Political War : రేవంత్.. నీ సవాలుకు మేము సిద్ధం.. టైం ఎప్పుడో చెప్పు : ప్రతిసవాల్ విసిరిన హరీష్ రావు

by M.Rajitha |
Political War : రేవంత్.. నీ సవాలుకు మేము సిద్ధం.. టైం ఎప్పుడో చెప్పు : ప్రతిసవాల్ విసిరిన హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రాజకీయ సవాళ్ళు, ప్రతిసవాళ్ళు దీపావళి మతాబుల కంటే ఎక్కువ పేలుతున్నాయి. తాజాగా మూసీ(Musi)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు(Harish Rao).. రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. మూసీ నుంచి వాడపల్లి వరకు రేవంత్ రెడ్డితోపాటు పాదయాత్ర చేయడానికి తాను, కేసీఆర్(KCR) సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు రావాలో సీఎం చెప్పాలి అంటూ ప్రతి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి అబద్దాలు ఆడటమే పనిగా పెట్టుకున్నారని మండి పడ్డారు. మల్లన్నసాగర్ లో 17 వేల ఎకరాలు ముంపుకు గురైతే 50 వేల ఎకరాలు ముంపుకు గురైందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, నిజాలు ఏమిటో కాస్త తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నానని అన్నారు. మమ్మల్ని డీల్ చేయడం కాదని, ముందు సీఎం కుర్చీకి గౌరవం ఇచ్చి.. అది చేజారకుండా చూసుకోవాలని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని తెలిపిన హరీష్ రావు.. మూసీ సుందరీకరణ పేరిట తెరలేపుతున్న రియల్ ఎస్టేట్ బాగోతానికి తాము వ్యతిరేకం అని పేర్కొన్నారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టిందని, పేదల ఇళ్ళు కూల్చితే తాము చూస్తూ ఊరుకోమని.. ఎంత దూరం అయినా వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Next Story