తెలంగాణ ఓటరు మనసులో ఏముంది? ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పీపుల్స్ పల్స్ సర్వే ఏం తేల్చింది

by Ravi |   ( Updated:2023-07-26 11:11:58.0  )
తెలంగాణ ఓటరు మనసులో ఏముంది? ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పీపుల్స్ పల్స్ సర్వే ఏం తేల్చింది
X

బీజేపీ అగ్రనాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలని గత రెండు సంవత్సరాలుగా వ్యూహరచనలు చేస్తున్నారు. అయితే వారు ఎన్ని వ్యూహరచనలు చేసినా, తెలంగాణలో బీజేపీ ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కు వేస్తున్నట్లుగా ఉంది. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో 2014లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ ఓడిపోయారు. 2014లో టీడీపీ‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ 45 సీట్లలో పోటీ చేస్తే 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రాజాసింగ్‌ మినహా మిగిలిన సిట్టింగులంతా ఓడిపోయారు. ఏకంగా 105 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. ఇది ఆ పార్టీ నిర్మాణ లోపానికి తార్కాణం.

బీజేపీకి భవిష్యత్‌ ఉందా?

2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొందింది. కానీ క్షేత్రస్థాయిలో.. ఈ నాలుగు పార్లమెంట్‌ స్థానాల పరిధిలోకి వచ్చే 28 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలను నిలపడానికి బీజేపీకి తగిన అభ్యర్థులు లేరు. అందులో కనీసం 8 స్థానాలను గెలిచే పరిస్థితి ప్రస్తుతం బీజేపీకి లేదు. ఈ 28 స్థానాల్లో ఎంత మంది గట్టి అభ్యర్థులు ఉన్నారు 2019 పార్లమెంట్‌ ఎన్నికల తరువాత అనేక మంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో చాలామందికి పార్టీ జాతీయ నాయకత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వారికి పదవులు కూడా కట్టబెడుతోంది. ఇలా పదవులు పొందిన వారు వారివారి జిల్లాల్లో కానీ, వారి వారి నియోజకవర్గాల్లో కాని పార్టీని పటిష్టపరచడానికి ఏం చేశారో ఇప్పటివరకు జాతీయ నాయకత్వం ఒక్కసారి కూడా సమీక్షించలేదు. కొత్తగా చేరిన నాయకులు వారి పాతవాసనలు వదులుకోలేక క్రమశిక్షణకు మారుపేరు అయిన బీజేపీలో గ్రూపు తగాదాలకు పాల్పడుతున్నారని మొదటి నుంచి సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

పైగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది. హుజురాబాద్‌, దుబ్బాక ఉపఎన్నికలలో గెలిచినా, అది అభ్యర్థుల బలమే తప్ప బీజేపీ బలం కాదని మునుగోడు ఉపఎన్నికతో తేలిపోయింది. బీఆర్‌ఎస్‌కి, బీజేపీ ‘బీ’ టీమ్‌ అని ప్రజల్లో ఉన్న అనుమానాన్ని కూడా నివృత్తి చేయలేకపోయింది. ఫలితంగా బీజేపీ పాల పొంగులా చల్లారిపోతోంది. కనీసం 90 నియోజకవర్గాల్లో బీజేపీకి గుర్తుపట్టదగిన ఎమ్మెల్యే అభ్యర్థులే లేకపోడమే ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనం. దీంతో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు, ఒక్కొక్కరు తమ పరిధిలో కనీసం నాలుగు ఎమ్మెల్యే సీట్లయినా గెలిపించగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే పరిస్థితి కనబడుతోంది.

బీజేపీ పతనానికి కారణం..

