బతకలేని తెలంగాణగా మార్చారు

by Ravi |   ( Updated:2022-09-03 14:57:17.0  )
బతకలేని తెలంగాణగా మార్చారు
X

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బెంగుళూరులో దేవెగౌడతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మూడు నెలలలో సంచలన ప్రకటన ఉంటుందని ప్రకటించారు. గత 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానాలనూ, గత ఎనిమిది సంవత్సరాల కేసీఆర్ పాలననూ సమగ్రంగా పరిశీలిస్తే 'సంచలన ప్రకటన ఉండదు, పాడు ఉండదు' అనే అభిప్రాయానికి రావచ్చు. అంతగా అయితే కేసీఆర్ తన తనయుడిని ముఖ్యమంత్రిని చేసి, పార్టీని జాతీయ పార్టీగా మార్చి, అసద్‌తో కలిసి, కాంగ్రెస్‌, బీజేపీ లేని ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాలలో కొనసాగవచ్చు.

ఇక్కడ దోచుకున్న లక్షలాది కోట్ల డబ్బుతో సర్వ సుఖాలు అనుభవించవచ్చు. అదే డబ్బును దేశం మొత్తము ఖర్చు చేస్తూ తన మీద, తన కుటుంబం మీద అవినీతి విషయములో ఈగ వాలకుండా చూసుకుంటూ, బీజేపీని తిరిగి అధికారంలోకి రప్పించడమే సారు లక్ష్యంగా ఉండవచ్చు.వీలైతే కేంద్రంలో కూడా అధికారములోకి రావాలనే కోరికతో ఉన్నారు. బెంగుళూరులోనే మాట్లాడుతూనే కేంద్రంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలనేది సమస్య కాదన్నారు కేసీఆర్. అవి పచ్చి బూటకపు మాటలు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి మాటలే చెప్పారు. తనకు ఎటువంటి పదవులొద్దు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. బంగారు తెలంగాణ పేరుతో తానే ముఖ్యమంత్రి అయ్యారు. తన కుటుంబము, తెలంగాణ ద్రోహులను అధికారంలో భాగస్వామ్యములను చేసి తెలంగాణను దోచుకుంటున్నారు. కేంద్ర అధికార పీఠం దక్కించుకునే ప్రయత్నము చేస్తున్నారు.

అభివృద్ధి మాట మరిచి

తెలంగాణను కనీసం అభివృద్ధి చేయకుండా, ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలు బతుకలేని తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. దళితులకు, భూమి లేని పేదలకు మూడెకరాలు ఇస్తానని మాయమాటలు చెప్పారు. భూమి ఇవ్వకపొగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూమిని గుంజుకుని బడాబాబులకు అప్పగించారు. జాతీయ టీవీలు, ఇంగ్లిషు, హిందీ పత్రికలలో రైతు ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రము ఏర్పడినా రైతుల ఆత్మహత్యలు ఆగలేదు.

ఇప్పటిదాకా దాదాపు 8,656 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విత్తనాలు, పురుగు మందులకు సబ్సిడీ లేదు. రుణమాఫీ లేదు. కౌలు సాగుదారులకు రైతుబంధు లేదు. పంటలకు కనీస మద్దతు ధర లేదు. మార్కెటింగ్ లేదు. నిరుద్యోగుల ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానములో ఉన్నది. ప్రతి సంక్షేమ పథకం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే తప్ప, ప్రజల ప్రయోజనము ఇసుక రేణువంత కూడా లేదు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారము తలకెక్కి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పేదల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. KG నుండి PG వరకు ఉచిత విద్య అని హామీ ఇచ్చి 12,000 పాఠశాలలను మూసేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం తెచ్చారు.

చివరకు అప్పు పుట్టని స్థితి

జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులని హామీ ఇచ్చి ఒక్కటంటే ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదు. లక్ష ఖాళీలున్నా ఉద్యోగాలను నింప లేదు. 56 లక్షల మంది పట్టభద్రులు టీఎస్‌పీఎస్‌సీలో నమోదు అయ్యారంటే యువత ఎంతగా నిరుద్యోగంతో తల్లడిల్లుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో, కార్పొరేషన్లలొ కలిపి కనీసం మూడు లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులున్నారు. వారిని పర్మినెంట్ చేయక పోగా, వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదు. ఇండ్లు లేని 40 లక్షల మంది పేదలకు రెండు పడకల గదుల ఇండ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం, కనీసం మూడు శాతం కూడా కట్టలేదు. వందలాది కోట్ల రూపాయలతో ప్రగతిభవనము, అతిధి గృహాలు, ఫామ్‌హౌస్ కట్టుకున్నారు.

ఇంకా 70 సంవత్సరాలు ఉపయోగపడే సచివాలయం కూలగొట్టి రూ. 2000 కోట్ల రూపాయలతో రాజభవనం నిర్మిస్తున్నారు. అవినీతికి అంతు లేకుండాపోయింది. నిజాం కాలంనాటి దాదాపు రెండు లక్షల ఎకరాల సర్ఫెఖాస్ భూములను ధరణి పేరుతో బినామీలకు కట్టబెట్టారు. ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమనూ స్థాపించలేదు. మూసివేసిన ఒక్క పరిశ్రమనూ తెరువలేదు. ఉద్యమములో అసువులుబాసిన అమరుల కుటుంబాలను ఆదుకోలేదు. 2014 జూన్ 2 నాటికి రాష్ట్రం అప్పు రూ.65 వేల కొట్లే ఉంటే, ఇప్పుడు రూ. 4,85,000 కోట్లకు చేరింది. తెలంగాణను అప్పులే పుట్టని స్థితి తీసుకొచ్చారు.

వారు మాత్రమే లబ్ధిదారులు

అధికార పార్టీ ఆస్తులు రూ. 1000 కోట్లకు పెరిగాయి. ప్రభుత్వం నుంచి అక్రమముగా ప్రయోజనము పొందినవారే ఈ నిధులు సమకూర్చారు. ప్రజాస్వామిక హక్కులను హరించారు. ప్రజాస్వామికవాదులపైనా, ప్రజా సంఘాల నాయకులపైనా అక్రమ కేసులు నమోదు చేసి భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేసారు. ధర్నా చౌక్‌ను ఎత్తేశారు. ఆదివాసీల బతుకులకు మేలు జరగలేదు. మద్యం అమ్మకాలకు హద్దు లేకుండా పోయింది.

అవిభక్త ఆంద్రప్రదేశ్‌లో మద్యం సంవత్సర ఆదాయం కేవలం రూ.11 వేల కోట్ల రూపాయలు కాగా, తెలంగాణలో ఆది రూ. 37 వేల కోట్లకు చేరుకున్నది. రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితిని కల్పించిన ఈ ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామిక వ్యవస్ఠకు గొడ్డలి పెట్టుగా మారాయి. బంగారు తెలంగాణ పేరుతో ప్రజల జీవితాలను నాశనం చేశారు. ప్రభుత్వ విధానాల మీద ప్రజాక్షేత్రములోనూ, న్యాయస్థానాలలోనూ పోరాడకపోతే తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షలు నెరవేరవు. భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయము జరుగుతుంది.

చిక్కుడు ప్రభాకర్

హైకోర్టు న్యాయవాది, కన్వీనర్

తెలంగాణ ప్రజాస్వామిక వేదిక

85008 10630

Advertisement

Next Story

Most Viewed