New Little Flower Correspondent : చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి

by Aamani |
New Little Flower Correspondent : చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి
X

దిశ, వైరా : చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ నిలుస్తుందని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ పోతినేని భూమేశ్వరరావు అన్నారు. వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బుధవారం సాయంత్రం దీపావళి సంబరాలను హట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా పండుగలు నిలుస్తాయని చెప్పారు. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి అని పేర్కొన్నారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి మన దీపావళి అన్నారు. విద్యార్థులు బాణాసంచా కాల్చి ప్రమాదాలకు గురికావద్దని చెప్పారు. విద్యార్థులు దీపాలు వెలిగించి కాలుష్యాన్ని నివారించి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగ జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పాఠశాలలోని విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులకు వారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

న్యూ లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు గ్రీన్ దీపావళి నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు నరకాసురుడు అనే రాక్షసుడు సాదుజనాలను పీడిస్తుంటే సత్యభామ శ్రీ కృష్ణుడి సమేతంగా యుద్ధభూమికి వెళ్లి నరకాసురుడిని వదించినటువంటి సన్నివేశాన్ని నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. నరకాసుర వధ గావించి, విద్యార్ధులు బంక మట్టి చేత ప్రమిదలు తయారు చేసి దీపాలు వెలిగించి కొత్త వెలుగులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాళ్లు షాజీ మాథ్యూ, భువనప్రసాద్, ఏవో సామినేని నరసింహారావు ఉపాధ్యాయులు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.







Advertisement

Next Story

Most Viewed