- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశ ఖ్యాతిని ప్రపంచ యవనికపై రెపరెపలాడించిన ప్రముఖులు..
మనదేశంలో నూట నలభై కోట్ల జనాభా కలిగి విభిన్న కులాలు, మతాలు, భాషా సంస్కృతులతో భిన్నత్వంలోనే ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలో జరుపుకున్నన్ని పండుగలు ప్రపంచంలో ఏ ఇతర దేశమూ జరుపుకోదంటే అతిశయోక్తి కాదు. దేశంలో సాధారణ పండుగలతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం, ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతిలను 'జాతీయ పండగలు'గా జరుపుకుంటామన్న విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారు చేసిన త్యాగాలను మననం చేసుకోవడం పరిపాటి. స్వతంత్ర సముపార్జనలో విశేషంగా కృషి చేసిన వారితో పాటు భరతజాతి ఖ్యాతిని ప్రపంచపటాన ఇనుమడింప చేసిన ప్రముఖులను కూడా మననం చేసుకోవడం సందర్భోచితమని నా అభిప్రాయం. అలాంటి ఎందరో మహానుభావులలో కొందరిని గుర్తుచేసుకుందాము.
సీవి రామన్:
నాటి మద్రాసు రాష్ట్రం తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో 1888 నవంబర్ 7న జన్మించి సీవి రామన్‌గా సుప్రసిద్ధుడైన చంద్రశేఖర వెంకట్రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా 1930లో 'నోబెల్' పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారాన్ని సామాన్య విజ్ఞాన శాస్త్రంలో ఆసియా ఖండం నుంచి పొందిన మొట్టమొదటి శ్వేతేతరుడు. ఆయన రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. తన 18వ ఏట కాంతి ధర్మాలపై ఆయన చేసిన పరిశోధనా వ్యాసం లండన్ ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. 1954లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' పురస్కారం అందించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం 'జాతీయ సైన్స్ దినోత్సవం'గా ప్రకటించింది.
హోమీ జహంగీర్ భాభా:
1909 అక్టోబర్ 30న జన్మించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాను 'భారత అణు కార్యక్రమ పితామహుడు'గా పిలుస్తారు. దేశంలో అణ్వాయుధాల కార్యకలాపాలకు నాటి ప్రధానిని అంగీకరింపజేసేందుకు ఎంతో కృషి చేశారు. తర్వాత ఆయన పర్యవేక్షణలో ట్రోంబే, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థలు భారత అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమానికి మూలస్థంభాలుగా నిలిచాయి. దేశ అణుశక్తి రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆడమ్స్ ప్రైజ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1951,1953,1956లలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు. అణుశక్తి పరిజ్ఞానం అణుబాంబు తయారీకి బదులు దేశ దారిద్య్ర నిర్మూలనకు ఉపయోగపడాలని ఆయన అభిలాషించేవారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య:
నవ భారత నిర్మాణానికి పర్యాయపదం, పండితుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన 15 సెప్టెంబర్ 1860న కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. ఆయన మైసూర్ సంస్థానానికి దివాన్ గా పనిచేసి తర్వాత రాజు సహయంతో ఉన్నత చదువులు చదవడానికి లండన్ వెళ్ళాడు. తిరిగొచ్చాక దేశంలో గొప్ప ఇంజనీర్‌గా మన్ననలు అందుకున్నాడు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డే గా జరుపుకుంటారు. ఆయన మైసూర్‌లోని కృష్ణరాజ సాగర్, మూసీ వరదల నుంచి హైదరాబాద్ ను కాపాడే ప్రాజెక్టులను రూపొందించాడు. ఆయన సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం 'నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్'తో సత్కరించింది. 1955లో భారతరత్న పురస్కారం అందుకున్నారు.
