భూ భారతి చట్టం ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తుంది

by Sridhar Babu |
భూ భారతి చట్టం ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తుంది
X

దిశ,సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భూ భారతి చట్టం భరోసా కల్పిస్తుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పెనుబల్లి పట్టణంలో కొత్తగూడెం రోడ్డులో స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కల్లూరు, పెనుబల్లి మండలాలకు చెందిన 157 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తో కలిసి ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టాన్ని ఎన్నికల సమయంలో బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్లే ప్రజా ఆకాంక్ష మేరకు ధరణి చట్టాన్ని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు.

భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి వేదికగా మారుతుందని అన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేదోడి ఇల్లు గుర్తొచ్చేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరు చెప్పి రెండుసార్లు ముఖ్యమంత్రి అయి పేదోడిని మోసం చేశారని ఎద్దేవా చేశారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలో 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మించి పేదోడి ఇంటి కల నెరవేరుస్తామని అన్నారు. అనంతరం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, పెనుబల్లి మండలం ఎమ్మార్వో, ఎంపీడీఓ, కల్లూరు ఆర్డీఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed