- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమకారులు ఎటు? వారి ఆశలు ఏంటి?
గద్దర్బీజేపీ సభకు వెళ్లారు. గాంధీభవన్‌లో తేలారు. చెరుకు సుధాకర్‌ను రాహుల్‌గాంధీ పిలిపించుకున్నారు. చాలా మంది ఇదే తరహాలో ఎదురుచూపులలో ఉన్నారు. ఇప్పుడు అసలైన ఉద్యమకారులు ఎటు వెళ్లాలి? ఎటు వెళ్తున్నారు? అనేది మాత్రం అస్పష్టం. గులాబీ జెండా నీడకు వెళ్లలేరు. మూసేశారు. బీజేపీలో ఇముడలేమనే భావన. ఈటల రాజేందర్, స్వామిగౌడ్, విఠల్ వంటివారు బీజేపీలో చేరినా, ఈటల మినహా మిగిలిన వారు ఎప్పుడో ఓసారి కనిపిస్తున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్. అందులో రెడ్డి వర్గీయుల లాబీయింగ్. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఉద్యమకారులది మరో పరిస్థితి. బయటకు వెళ్లలేక, అక్కడ ఉండలేక తల్లడిల్లుతున్నారు. జెండా ఎత్తుకుని ఉద్యమంలో పని చేసినందుకు ఏదో ఒక పదవి రాకపోతుందా? అని ఏండ్ల నుంచి చూస్తున్నారు.
2014కు ముందు తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై వేసుకుని పాటలు, రాతలు, ఆటలతో హోరెత్తించిన ఉద్యమకారులు ఇప్పుడు ఎటువైపు ఉన్నారు? ఎవరి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు? అసలు వారిని ఎవరు దగ్గరకు తీసుకుంటారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఉద్యమ సమయంలో ఉద్యమకారులు కేసీఆర్‌ను తమలో ఒకడిగా చూసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ చేతులలోకి రాష్ట్రం వెళ్లింది. 'జై తెలంగాణ' నినాదాన్ని విశ్వవ్యాప్తం చేసినవారు మాత్రం కేసీఆర్‌కు దూరమయ్యారు.
తప్పనిసరి పరిస్థితులలో కొందరు గులాబీ జెండా పట్టుకున్నారు. మరికొందరు 'బానిస బతుకు' అంటూ బయటకు వచ్చారు. టీఆర్‌ఎస్ రెండు టర్మ్‌ల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్యమకారులు ఏం చేయాలో, ఎవరు పిలుస్తారో? అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులంటే ఒక్క కోదండరాం, ఒక గద్దర్. ఒక ఇన్నారెడ్డి, చెరుకు సుధాకర్, ప్రజా కవులే కాదు, తెలంగాణ జెండా ఎత్తుకుని రోడ్డు మీద బైఠాయించిన వారందరూ ఉద్యమకారులే. ఇలాంటి కొంతమందికి ఇంకా జనాన్ని కదిలించే శక్తి ఉంది. సరైన వేదిక లేకపోవడంతో శక్తిహీనులుగా మారారు.
చరిత్ర గతిని మార్చి
'మిలియన్ మార్చ్' తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పింది. ఢిల్లీని హెచ్చరించింది. 'తెలంగాణ స్వపరిపాలన కోరుకుంటున్నదని, ప్రజాస్వామ్య దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా సవతి తల్లి ప్రేమతో బతకలేం అని' తేల్చి చెప్పింది. పార్టీలు, నేతల రాజకీయాలు కాదు, తమది ప్రజా పోరాటం అని ప్రకటించింది. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల నేతలంతా ప్రజలతో కలిసి వచ్చిన కార్యక్రమం అది. ఫ్రొ. కోదండరాం పిలుపుతో కదిలిన తెలంగాణ ఉద్యమకారుల కవాతు అది. అరబ్‌లో జరిగిన 'తెహ్రా స్క్వేర్'' ముట్టడిని స్ఫూర్తిగా తీసుకుని కదిలిన ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండడానికి కోదండరాంను ముందే అరెస్ట్ చేశారు. కేసీఆర్ మిలియన్ మార్చ్‌కు కనీసం బయలుదేరనే లేదు. హరీశ్‌రావు ఒక్కడే బోటు సహయంతో రాగలిగారు. కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ ప్రజలతో కలిసి వచ్చారు. దీంతో తప్పనిసరై కేసీఆర్ ట్యాంక్‌కు బండ్ చేరుకున్నారు. నిర్బంధాలు, హౌజ్ అరెస్టులు, హెచ్చరికలు, బాష్పవాయు గోళాలు, పారా మిలటరీ దళాలు, పోలీసుల దాడులు 'మిలియన్ మార్చ్'ను అడ్డుకోలేకపోయాయి. జేఏసీ ద్వారా ప్రొ. కోదండరాం ఈ కార్యక్రమం చేశారని, అందుకే కేసీఆర్ కానీ, తెలంగాణ సర్కార్ కానీ 'మిలియన్ మార్చ్' పేరెత్తరనే విమర్శలున్నాయి.
