తెలుగు రాష్ట్రాల్లో... కోవర్ట్ ఆపరేషన్స్?

by Ravi |   ( Updated:2023-03-18 16:35:43.0  )
తెలుగు రాష్ట్రాల్లో... కోవర్ట్ ఆపరేషన్స్?
X

ఇప్పుడు రాజకీయ క్రీడలో కోవర్ట్ రాజకీయాలే అధికారాన్ని, రాజకీయాలను శాసిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఇదే మాట ప్రబలంగా వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా అంటే ఓటుకు నోటు కేసుతో మొదలుకుని ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీతో మిలాఖవుతూ ఏపీ, తెలంగాణలో రాజకీయ నేతలు నడుపుతున్న వికృత రాజకీయాలకు సంబంధించిన ఘటనలన్నీ వ్యభిచారాన్ని సైతం అవహేళన పరిచేలాగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల్లోనూ కోవర్టుల భయం ఉంది. పలు ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ ఊపు మీద ఉన్న తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసమ్మతి రాగం మొదలు కావడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉలిక్కిపడింది. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడేవారి కంటే కోవర్టులకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని, చాలా మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కాంగ్రెస్ పాటపాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి లోలోపల మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలోనూ గత కొన్నేళ్లుగా కోవర్ట్ రాజకీయాల హవా నడుస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేస్తోన్న మాట కోవర్టు. ఈ ఒక్క మాట వింటే చాలు దేశంలోని అన్ని పార్టీల్లో గుబులు రేపుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం నక్సలైట్లను ఖతం చేయడానికి పోలీసులు... పోలీసులను ఖతం చేయడానికి తీవ్రవాదులు ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చిన ఈ వ్యవస్థనే...కోవర్ట్ ఆపరేషన్స్ అని పిలిచేవారు, ఇప్పుడు రాజకీయ క్రీడలో ఈ కోవర్ట్ రాజకీయాలే అధికారాన్ని, రాజకీయాలను శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో మొదలైన కల్లోలం, హస్తం పార్టీని కోలుకోకుండా ఆగమాగం చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే! ఇదే మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలోనూ వినిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని, 2018 ఎన్నికల్లో తనతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్‌ భారీగా డబ్బులు ఇచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటనను ఆషామాషీగా కొట్టిపారేయలేం సుమా !

ఇప్పటివరకూ జరిగిన కోవర్ట్ ఆపరేషన్స్..

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కోవర్డ్ రాజకీయాలు రాజ్యమేలాయో అందరికీ తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలో మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు విషయంలోనూ (ప్రస్తుతం కోర్టులో ఉన్న ఓటుకు నోటు కేసు) చంద్రబాబు వేసిన ఎత్తుకు పైఎత్తుగా టీడీపీ పార్టీకి చెందిన వారే అధికార బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉండి, రహస్య మంతనాల విషయాన్ని కేసీఆర్‌కు ఉప్పందించి రేవంత్ రెడ్డిని ఇరికించారని అరోపణలు ఉన్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు కౌశిక్ రెడ్డి తన టీఆర్ఎస్ పార్టీలో తనకు మంచి భవిష్యత్తు ఉందని. తనతో కలిసి రావాలంటూ అనుచరులతో మాట్లాడిన ఆడియో వెలుగు చూడడంతో కోవర్ట్ రాజకీయాలు ఎంత హీనంగా ఉంటాయో అందరికీ అర్థమైంది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది, ఏకంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. ఈ సంఘటనలన్నీ వ్యభిచారాన్ని సైతం అవహేళన పరిచే లాగా ఉన్నాయనటంలో సందేహమే లేదు.

కాంగ్రెస్‌లో తెగని కోవర్టుల సెగ..

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీఆర్ఎస్‌కు కోవర్టులుగా పని చేస్తున్నారని కొంత మంది నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ఇటీవల చివరికి కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన కొంత మంది సీనియర్లు బీఆర్ఎస్ కోవర్టులని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే వీళ్లలో చాలమంది బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలని ఆశపడుతూ పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌లో కష్టపడేవారి కంటే కోవర్టులకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని, చాలా మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కాంగ్రెస్ పాటపాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి లోలోపల మద్దతు తెలుపుతున్నారని, దీనిపై అధిష్ఠానానికి చెబుతున్నా పట్టించుకున్న వారెవరూ లేరని. సాక్షాత్తు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నప్పటికి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయాలో పాలుపోక సుప్తావస్థలో ఉంది.