తెలంగాణలో బీజేపీ పతనం కొని తెచ్చుకున్నదే. 1980 డిసెంబర్‌లో జరిగిన బీజేపీ మొదటి ప్లీనరీలో వాజ్‌పేయ్‌ మాట్లాడుతూ...‘‘బీజేపీ ఒక విశిష్టమైన పార్టీ. ప్రజల మనసుల్లో విశ్వసనీయతను నెలకొల్పడం వల్లే మనం పార్టీని నిర్మించగలం. రాజకీయ వేదికపై ఆక్రమించుకున్న స్వార్థపరుల గుంపు నుండి మన పార్టీని వేరుగా ప్రజలు భావించగలగాలి. పదవులే మన లక్ష్యమని ప్రజలు అనుకోకూడదు. మనది కొన్ని విలువలపై ఆధారపడ్డ పార్టీ... పదవులు, హోదాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉన్మాదంతో ఎగబడేవారికి బీజేపీలో స్థానం లేదు’’ అని తేల్చి చెప్పారు. బలమైన సిద్ధాంతాలున్న బీజేపీ ఇలాంటి ప్రత్యేకతను తెలంగాణ నాయకులు ఏనాడూ పట్టించుకోలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా సాగుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిపై, పార్టీలో నెంబరు 2 అయిన అమిత్‌షాపై రాష్ట్ర పార్టీ నేతలు పలు ఆరోపణలు చేసినా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోయారు. నూతన అధ్యక్షులు కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పలువురు నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి అసంతృప్తిని బహిరంగపర్చడమే పార్టీలో లుకలుకలు ఇంకా కొనసాతున్నాయనడానికి తార్కాణం. అరువు నేతలు, ఫామ్ హౌజ్‌ కొనుగోళ్ల ఎపిసోడ్‌, గ్రూపు రాజకీయాలు... ఇలా ఇవన్నీ వాజ్‌పేయ్‌ చెప్పిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సాగుతున్న రాజకీయాలే. దాని ఫలితమే తెలంగాణలో బీజేపీ పతనానికి ప్రధాన కారణం!

ఉనికి లేని కమ్యూనిస్టు పార్టీలు ...

ఇక తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్నాయి. 2009లో టీడీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగి సీపీఐ(ఎం) ఒక స్థానం, సీపీఐ నాలుగు స్థానాలు గెలిచాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం) వైసీపితో, సీపీఐ కాంగ్రెస్‌తో జతకట్టి చెరోస్థానం గెలిచారు. అనంతరం వామపక్షాల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ పార్టీ ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఐ(ఎం) కేడర్‌ చెల్లాచెదురవడంతో 2018 ఎన్నికల ముందు సీపీఐ(ఎం) నేత్వత్వంలో కొత్తగా బీఎల్‌ఎఫ్‌ కూటమిని ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘మహాజన పాదయాత్ర’ పేరిట దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆ పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం చేకూరపోగా, బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేయడం ఆ పార్టీ చేసిన తప్పిదంగా వారి అంతర్గత సమీక్షల్లో ధృవీకరించుకుని బిఎల్‌ఎఫ్‌కు మంగళం పాడారు. ప్రస్తుతం సీపీఐం(ఎం), సీపీఐ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంక్‌ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వారికి మద్దతు ఇచ్చే వర్గాలు లేకుండా పోయాయి. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌ మహాకూటమితో సీపీఐ జతకట్టి పోటీ చేసింది. ఎంత చేసినా ఇరుపార్టీల యత్నాలు నిష్పలమయ్యాయి. రెండు పార్టీలు ఒక్క సీటు కూడా సాధించకపోవడంతో అసెంబ్లీలో వారికి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. వామపక్షాలకు కంచుకోటగా ఉండే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా ఆ పార్టీలకు ఆశాజనకంగా లేదు.

ఎంఐఎం విస్తరించేనా..

ఇక రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 40కి పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో పోటీ చేసిన ఎంఐఎం బీజేపీకి ప్రయోజనం చేకూర్చి ఆ పార్టీకి ‘బీ’ టీమ్‌గా మారిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ పోటీపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక వీరు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చినట్టు ఇక్కడ కూడా అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తూ ముస్లిం ఓటర్లలో చీలిక తెచ్చి బీజేపీకి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటుంది. ఏది ఏమైనా మజ్లీస్‌ పార్టీ ఈ సారి గతంలో గెలిచిన ఏడు స్థానాలను మించి పది సీట్ల వరకు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మజ్లీస్‌కు నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలతో పాటు, సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

వీరి పోటీ నామమాత్రమే!

