చాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు.. టోర్నీ జరిగేనా?

by Harish |
చాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు.. టోర్నీ జరిగేనా?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్‌‌కు భారత జట్టును పంపించమని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో టోర్నీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. 2008లో భారత్ చివరిసారిగా పాక్‌లో పర్యటించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌ల్లోనే ఎదురుపడుతున్నాయి. గతేడాది ఆసియా కప్‌‌ టోర్నీకి కూడా పాక్ ఆతిథ్య దేశంగా ఉండగా.. భారత్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ భారత్ మొదటి నుంచి పాక్‌కు వెళ్లడానికి ససేమిరా అంటూనే ఉన్నది. ఇదే విషయాన్నిఇటీవల ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్‌కు పంపించడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలియజేసింది. భారత్ నిర్ణయాన్ని ఐసీసీ.. పాకిస్తాన్ క్రికెట్(పీసీబీ)కి మెయిల్ చేసింది. టోర్నీపై సందిగ్ధం నెలకొనడంతో సోమవారం లాహోర్‌లో నిర్వహించాల్సిన షెడ్యూల్ రిలీజ్, 100 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని ఐసీసీ రద్దు చేసింది. 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరగగా.. 8 ఏళ్ల తర్వాత ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ ముందుకొచ్చింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో అసలు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా?లేదా? అన్న దానిపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ నో

చాంపియన్స్ ట్రోఫీని భారత్ బహిష్కరించలేదు. కేవలం పాక్‌కు వెళ్లబోమనే చెప్పింది. హైబ్రిడ్ మోడల్‌లో ఆడేందుకు సిద్ధమేనని ఐసీసీకి బీసీసీఐ తెలిపినట్టు సమాచారం. అయితే, హైబ్రిడ్ మోడల్‌‌కు పీసీబీ అంగీకరించడం లేదు. భారత్ తమ దేశానికి రావాల్సిందేనని మొండిపట్టుపడుతోంది. ‘హైబ్రిడ్ మోడల్ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. అలాంటి మోడల్‌ గురించి చర్చించడానికి సిద్ధం లేము’ అని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. అయితే, ఆతిథ్య హక్కులు చేజారకుండా ఉండాలంటే పీసీబీకి హైబ్రిడ్ మోడల్ తప్ప వేరే మార్గం లేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. హైబ్రిడ్ మోడల్‌లో జరిగితే భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

సౌతాఫ్రికా లేదా యూఏఈ

హైబ్రిడ్ మోడల్‌కు పాక్ ఒప్పుకోకుంటే వేదికను మార్చాలని ఐసీసీ భావిస్తున్నదట. యూఏఈ లేదా సౌతాఫ్రికాకు టోర్నీని తరలించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చూస్తుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే పాక్ ఆతిథ్య హక్కులను కోల్పోనుంది. మరోవైపు, ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీనే వీడాలని పాక్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. .

భారత్ లేకుండా సాధ్యమేనా?

టీమిండియా లేకుండా పాక్‌లోనే టోర్నీ నిర్వహించే అవకాశం ఉందా? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. అయితే, ఐసీసీ టోర్నీలను భారత్ లేకుండా ఊహించుకోవడం కష్టమే. భారత్ మ్యాచ్‌‌లకే ప్రేక్షకులతో స్టేడియాలు నిండిపోతాయి. అలాగే, టెలివిజన్, యాప్‌ల్లో కూడా టీమిండియా మ్యాచ్‌లకే వ్యూయర్‌షిప్ ఎక్కువ. కాబట్టి, టీమిండియా ఆడకపోతే బ్రాడ్‌కాస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే, టోర్నీ ఆదాయానికి కూడా గండిపడుతుంది. ఫలితంగా ఐసీసీ ఆదాయంపై భారీగా ప్రభావం చూపుతుంది. పడుతుంది. కాబట్టి, టీమిండియా లేకుండా టోర్నీని నిర్వహించే సాహసం ఐసీసీ చేయకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడమే లేక వేదిక మార్చడమో చేయొచ్చని చెబుతున్నారు.

Advertisement

Next Story