- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సత్కారం ఓ బలమైన సంకేతం
మధ్యప్రదేశ్‌లో ఒక ఆదివాసీ యువకుడిపై ఒక అనాగరికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన తీరులో స్పందించి, విచారణతో పాటు బాధితుడిని ముఖ్యమంత్రి కార్యాలయానికి రప్పించి స్వయంగా కాళ్లు కడిగి పశ్చాతాపం వెలిబుచ్చారని వార్త. ముఖ్యమంత్రి నుండి వచ్చిన ఈ సున్నితమైన ప్రతిస్పందన ఆ బాధితుడి గాయాల్ని కొంతైనా మాపగలదు. అదే సమయంలో హీనమైన నేరానికి పాల్పడ్డ ఆ అనాగరిక కుసంస్కారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికైతే వాడిని అత్యాచార చట్టం క్రింద అరెస్టు చేసినట్లు వార్త. సామాజిక మాధ్యమాల్లో బుల్డోజర్లతో వాడి ఇంటిని కూల్చివేసినట్లు ఫోటోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. బహుశా అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అలా చెయ్యడంలో అర్ధం ఉండదు. ఒకవేళ చేసి వుంటే గనక అది రాజకీయ దాడులు, ప్రతిదాడులు.. వాటిలో పైచేయి సాధించడం లాంటి వేరే వ్యూహాలుండడం వల్ల అనుకోవాలి.
ప్రజల్లో ఈ ఘటన నేపథ్యంలో పెల్లుబికిన ఆగ్రహావేశాలను దృష్టిలో పెట్టుకుని అయివుంటుంది. ఈ తాత్కాలిక, తక్షణ చర్యల్ని పక్కనపెడితే, అత్యాచార చట్టం సరైన రీతిలో అమలౌతుందన్న భరోసా ఈ కేసు ద్వారా అక్కడి ప్రభుత్వం నిరూపించాలి. దళిత, ఆదివాసీల పట్ల జరుగుతున్న నేరాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్న సందేశం పంపితే ఆ ప్రభావం బలంగా ఉంటుంది. అత్యాచార నిరోధక చట్టం అమలులో ప్రభావవంతంగా మెజారిటీ కేసులు తుదిదశ చేరేటప్పటికి నిర్వీర్యం అయిపోతున్నాయి. పడుతున్న శిక్షలు తక్కువ. కేసు నమోదు నుండి దర్యాప్తు, బలమైన సాక్ష్యాల సేకరణ, విచారణ, తీర్పు దశల దాకా అవాంతరాలెన్నో! బలహీనమైన బాధితుడు, బలమైన నిందితుడు ఉన్న కేసుల్లో ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించకపోతే చట్టాలున్నా ఫలితం ఉండదు. ఈ కేసులో చట్టం సరిగ్గా పనిచేసి ముద్దాయికి సత్వరం శిక్ష పడితే అది ఆ బాధితుడికి సాంత్వనమే కాదు సమాజానికి కూడా మంచి సంకేతమౌతుంది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చూపింది సరైన స్పందన. అయినా సంకేతప్రాయం. రేపు చూపాల్సింది చట్టం ద్వారా సత్వరం శిక్షపడడం. అప్పుడది మరింత స్ఫూర్తిదాయకం అవుతుంది.
డా. డి.వి.జి.శంకర రావు
మాజీ ఎంపీ
94408 36931