బీజేపీలోనూ కోవర్టుల భయం..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల్లోనూ కోవర్టుల భయం ఉంది. బీజేపీలో ఇప్పటి వరకూ నిబద్ధులైన నేతలు ఉంటారని అనుకుంటారు. కానీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆ పార్టీలోనూ భయం ...ఆందోళన కనిపిస్తున్నాయి, పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవీ, బాధ్యతలు చేపట్టి, పలు ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ ఊపు మీద ఉన్న తరుణంలో బండి సంజయ్‌పై అసమ్మతి రాగం మొదలు కావడంతో కేంద్ర నాయకత్వం ఉలిక్కిపడింది. అలాగే బీజేపీకే చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్, మరికొందరు కరీంనగర్ జిల్లా నాయకులు సాక్షాత్తు ఆ పార్టీ అధినేత బండి సంజయ్ పైన చేసిన కామెంట్లు రాజకీయ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటని గట్టిగా ప్రయత్నం చేస్తున్న తరుణంలో అసమ్మతి రాగాల వెనుక ఉన్నది ఎవ్వరనే విషయంలో కేంద్ర నాయకత్వం తీవ్రంగా తర్జనభర్జనలు పడుతోంది.

బీఆర్ఎస్ పార్టీలోను...

ఈ మధ్య జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీలోనూ కోవర్టులున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌లోకి పక్కపార్టీల నుంచి పెద్దఎత్తున నేతలు రావటంతో.. ముందు నుంచి ఉన్న నేతలకు భయం పట్టుకుంది. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లని గులాబీ బాస్ చెప్పటంతో.. అది ఇంకా ఎక్కువై ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరు కాస్తంత కోవర్ట్‌గా మారిపోతుందని అంటున్నారు..

ఎన్నిక‌ల నాటికి బీఆర్ఎస్ నుండి అనేకమంది నేత‌లు, కొంత‌మంది మంత్రులు నయానో భయానో బీజేపీలో చేరే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని స‌మాచారం. మ‌రికొంత‌మంది ఎన్నిక‌ల‌కు ఇంకాస్త స‌మ‌యం ఉండ‌టంతో అక్కడే ఉండి..అక్క‌డ జ‌రిగే విష‌యాల‌ను బీజేపీ వ్యూహ‌క‌ర్త‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేత‌లు కోవ‌ర్టులుగా మారి స‌మాచారాన్ని చేర‌వేస్తున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మంది ప్రజా ప్రతినిధులు గెలిచిన తర్వాత కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏ మాత్రమున్నా సరే... బీజేపీ గూటికి చేరిపోవడానికి ఆమోదముద్ర వేశారనే టాక్ నడుస్తోంది.

టీడీపీ × బీజేపీ × వైఎస్సార్సీపీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి బీజేపీతో సైతం పొత్తు పెట్టుకోవడానికి సైకిల్ పార్టీ నేతలు కొందరు తహతహలాడుతున్నారు. అయితే సోము వీర్రాజు పైన వైఎస్సార్సీపీ అనుకూలుడనే అపవాదు పొలిటికల్ సర్కిల్లో ఉంది.అయితే ఆ రాష్ట్ర పార్టీ అధినేతపై ఢిల్లీలో అసమ్మతి సెగలు పొగలు రావటానికి ప్రతిపక్ష టీడీపీ యే కారణమని బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వారిని ఢిల్లీ పంపి అర్జెంట్ గా బీజేపీలో చేరిపొమ్మన్నారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. వైఎస్సార్ పార్టీ ఎంపీ రఘురామరాజు వెనుక కూడా టీడీపీ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. సీఎం జగన్ తన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకుల్లో ఎవరు కోవర్టులు? ఎవరు తన పట్ల నమ్మకంగా ఉన్నారు? ఐదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించి చివరలో పార్టీలు మారే అవకాశం ఉన్న నాయకులు ఎవరు? అభిమానంతో తన వెంట ఉండే నాయకులు ఎవరు అనే జాబితా తయారు చేసుకొని అందుకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఊ.. అంటున్నారా. ఊ..ఊ.. అంటున్నారా..

ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నాయకుల వద్ద... బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకూ కూడా కార్యకర్తల మనోగతం అర్థం చేసుకోలేని ఓ సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఊ అంటారో.. ఇంకెప్పుడు ఊ ఊ అంటారో తెలియని ఒకింత ఆందోళనకర పరిస్థితి ప్రస్ఫుటంగా కనబడుతుంది. కొందరు నాయకులతో పాటు... కార్యకర్తలు కూడా పైకి ఊ అంటున్నా..ఎవరెప్పుడేదారి చూసుకుంటారో.. లేక, పార్టీల్లోనే ఉంటూ ఎవరెవరికి కోవర్టులుగా మారి అధికార పార్టీలకు షాక్ ఇవ్వపోతున్నరనే టాక్ ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయిస్తుంది సుమా !

డా. బి. కేశవులు నేత. ఎండి.

చైర్మన్ , తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story