మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడెవరు?

by Ravi |   ( Updated:2022-11-30 18:45:15.0  )
మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడెవరు?
X

పూర్వకాలపు చరిత్రను నమోదు చేయడంలో ఆధారాలను సేకరించడంలోనూ, వాటిని తులనాత్మకంగా పరిశీలించడంలోనూ, చివరకు వాటిని భావితరాలకు అందించే క్రమంలోనూ చరిత్రకారులకున్న కొన్ని పరిమితులు, మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫలితంగా ఇవాళ మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆనవాళ్లు, లిఖిత సాహిత్యం, విషయ వివరాలకు పూర్తి విశ్వసనీయతను ఆపాదించడంలో అనేక విమర్శలున్నాయి. కానీ, మన కాలంలో, మన కళ్ల ముందు చోటుచేసుకున్న సంఘటనలు, పరిణామాలను గ్రంథస్తం చేయడంలోనూ, విశ్వసించడంలోనూ, వాటిని భవిష్యత్ తరాలకు ఉన్నది ఉన్నట్లుగా అందించే ప్రయత్నంలోనూ చరిత్రకారులు చొరవ చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

2009లో ప్రారంభం అయ్యిందనుకుంటున్న మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరునిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన పోలీసు (పుట్టకొక్కుల) కిష్టయ్య(P Kistaiah) అత్యంత సాహసోపేత త్యాగనిరతిని నమోదు చేయడంలో నిజాయితీతో కూడిన ప్రయత్నాలు జరగకపోవడం బాధాకరం.

తెలంగాణ మీద ప్రేమతోనే

దాదాపు 18 సంవత్సరాలపాటు పోలీను కానిస్టేబుల్‌గా నిజామాబాద్‌ జిల్లాలో అత్యంత ప్రతిభావంతంగా పని చేసి ఉమేశ్‌చంద్ర స్మారక అవార్డుతోపాటు పదిహేను సార్లు ప్రశంసా పత్రాలను అందుకున్న పుట్టకొక్కుల కిష్టయ్య 1 డిసెంబర్‌ 2009 తెల్లవారుఝామున రెండు గంటల ప్రాంతంలో సెల్‌టవర్‌ ఎక్కారు. భార్య, ఇద్దరు పిల్లలు, అనేక మంది పోలీసులు, అధికారులు చూస్తుండగానే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు(constable committed suicide for telanagana movement). 2009 నవంబరు 29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న కేసీఆర్ కరీంనగర్‌లోని ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరిన సందర్భంలో అల్గునూరు వద్ద పోలీసులు అడ్డగించి వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో కిష్టయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదేమోనన్న బాధతో ఆత్మబలిదానానికి పూనుకున్నారు.

పోలీసు శాఖలో భద్రమైన ఉద్యోగం, సాధించిన అవార్డులు, రివార్డులతో ప్రత్యేక గుర్తింపు, భార్య, ఇద్దరు చురుకైన పిల్లలతో ఆనందమయ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న పోలీసు కిష్టయ్యకు ఎలాంటి ఆర్థిక, మానసిక సమస్యలు లేవు. పోలీసు శాఖలో చేరినప్పటి నుంచీ నక్సలైట్ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఎస్‌ఐబీ., స్పెషల్‌ బ్రాంచ్‌ తదితర ప్రత్యేక విభాగాలలోనే విధులను సమర్థవంతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలనే బలమైన ఆకాంక్షతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉద్యమంలో తొలి అమరునిగా(Telangana first immortal) చరిత్రలో నిలిచిపోయారు.

Also read: తెలంగాణ ఉద్యమకారులు ఎటు? వారి ఆశలు ఏంటి?

తగిన ప్రచారం లేకనే

పోలీసు కిష్టయ్య బలిదానానికి సంబంధించిన సంఘటన మారుమూల కామారెడ్డి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది రాజకీయంగా ప్రాధాన్యతను నంతరించుకోకపోవడం, మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించకపోవడం తదితర కారణాలతో ఉద్యమ చరిత్రలో తొలి అమరత్వంగా నమోదు కాలేదు. 29 నవంబర్ 2009న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతాచారి (srikantha chary) ఆసుపత్రిలో చికిత్సపొందుతూ డిసెంబర్‌ మూడున మృతిచెందారు. ఈ సంఘటన మీద రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దేశవ్యాపితంగా అన్నివర్గాల ప్రజలను కదిలించింది. రాజకీయవర్గాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో శ్రీకాంతాచారి ఆత్మార్పణ సంఘటనే ఉద్యమ చరిత్రలో తొలి బలిదానంగా నమోదయ్యింది.

ప్రభుత్వ రికార్డులలోనూ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారిగానే నమోదు చేశారు. దీంతో పోలీను కిష్టయ్య ఆత్మార్పణం మరుగున పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పరీక్షలలోనూ, విశ్వవిద్యాలయాల పరీక్షలలోనూ ఉద్యమ తొలి అమరునిగా శ్రీకాంతాచారి పేరునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆయనకంటే మూడు రోజుల ముందు వీర మరణం పొందిన పోలీసు కిష్టయ్య తొలి అమరునిగా నమోదు కాకపోవడం విచారకరం.

Also read: బతకలేని తెలంగాణగా మార్చారు

అధికారికంగా వర్ధంతి జరపాలి

ఉద్యమంలో సుమారు 1200 మంది యువతీయువకులు ప్రాణాలను అర్పించారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చరిత్రాత్మకమే. ఉద్యోగుల నుంచి ఆత్మబలిదానం చేసుకున్నది పోలీను కిష్టయ్య ముదిరాజ్‌ మాత్రమే. ఆయన త్యాగాన్ని చరితార్థం చేయడంలోనూ, స్మరించుకోవడంలోనూ పోలీసులుగానీ, ఉద్యోగులుగానీ కనీస శ్రద్ధ చూపకపోవడం ఉద్యమ శ్రేణులను కలచివేస్తున్నది. 'తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ' మాత్రమే పోలీసు కిష్టయ్య అమరత్వాన్ని యేటా స్మరించుకుంటున్నది.

మహాసభ చొరవతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీను కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించారు. ఆయన భార్య పద్మావతికి, కుమారుడు రాహుల్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కూతురు ప్రియాంకకు మెడిసిన్‌లో ఉచితంగా సీటు ఇప్పించి చదివించారు. కరీంనగర్‌లో స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణానికి నహాయం అందించారు. అయినా, మలి ఉద్యమంలో తొలి అమరునిగా పోలీసు కిష్టయ్యను అధికారికంగా గుర్తించాలి. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలి. ఆయన పేరిట పోలీసు శాఖలో ఉత్తమ సేవా అవార్డును నెలకొల్పాలి. ఆయన వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి. అదే రోజున అవార్డును అందజేయాలి. ఉద్యోగ సంఘాలు కూడా పోలీసు కిష్టయ్య త్యాగానికి తగిన గుర్తింపును, గౌరవాన్ని కల్పించాలి.

(నేడు పోలీసు కిష్టయ్య 13వ వర్ధంతి)


పిట్టల రవీందర్‌

ముదిరాజ్ అధ్యయన వేదిక వ్యవస్థాపకులు

99630 ౬౨౨౬౬

READ MORE

సంగారెడ్డి వాసులకు అలర్ట్.. జిల్లాలో నెలరోజుల పాటు పోలీసు యాక్ట్!

Advertisement

Next Story

Most Viewed