బోట్ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. ఆహ్లాదం మాటున ఆకృత్యాలు..?

by Mahesh |
బోట్ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. ఆహ్లాదం మాటున ఆకృత్యాలు..?
X

దిశ ప్రతినిధి, కర్నూలు: రాను రాను పర్యాటకం మహా పాపంగా మారబోతుందా?.. ఆహ్లాదాల మాటున ఆకృత్యాలకు పాల్పడుతున్నారా..? ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాలకు సమీపంలో కృష్ణానది నడి బొడ్డున సహజ సిద్ధంగా ఏర్పడిన ద్వీప కల్పాలు ( ఐ ల్యాండ్‌లు) పాడు పనులకు వేదికగా మారాయా..?డబ్బుల కోసం తెలంగాణ ఘాట్ బోట్ నిర్వాహకులు బరితెగిస్తున్నారా ? కాసులు, మందు, విందులు అధికారులను కట్టడి చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. నది తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ద్వీపకల్పాలు ఘాట్ బోటు నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. పర్యాటకం ముసుగులో ఆధ్యాత్మిక క్షేత్రాల సమీపంలో పాడు పనులు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. మందు, విందు, కాసులకు అలవాటు పడ్డ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం దురదృష్టకరం.

ఆధ్యాత్మిక క్షేత్రాల సమీపంలో పాడు పనులు

సరిహద్దు ప్రాంతాలైన ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్దేశ్వరం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతాల మధ్య అంటే సిద్దేశ్వరం-సోమశిల మధ్యన నిర్మించనున్న తీగల వంతెన ప్రాంతాన్ని, ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం వద్ద ఏడు నదులు కలిసే సంగమ తీరంలో వెలసిన సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు, కృష్ణానది తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ద్వీపకల్పాలు (ఐ ల్యాండ్‌లను) తిలకించేందుకు తెలంగాణ రాష్ర్టంతో పాటు కర్నాటక, మహారాష్ర్ట ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. వీరంతా సోమశిల లో ఏర్పాటు చేసిన కాటేజీలలో ఉంటూ ఇక్కడి అందాలను ఆస్వాదిస్తారు.

త్వరలో తీగెల వంతెన నిర్మిస్తే మాత్రం సినిమాలు తీసే అవకాశం లేకపోలేదు. అయితే వీరంతా ఇక్కడికి వచ్చిన సందర్భంలో జంటలు, జంటలు సంగమేశ్వరం, సోమశిల ప్రాంతాలకు మధ్యన సహజ సిద్ధంగా ఏర్పడిన ఐ ల్యాండ్‌తో పాటు అమరగిరి, చీమలతిప్ప వంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గడిపేందుకు ఇష్టపడతారు. అయితే అక్కడ జంటలు రాత్రి వేళల్లో మద్యం, డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేయడం పరిపాటిగా మారింది. ఇక్కడ వాడి పడేసిన నిరోద్ ప్యాకెట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇవేవీ బయట పడకుండా ఘాట్ బోట్ల నిర్వాహకులు నదిలో పడేస్తూ నదితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలను అపవిత్రం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

ద్వీపకల్పాలతో కాసుల వర్షం

కృష్ణానదిని దాటించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఘాట్ బోట్ల నిర్వాహకులు ఒప్పందం చేసుకుని దాటించేవారు. అయితే కొందరి స్వార్ధం కారణంగా ఏడాదికి పైగా ఘాట్ బోట్లను సంగమేశ్వరం ప్రాంతంలో తిప్పేందుకు అనుమతివ్వలేదు. ప్రస్తుతం ఇరువురి పరస్పర అంగీకారంతో మళ్లీ బోట్లు తిప్పుతున్నారు. కానీ ధరలు మాత్రం మూడింతలు పెంచారు. గతంలో ఒక్కో వ్యక్తికి రూ.40 లు, బైక్ కు రూ.60 లు ఉంటే నేడు వ్యక్తికి రూ.100లు, బైక్ కు రూ.100 ల చొప్పున వసూలు చేస్తున్నారు. సోమశిల ఘాట్ నుంచి సంగమేశ్వరం ఆలయానికి రాను పోను ఒక్కొక్కరి నుంచి రూ.200లు వసూలు చేసేవారు. నేడు రూ.400ల వసూలు చేస్తున్నారు. ఇక మినీ ఐ ల్యాండ్ కు గతంలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తే నేడు రూ.8 వేలు వసూలు చేస్తున్నారు. అమరగిరికి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తే నేడు రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అందువల్ల పర్యాటకులపై వేస్తున్న భారాలు తగ్గించాలని, అదే క్రమంలో ఆహ్లాదాల మాటున చేస్తున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ప్రసిద్ధి గాంచిన క్షేత్రాలను, నదిని అపవిత్రం చేయకుండా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, భక్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story