వెంకట్రామన్ రాధాకృష్ణన్:
నోబెల్ పురస్కార గ్రహీత సీవి రామన్ పుత్రుడు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ సమీప బంధువు, ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, "రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" సభ్యుడు అయిన వెంకట్రామన్ రాధాకృష్ణన్ 1929 మే 18న చెన్నై సమీపంలో జన్మించారు. ఆయన పాలపుంతలో అణు హైడ్రోజన్ ఉనికిపై నిశిత అధ్యయనం చేసారు. బెంగళూరు లోని 'రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' డైరెక్టర్ గా ఆయన రేడియో ఖగోళ శాస్త్రం, ద్రవ స్ఫటికాలపై అవిరళ కృషి చేసారు. ఆయన ఆధ్వర్యంలో దేశంలోని ఇతర సంస్థలతో సంయుక్తంగా కృషిచేసి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు రేడియో ఖగోళశాస్త్ర అధ్యయన రంగంలో విశేష గుర్తింపు తీసుకువచ్చారు. దీంతో ఆయన అంతర్జాతీయ ఖగోళ భౌతికశాస్త్రవేత్తగానే కాక అతి తేలికపాటి విమానాలు, మర పడవల రూపకల్పనలో ఖ్యాతినార్జించారు.
ఎస్ చంద్రశేఖర్:
కృష్ణ బిలాల గురించి, అలాగే మానవులకు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలున్నట్లు నక్షత్రాలకు కూడా వివిధ దశలు ఉంటాయని తన 19వ యేట పరిశోధనల ద్వారా నిరూపించారు ఎస్ చంద్రశేఖర్. నక్షత్రాల నిర్మాణం వాటి పరిణామక్రమాల గురించి, క్రిష్ణబిలాల గురించి ఆయన చేసిన పరిశోధనలకు 1983వ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని విలియం ఏ ఫౌలర్‌తో కలిసి అందుకున్నారు. ఆయన సీవి రామన్ సమీప బంధువు. నక్షత్రాల నుండి వెలువడే శక్తి, ప్రత్యేకించి శ్వేత కుంభతార (White Dwarf) గురించి ఆయన పరిశోధనల ద్వారా వెల్లడైన విషయాలు ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టాయి.
సత్యేంద్రనాథ్ బోస్:
1894 జనవరి1న కలకత్తాలో జన్మించిన సత్యేంద్రనాథ్ బోస్ క్వాంటం మెకానిక్స్‌లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిటిక్స్, బోస్- ఐస్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణానికి కృషి చేశాడు. ప్రస్తుతం విశ్వంలో వ్యాపించి ఉన్నాయని భావిస్తున్న దైవకణాలను ఆయన హిగ్స్-బోసస్ కణాలని పాల్ డిరాక్ నామకరణం చేశాడు. ఆయన ప్లాంక్ సూత్రం, క్వాంటం సిద్ధాంతాలపై రాసిన పరిశోధనా పత్రాలతో ఏకభవించిన ఐన్‌స్టీన్ దానిని జర్మనీ భాషలోకి అనువదించి ప్రచురించారు. బోధకుడు, బహుభాషా కోవిదుడు ఆయిన ఆయన విభిన్న రంగాలలో కృషి చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సైన్స్‌పై రచించిన విశ్వపరిచయ్ పుస్తకాన్ని ఆయనకు అంకితమిచ్చారు. 1954లో మన ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
మేఘనాథ్ సాహా:
బంగ్లాదేశ్ ఢాకా సమీపంలో 1893 అక్టోబర్ 6న జన్మించిన మేఘనాథ్ సాహా ఖగోళ శాస్త్రవేత్త. ఆయన నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం వంటి ఎన్నో ధర్మాల్ని, సమీకరణాలను కనుగొన్నారు. ఆయన సూర్యకాంతిని గాజు ద్వారా ప్రసరింపజేసినప్పుడు ఏర్పడే వర్ణపటంకి(spectrum) గల కారణాన్ని ఆయన సూత్రీకరించారు. సూర్యకిరణాల బరువును, ఒత్తిడి కనిపెట్టే పరికరం రూపొందించారు. దేశంలో పరమాణు కణాల త్వరణాన్ని పెంచే యాక్సిలేటర్ ఆయన పర్యవేక్షణలోనే నిర్మితమైంది.
