CJI DY Chandrachud: కొత్త సీజేగా సంజీవ్ ఖన్నా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?

by Mahesh Kanagandla |
CJI DY Chandrachud: కొత్త సీజేగా సంజీవ్ ఖన్నా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud) పదవీకాలం ఆదివారం ముగియనుండటంతో సోమవారం(నవంబర్ 11) ఆ బాధ్యతలను జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna) తీసుకోనున్నారు. 51వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే 13వ తేదీన(65 ఏళ్లు నిండటంతో) విరమణ పొందనున్నారు. ఎందరో ఉద్ధండులు అందించిన బాధ్యతలను నిర్వర్తించడం గర్వంగా ఉన్నదని, తదుపరిగా ఈ బాధ్యతలు చేపట్టే సామర్థ్యాలు జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పుష్కలంగా ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా గురించిన వివరాలు తెలుసుకుందాం.

జస్టిస్ ఖన్నా ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ సభ్యులు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా కుమారుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1980లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఆ తర్వాత క్యాంపస్ లా సెంటర్‌లో లా చదువుకున్నారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా అనేక కేసుల్లో హైకోర్టులో వాదించారు. 2005లో ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందిన ఆయన 2006లో పర్మినెంట్ అయ్యారు. హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయిన అతికొద్ది మందిలో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒకరు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకం, జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును ఎత్తిపట్టిన సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed