దేశంలోనే అతిపెద్ద మాఫియా

by Ravi |   ( Updated:2024-09-01 01:15:28.0  )
దేశంలోనే అతిపెద్ద మాఫియా
X

అల్లోపతి వైద్యులు తమకు తాము ఆధునిక వైద్యకారులుగా భావిస్తూ సహచర ఆయుర్వేద నేచురోపతి, యునాని, హోమియో వైద్యులను, వైద్యాన్ని చిన్న చూపు చూస్తున్నారు. తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వీరిది అశాస్త్రీయ వైద్యమని ముద్ర వేస్తున్నారు. కానీ నిజానికి అల్లోపతీ వైద్యానికి లొంగని ఎన్నో రోగాలు ఈ మందులతో తగ్గిపోతున్నాయి. ఖర్చు కూడా వంద రెట్లు తక్కువ వుంటుంది. కానీ వీటిని ప్రజలను నమ్మరు. అందుకే ఫార్మా కంపెనీలను, హాస్పిటల్‌లను ప్రభుత్వమే నిర్వహించి మెడికల్ మాఫియాని ఆపాలి. లేకపోతే ఇవే ప్రజారోగ్యాన్ని గుత్తకు తీసుకోవడం ఖాయం.

ఫార్మా మాఫియా.. ఇది ప్రతి వ్యక్తి నుండి ఏదో ఒక సమయంలో ధనం లాగేసుకుంటుంది. హాస్పిటల్ మాఫియా.. రోగం నయం చేయడానికి ప్యాకేజీ మాట్లాడుకుంటుంది. డాక్టర్.. ఫార్మా కంపెనీ వద్ద డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద కమీషన్ మాట్లాడుకుంటాడు. డాక్టర్ చదువు చదవాలంటే కనీసం రెండు కోట్లు ఖర్చు పెట్టాలి. రెండు కోట్లు ఖర్చు పెట్టి చదివిన వారికి ప్రజలకు సేవచేయాలనే ధ్యాస ఉండదు. తను నేర్చుకున్న వైద్యంతో వ్యాపారం చేయాలనుకుంటాడు. ఇక ఫార్మా కంపెనీ వాడు తన మందులతో రోగం నయం కావాలి అని అనుకోడు. రోగం నయమైతే తన వ్యాపారం దెబ్బతింటది. కాబట్టి రోగం రోగి జీవితకాలం వరకు ఉండాలి, తన కంపెనీ మందులు వాడాలి అనుకుంటాడు. శాస్త్రవేత్త ఒక రోగం నయమయ్యే మందు కనుగొంటే దానిని బయటకు రానియ్యరు. అసలు ప్రభుత్వాలు రోగాలు నయం చేయగల మందులు కనుగొనడానికి శాస్త్రవేత్తలకు ఎందుకు తగిన నిధులు సమకూర్చడం లేదు.

డబ్బులు దండుకోవడమే పనా..?

డాక్టర్ అనేవాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు అంటే నేను పది విల్లాలు కొనాలి. వందెకరాలు కొనాలి, అవి ఫార్మా కంపెనీలు కొనివ్వాలి. అందుకు వారి ఫార్మా కంపెనీల మందులే రాయాలి. ఇక తన ఇంటి ఖర్చులకు తన ఖర్చుల కోసం... అవసరం ఉన్నా లేకున్నా రోగులకు రక్త పరీక్షలు స్కానింగ్‌లు ఇతర పరీక్షలు రాయాలి. డయాగ్నస్టిక్ సెంటర్ వారు 40% కమీషన్ ఇస్తారు.. ఇదీ... ఎక్కువ మంది డాక్టర్ల ఆలోచన. రోగం నయం కావడానికి మందులు తయారు చేయడం లేదు. రోగం నయం కావద్దు మనిషి బ్రతికి ఉన్నంత కాలం అతని ఒంట్లో ఉండాలి. చనిపోయేవరకు మందులు వాడుతూనే ఉండాలి. షుగర్, బీపీ, థైరాయిడ్, కేన్సర్, హార్ట్ ఎటాక్, సిరం క్రియాటిని (కిడ్నీ రోగం) ఇలాంటివి తగ్గవు. తగ్గనివ్వరు. రోగి ఎన్ని రోజులు బతికితే మందులు అమ్ముకునే వారికి, హాస్పిటల్స్‌కు డాక్టర్‌లకు అంత లాభం.