శ్రీనివాస రామానుజన్:
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 1887 డిసెంబర్ 22 న జన్మించారు. శుద్ధ గణితంలో ఆయనకు శిక్షణ లేకపోయినా, గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు వంటి సుమారు 3900 సమస్యలకు పరిష్కారం చూపారు. ఆయన సిద్ధాంతాలను పరిశీలించిన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ అవి కనీవిని ఎరుగనివని కితాబిచ్చాడు. ఆయన జయంతి రోజును 'జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించుకుంటారు.
జగదీశ్ చంద్రబోస్:
వృక్షాలలో కూడా ప్రాణమున్నదని మొట్టమొదట కనుగొన్న జీవశాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ 1858 నవంబర్ 30 న బెంగాల్‌లో జన్మించారు. రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్‌తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించిన ఆయనను రేడియో పితామహునిగా పిలుస్తారు. తాను ఆవిష్కరించిన క్రెస్కోగ్రాఫ్ పరికరాన్ని ఉపయోగించి విభిన్న పరిస్థితులలో మొక్కలు స్పందించే తీరును పరిశోధనాత్మకంగా నిరూపించారు. 1904 వ సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన తొలి భారతీయుడు కావడం విశేషం. తన పరిశోధనలను వ్యాపార దృక్పథంతో కాక ఇతర శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు ఊతమివ్వాలనే ఆలోచనతో వాటిని బహిర్గతపరచడం ఆయన గొప్పతనం.
విక్రం సారాభాయ్:
ఈయనని అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా పిలుస్తారు. ఈయన 1919 ఆగస్ట్ 12న గుజరాత్‌లో జన్మించారు. ఇస్రో స్థాపనలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి వినియోగించుకుంటే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించేవారు. 1957 రష్యా తొలి ఉపగ్రహం స్నూతిక్ ప్రయోగ స్ఫూర్తితో భారత భవిష్యత్ అవసరాలను ఊహించి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ స్థాపించగా ఆయన తదనంతరం ఇస్రోగా మారి ఎన్నో విజయాలను సాధించి దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను సమకూర్చుకోవడం గ్రామీణ అవసరాలను తీర్చిదిద్దేలా ఉపగ్రహాలను రూపొందించాలని పరితపించేవారు. ఆయన సేవలకు శాంతి భట్నాగర్, పద్మభూషన్, పద్మవిభూషన్ అవార్డులతో సత్కరించింది.
హర్ గోబింద్ ఖొరానా:
1968 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారత ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, ఈయన 1922 జనవరి 1న జన్మించారు. వంశపారంపర్యంగా సంక్రమించే జీవ నిర్మాణానికి దోహదం చేసే కృత్రిమ జీవకణాన్ని ఆయన ప్రయోగశాలలో సృష్టించడంతో 'జెనెటిక్ ఇంజనీరింగ్' అనే కొత్త శాస్త్ర అధ్యయనానికి తెరలేచింది. ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమం మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచబడి ఉన్నదనే విషయంతో పాటు డిఎన్ఏ ముక్కలను అతికించే డిఎన్ఏ లిగాస్ అనే జిగురు పదార్థాన్ని ఆయన కనుగొన్నారు. ఆయన పరిశోధనలు ఆధునిక జీవశాస్త్రంలో సరికొత్త విప్లవానికి నాంది పలికాయి. ఆయన 2011 నవంబర్ 9న మరణించారు.
ఇలా పరిమిత వనరులు, సౌకర్యాల లేమి లాంటి ప్రతికూలతలను సైతం తమ బుద్ధికుశలతతో అధిగమించి నవభారత నిర్మాణానికి బాటలు వేసి, అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ప్రగతి పధాన పరుగులు పెట్టిస్తూ ప్రపంచ యవనికపై దేశ జెండా రెపరెపలాడేలా తమ వంతు కృషిచేసిన శాస్త్రవేత్తలకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
యేచన్ చంద్రశేఖర్
88850 50822
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read....
ఉన్నది ఉన్నట్టు: బడ్జెట్.. అంకెలు కాదు ప్రజల భవిష్యత్తు