ఉద్యమ నేతలు చెల్లాచెదురు
ప్రొ. జయశంకర్ ఫ్రొ. కోదండరాం, విద్యాసాగర్‌రావు, గద్దర్, మంద కృష్ణమాదిగ, ఆర్. కృష్ణయ్య, గాదె ఇన్నారెడ్డి, చెరుకు సుధాకర్, టైగర్ నరేంద్ర, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌సహా ప్రజా గొంతుకలై నిలిచి ఆడిపాడినవారే. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే 'తెలంగాణ' నినాదాన్ని ఎత్తుకున్న స్వామిగౌడ్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి, జూపల్లి రాజేందర్‌రావు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. వీరిలో చాలీ మంది కేసీఆర్కువ్యతిరేకంగా మారారు. శ్రీకాంతాచారి ఆత్మాహుతితో రగిలిన ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పుడు ప్రభుత్వానికి నిషేధిత ప్రాంతంగా మారింది. తెలంగాణ కోసం ఉరికిన విద్యార్థి నేతలు ఇప్పుడు సీఎం, మంత్రులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి అడుగుపెడితే తరిమికొడుతున్నారు.
సకల జనుల సమ్మెలో భాగంగా బస్సులను రోడ్డుపై ఆపిన ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు ఉనికి కోసం తండ్లాడుతోంది. 'బస్సును తిప్పమంటే తిప్పం' అంటూ రోడ్డుపై బైఠాయించిన అశ్వత్థామరెడ్డి వంటివారు కూడా ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. ఉద్యమంలో కేసీఆర్‌తో నడిచిన ప్రజా సంఘాల నేతలు ఆయన పేరు చెబితే మండిపడుతున్నారు. ప్రొ. కోదండరాం తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యను ఏపీ సర్కారు పిలిపించుకుని ఎంపీ పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఉద్యమంలో తొలి టాడా కేసు ఎదుర్కొని వరంగల్జైలులో శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరారు.
ఎందుకు దూరమయ్యారు?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు ఏడాది పాటూ ఉద్యమ నేతలంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాతే మార్పులొచ్చాయి. కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుంటుండడంతో తమకు గుర్తింపు దక్కడం లేదని ఉద్యమ నేతలంతా భావించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెస్పాన్స్ రాకపోవడంతో కేసీఆర్‌కు దూరమయ్యారు. కుటుంబ పాలన అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇటీవల ఓ ఉద్యమ నేత మాట్లాడుతూ 'మరో ఇరవై ఏండ్లు వాళ్లదే అధికారం అంటున్నరు. గుండెలో కలుక్కుమంది. బల్లెం పోటు దిగినంత బాధ. ఇంకా ఇరవై ఏండ్లు వీళ్లే ఉంటరా? ఎన్నో తరాలు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ వీళ్ల కోసమేనా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు తమను తాము పరిపాలించుకోవడానికి కాదా? దుఃఖం, ఆవేదన ఎగదన్నుకొచ్చింది. ప్రజలు తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు పాలించుకోవడానికి కాదా! గులాబీ జెండాలో మాకూ హక్కున్నది అన్నందుకు కుడి భుజం లాంటి వారి మీదనే దెబ్బ వేశారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రమే మాదంటున్నారు' అంటూ వాపోయారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్, దానం నాగేందర్, గంగుల కమలాకర్ వంటి వారంతా ఆనాడు టీడీపీలో ఉంటే, నేడు టీఆర్ఎస్‌లో ఉండి రాజ్యమేలుతున్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారుల చేతులలో లేకుండా పోయింది. పసి పిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. విద్యార్థులు, ఉద్యోగులు మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదారు. అనేకమంది అసువులు బాసారు. వందలాది బలిదానాల తర్వాత 2 జూన్ 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి నిలిచి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బతుకుదెరువు పోరాటం చేస్తున్నారు. ఉద్యమాన్ని అవహేళన చేసిన వారు, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వారు, అసలు స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్లు అధికారాన్ని అనుభవిస్తున్నారు.
దారిని వెతుక్కుంటూ
గద్దర్బీజేపీ సభకు వెళ్లారు. గాంధీభవన్‌లో తేలారు. చెరుకు సుధాకర్‌ను రాహుల్‌గాంధీ పిలిపించుకున్నారు. చాలా మంది ఇదే తరహాలో ఎదురుచూపులలో ఉన్నారు. ఇప్పుడు అసలైన ఉద్యమకారులు ఎటు వెళ్లాలి? ఎటు వెళ్తున్నారు? అనేది మాత్రం అస్పష్టం. గులాబీ జెండా నీడకు వెళ్లలేరు. మూసేశారు. బీజేపీలో ఇముడలేమనే భావన. ఈటల రాజేందర్, స్వామిగౌడ్, విఠల్ వంటివారు బీజేపీలో చేరినా, ఈటల మినహా మిగిలిన వారు ఎప్పుడో ఓసారి కనిపిస్తున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్. అందులో రెడ్డి వర్గీయుల లాబీయింగ్. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఉద్యమకారులది మరో పరిస్థితి. బయటకు వెళ్లలేక, అక్కడ ఉండలేక తల్లడిల్లుతున్నారు. జెండా ఎత్తుకుని ఉద్యమంలో పని చేసినందుకు ఏదో ఒక పదవి రాకపోతుందా? అని ఏండ్ల నుంచి చూస్తున్నారు. వారికి పిలుపు వచ్చిందే లేదు. వచ్చేది ఎన్నికల సమయం. ఇప్పుడు ఎటు వెళ్దాం? ఎవరు ఇష్టంతో పిలుస్తారు? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
టి. సంపత్
94414 06811