రోగాలు దేనికి పెరుగుతున్నట్లు?

అంతెందుకు.. చిన్న పిల్లలకు జలుబు చేస్తే చాలు, నాలుగైదు రకాల మందులు పది రోజులు వాడాలి. దానికి తోడు నెఫ్‌లైజర్ మిషన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. నార్మల్ డెలివరీకి ఒక ప్యాకేజీ, సిజేరియన్ డెలివరీకి ఒక ప్యాకేజీ.. నొప్పులు రాకుండా డెలివరీ కావాలంటే ఇంజక్షన్ దానికో రేటు. ఇంజక్షన్ కారణంగా వచ్చే వెన్నుపూస నొప్పికి, నడుం నొప్పికి మళ్లీ మందులు వాడాలి. నకిలీ మందులను గుర్తించడానికి సుమారు ఒక మూడు వందల మందులకు క్యూఆర్ అనే ఒక స్కానర్ పెట్టారు. కానీ మిగితా వాటికి అలాంటివి లేవు. మందులు నకిలివా మంచివా అని గుర్తించే నిపుణులను అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం నియమించడం లేదు. సైన్స్ అభివృద్ధి చెందింది కానీ మనుషుల రోగాలు కూడా పెరుగుతున్నాయి.

డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ పిండేస్తే..

సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది కానీ సిగరెట్ నిషేధించరు. గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది కానీ గుట్కా అందరికీ అందుబాటులో ఉంది. లిక్కర్ తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది కానీ లిక్కర్‌ను నిషేధించరు. డబ్బు వున్న వాడు ఒకడు వంద కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతాడు. నెలకు వంద కోట్లు సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకుంటాడు. నెలకు లక్ష నుండి మూడు లక్షల వరకు డాక్టర్‌లకు జీతాలు ఇస్తూ, వారికి నెలకు ఎంత సంపాదించి పెట్టాలనేది టార్గెట్ పెడుతాడు. ఇక వైద్య విద్యార్థులకు బోధనలో నాణ్యత తగ్గింది. రోగి లక్షణాలను చూసి రోగాన్ని గుర్తు పట్టగలగాలి కానీ ఇప్పటి వైద్యులు రక్త పరీక్షల మీద, మూత్ర పరీక్షల మీద, స్కానింగ్ లాంటి వాటి మీద పూర్తిగా ఆధారపడి వైద్యం చేస్తున్నారు.

ప్రజారోగ్యం మాఫియా చేతుల్లో..

శస్త్రచికిత్సకు పితామహుడు సుశ్రుతుడు పుట్టిన దేశం ఇది. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రలేసియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌లో (RACS) సుశ్రుతుడి విగ్రహం పెట్టుకున్నారు. గణ చరిత్ర గల భారత వైద్య విధానాన్ని నాశనం చేసి పాశ్చాత్య అల్లోపతీ వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని రోగులను దోచుకుంటున్నారు. భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, నేచురోపతి, యునాని, హోమియో లాంటి వాటిని ప్రభుత్వాలు పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా వుంది. పాలకుల ఆలోచన మారకుంటే దేశంలో అతిపెద్ద మాఫియాగా మెడికల్ మాఫియా విజృంభించి ప్రజా రోగ్యాన్ని గుత్తకు తీసుకోవడం ఖాయం.

నారగొని ప్రవీణ్ కుమార్

ఉచిత విద్య వైద్య సాధన సమితి

98490 40195

Advertisement

Next Story

Most Viewed