IND VS SA : ఆ విషయాల్లో టీమిండియా మెరుగుపడాల్సిందే.. నేడే మూడో టీ20

by Harish |
IND VS SA : ఆ విషయాల్లో టీమిండియా మెరుగుపడాల్సిందే.. నేడే మూడో టీ20
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడో టీ20కి సిద్ధమైంది. తొలి టీ20 నెగ్గిన సూర్య సేన రెండో టీ20లో ఓటమిని పొందింది. బ్యాటుతో విఫలమైన ఆ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయ చేసినప్పటికీ ఆఖర్లో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో తడబడింది. దీంతో సౌతాఫ్రికా రెండో టీ20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నేడు సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా భావిస్తున్నది. అయితే, గత మ్యాచ్‌ల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవడం, పేసర్లు రాణించడం తప్పనిసరి.

బ్యాటర్లు, పేసర్లపై ఫోకస్

టీమిండియా బ్యాటింగ్ దళంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్ల ప్రదర్శన మరి గొప్పగా ఏం లేదు. మొదటి మ్యాచ్‌లో 200కు పైగా స్కోరు చేయడానికి కారణం సంజూ శాంసన్. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతను.. రెండో టీ20లో అతను డకౌట్ అవడం గమనార్హం. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లో(33, 20) విలువైన పరుగులు చేశాడు. డర్బన్‌లో నిరాశపర్చిన పాండ్యా.. రెండో టీ20లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్, రింకు సింగ్ నిరాశపర్చడం ఆందోళన కలిగిస్తున్నది. మూడో టీ20లోనైనా వీరు పుంజుకోవాలి. అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రతిభను చాటాల్సిన అవసరం ఉన్నది. శాంసన్, అభిషేక్ జట్టుకు శుభారంభం అందిస్తే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గి మంచి స్కోరు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు, పేసర్లు కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ జట్టుకు అండగా నిలబడ్డారు. అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్, పాండ్యాల నుంచి జట్టుకు సహకారం కరువైంది. వరుణ్, బిష్ణోయ్ 12 వికెట్లు పడగొడితే.. పేసర్లు 4 వికెట్లే తీశారు. రెండో టీ20లో వరుణ్ స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బ కొట్టడంతో భారత్ పోటీలోకి వచ్చింది. కానీ, ఆఖర్లో పేసర్లు ఆ జోరును కొనసాగించకపోవడంతో గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. సెంచూరియన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో మూడో టీ20లో భారత్ విజయం పేసర్లపైనే ఆధారపడి ఉందని క్రికెట్ వివ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అవేశ్ ఖాన్‌పై వేటు.. యశ్ దయాల్‌ అరంగేట్రం?

పేసర్ అవేశ్ ఖాన్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ వేయనున్నట్టు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్లతో రాణించినప్పటికీ భారీగా పరుగులు ఇచ్చాడు. ఇక, రెండో టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడో టీ20కి అతన్ని పక్కనెట్టి.. మరో యువ పేసర్ యశ్ దయాల్‌ను జట్టులోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మూడో టీ20తో యశ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. అర్ష్‌దీప్, పాండ్యా, యశ్ దయాల్‌తో కూడిన పేస్ దళంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో యశ్ దయాల్‌ సత్తాచాటాడు. 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.

పిచ్ రిపోర్ట్

సెంచూరియన్ పిచ్ పేసర్లకు అనుకూలించనుంది. ఆ పిచ్‌పై పేస్, బౌన్స్ లభించడంతో ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపనున్నారు. స్పిన్నర్లు కూడా అదనపు బౌన్స్ పొందనున్నారు. దీంతో బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చాల్సిందే. టాస్ గెలిచినట్టు జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. 2018లో భారత్ ఈ స్టేడియంలో ఏకైక మ్యాచ్ ఆడగా.. సౌతాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఎక్కడ చూడొచ్చంటే?

మూడో టీ20 బుధవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానుంది. స్పోర్ట్సట్ 18, స్పోర్ట్స్18 హెచ్‌డీ చానెల్స్‌లో మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. అలాగే, జియో సినిమా‌లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.

తుది జట్లు(అంచనా)

భారత్ : సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, యశ్ దయాల్.

సౌతాఫ్రికా : మార్‌క్రమ్(కెప్టెన్), హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, క్లాసెన్, డేవివడ్ మిల్లర్, పాట్రిక్ క్రూగెర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్.

Advertisement

Next Story

Most Viewed