బ్యాటుతో మంధాన.. బంతితో రేణుక.. విండీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్

by Harish |
బ్యాటుతో మంధాన.. బంతితో రేణుక.. విండీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ఆ దిశగా వన్డే సిరీస్‌ను ఘనంగా మొదలుపెట్టింది. స్మృతి మంధాన బ్యాటుతో.. రేణుక సింగ్ బంతితో విజృంభించడంతో తొలి వన్డేలో భారత్ భారీ విజయం సాధించింది. వడోదర వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 314/9 స్కోరు చేసింది. స్మృతి మంధాన(91) మరోసారి రెచ్చిపోగా.. హర్లీన్ డియోల్(44), ప్రాతిక రావల్(40) రాణించారు. విండీస్ బౌలర్లలో జైదా జేమ్స్(5/45) సత్తాచాటింది. అనంతరం ఛేదనలో కరేబియన్ జట్టు 103 పరుగులకే ఆలౌటైంది. ఫ్లెచెర్(24 నాటౌట్) టాప్ స్కోరర్. భారత పేసర్ రేణుక సింగ్(5/29) ఐదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఏకపక్షంగా..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు స్మృతి మంధాన(91) అదిరిపోయే ఆరంభం అందించింది. భీకర ఫామ్‌లో ఉన్న ఆమె మరోసారి విండీస్ బౌలర్లతో ఓ ఆటాడుకుంది. ఎడాపెడా ఫోర్లు బాదింది. ఈ క్రమంలోనే సెంచరీ చేసేలా కనిపించింది. అయితే, మంధాన తృటిలో శతకాన్ని మిస్ చేసుకుంది. మంధాన దూకుడుకుతోడు మరో ఓపెనర్ ప్రాతిక రావల్(40) అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది. ఈ జోడీ తొలి వికెట్‌కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం హర్లీన్ డియోల్(44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(34), రోడ్రిగ్స్(31), రిచా ఘోష్(26) సత్తాచాటడంతో భారత్ స్కోరు 300 దాటింది. అనంతరం ఛేదనలో విండీస్ భారత బౌలర్ల ధాటికి తేలిపోయింది. పేసర్ రేణుక సింగ్ ఐదు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది. ఫ్లెచెర్ చేసిన 24 పరుగులే టాప్ స్కోర్ అంటే కరేబియన్ జట్టు ఏ విధంగా తడబడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ జట్టులో ఇద్దరు డకౌటవ్వగా.. ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. దీంతో కష్టంగా 100 పరుగుల మార్క్‌ను దాటిన విండీస్ ఆట 26.2 ఓవర్లలోనే ముగిసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడంతో తొలి వన్డేను భారత్ ఏకపక్షంగా దక్కించుకుంది.

సంక్షిప్త స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 314/9(50 ఓవర్లు)

(స్మృతి మంధాన 91, హర్లీన్ డియోల్ 44, ప్రాతిక రావల్ 40, హర్మన్‌ప్రీత్ కౌర్ 34, రోడ్రిగ్స్ 31, రిచా ఘోష్ 26, జైదా జేమ్స్ 5/45, హేలీ మాథ్యూస్ 2/61)

వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 103 ఆలౌట్(26.2 ఓవర్లు)

(ఫ్లెచర్ 24 నాటౌట్, కాంప్‌బెల్లె 21, రేణుక సింగ్ 5/29, ప్రియా మిశ్రా 2/22)

Advertisement

Next Story