర్తికి ఇవే మా జోహార్లు.
(నేడు ముచ్చర్ల సత్యనారాయణ వర్ధంతి)
-అవని శ్రీ
99854 19424