- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదివాసీల ఆరాధ్యుడు హైమండార్ఫ్
మన దేశం కాదు, మన ఊరు కాదు, మన భాష కూడా తెలియదు ఆయనకు తెలిసిందల్లా ఆదివాసీలకు అభివృద్ధిని పరిచయం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల దరికి చేరవేసేలా చేయడం..
ఆదివాసి గూడేలలో చెరగని ముద్ర, శాశ్వత స్థానం పదిలపరుచుకున్న ఆదివాసీల ఆత్మబంధువు మానవ పరిణామ శాస్త్రవేత్త దివంగత ప్రొఫెసర్ క్రిస్టోఫర్ వాన్ ప్యూరర్ హైమండార్ఫ్ ఆస్ట్రియా దేశం వియన్నా నగరంలో 1909 సంవత్సరంలో జన్మించాడు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మానవ పరిణామ శాస్త్రంలో డాక్టరేట్ పొందిన ఆయన 1936లో ఉద్యోగరీత్యా భారతకు వచ్చి నిజం కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశాడు.
మూలాలను వెతకడానికి వచ్చి..
1928 నుండి 1940 వరకు బ్రిటిష్ పాలనలో కెరమెరి మండలం జోడేఘాట్ అటవీ ప్రాంతంలో కుమ్రం భీం ఆధ్వర్యంలో జల్,జంగిల్,జమీన్ నినాదంతో నిజాం సైనికులకు గోండులకు మధ్య తీవ్ర పోరాటం జరిగింది. నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన భీమ్ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ గుట్టల్లో ఈ యుద్ధ వీరుడు అసువులు బాశారు.
ఈ నేపథ్యంలో ఆదివాసీల తిరుగుబాటుకు గల కారణాలను మూలాలను పరిశోధించడానికి నిజాం ప్రభుత్వం ప్రొఫెసర్ హైమాండార్ఫ్‌ను ఆదిలాబాద్‌కు పంపింది. అలా 1940లో ఆయన తన సతీమణి బెట్టి ఎలిజబెత్‌ను వెంటబెట్టుకొని వచ్చి ఆదివాసీల జీవితాలపై అధ్యయనం చేయడానికి జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో అడుగుపెట్టాడు. వారి రాక గిరిజనుల తలరాతలు మార్చింది. అక్కడ చుట్టూ కొండల మధ్య జీవనం సాగిస్తున్న లచ్చు పటేల్ వీరికి ఆవాసం కల్పించాడు. ఇతడు ఆదివాసీల జీవితాలను పరిశోధించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఆదివాసీల అభివృద్ధికి సూచనలు చేయడమే కాకుండా పలు ప్రామాణిక గ్రంథాలు రాశారు ‘ది గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్’ అనే గ్రంథంలో ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలను పొందుపరిచారు శక్తి వంచన లేకుండా పరిశోధన చేసి ఆదివాసీలకు జల్, జంగిల్, జమీన్‌పై పూర్తి అధికారాలు ఉండాలని ఈ గ్రంథంలో సూచించారు.
వారి బతుకుల్లో వెలుగులు నింపి..
హైమండార్ఫ్ ఆదివాసీల జీవన విధానం, వారి ఉద్యమాలను నిజాం సర్కారుకు నివేదించాకే ఆదివాసీలకు సర్వ హక్కులు కల్పించారు. ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధానికి ప్రతీకగా హైమండార్ఫ్ దంపతులు తమ కుమారుడికి లచ్చు పటేల్ అని గిరిజనుడి పేరు పెట్టుకున్నారు. కొంతకాలానికి 1990లో బెట్టి ఎలిజబెత్ కన్నుమూయడంతో ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గోండు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. 1995లో ఇంగ్లాండులో మృతి చెందిన హైమండార్ఫ్‌కు కూడా మార్లవాయిలోనే ఎలిజిబెత్ సమాధి పక్కనే సమాధి కట్టారు. వారి విగ్రహాలను కూడా గ్రామంలో ఏర్పాటు చేశారు. డార్ఫ్ మరణం తర్వాత 17 సంవత్సరాలకు అంటే 2012 ఫిబ్రవరి 27న అతని కుమారుడు లచ్చు పటేల్ అలియాస్ నికోలస్ తండ్రి అస్థికలను మార్లవాయికి తీసుకువచ్చి తల్లి సమాధి పక్కన ఉన్న తండ్రి సమాధిలో ఐక్యం చేశాడు.
ప్రతి సంవత్సరం ఇక్కడి ఆదివాసులు హైమాండార్ఫ్ వర్ధంతిని ప్రతి ఏటా జనవరి 11న గొండు సాంప్రదాయం ప్రకారం నిర్వహించి గిరిజనుల అభివృద్ధి కోసం వారు అందించిన సేవలను సహకారాన్ని స్మరించుకుంటున్నారు ప్రతి ఏటా పుష్య మాసంలో నిర్వహించే కేస్లాపూర్ నాగోబా జాతరలో గిరిజన దర్బార్ ఏర్పాటు చేయడం ఆయన పుణ్యమే. ఈ విధంగా హైమండార్ఫ్ ఒక శాస్త్రవేత్తగానే మిగిలిపోకుండా ఆదివాసీల బతుకుల్లో వెలుగులు నింపిన బాంధవ్యుడు.
(నేడు హైమండార్ఫ్ వర్ధంతి సందర్భంగా)
పెనుక ప్రభాకర్,
ఆదివాసి రచయితల వేదిక,
94942 83038
- Tags
- Haimendorf