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలోని బీఎస్పీ గతంతో పోలిస్తే తెలంగాణలో బలపడింది. ఆయన బీఎస్పీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక బీఎస్పీని పటిష్టవంతం చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తూ గ్రామ గ్రామానికి బీఎస్పీని విస్తరించారు. ముఖ్యంగా విద్యావంతులైన యువతీయువకులు ఆయనపట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే బీఎస్పీ పార్టీకి వచ్చే ఓట్లలో అధికశాతం కాంగ్రెస్‌ పార్టీవే. బీఎస్పీ పొందుతున్న ఓట్ల కారణంగా కాంగ్రెస్‌పార్టీ కొంతమేరకు నష్టపోనుంది. దళితుల వర్గీకరణ ప్రభావం బీఎస్పీపై ఖచ్చితంగా ఉంది. అయితే, దళితుల్లో ఒక్క వర్గానికి సంబంధించినవారే ప్రవీణ్‌కుమార్‌తో జతకడుతున్నారు. ప్రవీణ్‌ కుమార్‌ సరైన స్థానాన్ని ఎంచుకొని పోటీ చేస్తే ఆయన మాత్రం గెలిచే అవకాశాలున్నాయి. ఇక వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళా చేయని విధంగా పాదయాత్ర నిర్వహించినా, ఆ పార్టీకి ఏ మాత్రం ప్రజల్లో ఆదరణ లేదు. కేవలం మీడియాలో మాత్రమే ఆ పార్టీ ఉనికి ఉంది. ఆమె ప్రత్యేక దృష్టి పెట్టిన పాలేరు నియోజకవర్గంలో సైతం పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.

ఇక టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో నామమాత్రంగా మారింది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి హడావుడి చేసినా, ఆ పార్టీని రాష్ట్రంలో పట్టించుకునేవారు లేరు. ఈ పార్టీ ఓటర్లు బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.

బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్నా..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయపరిస్థితులపై అధ్యయనం చేస్తే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ గొప్పతనం కన్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు వైఫల్యాలే కారణంగా నిర్ధారణకు రావొచ్చు. 2014 నుండి ఇప్పటివరకు తెలంగాణలో రాజకీయ ఎజెండాను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయిస్తుండగా ఆయన ట్రాప్‌లో పడి తెలంగాణలోని అన్నీ పార్టీలు ఆయన ఎజెండాకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి.

ప్రతిపక్షాలుగా కాంగ్రెస్‌, బీజేపీ విఫలమవ్వడానికి కారణాలేంటి అని ప్రశ్నించుకుంటే ... బీజేపీ అగ్రనేత ఎల్‌.కే అద్వానీ ఏనాడో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల్లో లెమింగ్స్‌ అనే మూషిక జాతికి సామూహిక ఆత్మహత్యకు పాల్పడే లక్షణం ఉంటుంది. జనతా పార్టీలో నేతల ప్రవర్తనను పోల్చడానికి మరే ప్రాణిలో నాకు పోలిక దొరకలేదు’ అని చెప్పారు. జనతా పార్టీ పతనానికి అద్వానీ చెప్పిన పోలికే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకూ వర్తిస్తుంది. ఎందుకంటే, రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, బీసీలకు రుణాలు... ఇలా పలు అంశాల్లో బీఆర్‌ఎస్‌పై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ, గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న పాపాన పోలేదు. ఉద్యమాలు నిర్మించి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఆత్మహత్య సదృశంగా కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఆ పార్టీకే విజయావకాశాలు!

ఈ రోజు ఎన్నికల జరిగితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ ‘హ్యాట్రిక్‌’ సాధించే దిశగా కనిపిస్తోంది. కారు జోరును అడ్డుకోవడంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక ఓటు చీలిపోవడం, కేసీఆర్‌కు సరితూగే నాయకుడు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలో ఎవరూ లేకపోవడం బీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. శాస్త్రీయంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేస్తే అన్ని పారామీటర్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ముందు వరుసలో ఉంది. అయితే దీనికి రెండు షరతులు వర్తిస్తాయి. అవి ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో ఎంత మందిని మారుస్తారు అన్నది మొదటి షరతుకాగా, ఎన్నికల క్యాంపెయిన్‌ను ఏ అంశాలపై నిర్వహిస్తారు, బీజేపీకి బీఆర్‌ఎస్‌ ‘బి’ టీమ్‌ అనే అపవాదును ఎలా తొలగించుకుంటారు, అసమ్మతి నాయకులను ఏ విధంగా సంతృప్తి పరుస్తారు, 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నెరవేర్చని వాటికి ఏం సమాధానం చెబుతారు అన్న రెండో షరతుపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రస్తుతం తెలంగాణలో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఓట్ల వ్యత్యాసం 9 నుండి 10 శాతం ఉండవచ్చు. ఈ ఓటు వ్యత్యాసం పరిగణనలోకి తీసుకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీని సునాయాసంగా సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి తెలంగాణలో 13 నుండి 14 శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉంది. వీటిని గమనిస్తే రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు తెలంగాణలో అధికారం అందని ద్రాక్షగానే కనబడుతోంది.

ఈ వ్యాసం మొదటి భాగం కోసం క్లిక్ చేయండి

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected]

Advertisement

Next Story