ఎంబీసీ ఓట్లే కీలకం...

by Ravi |   ( Updated:2023-10-08 00:15:59.0  )
ఎంబీసీ ఓట్లే కీలకం...
X

తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీ) కులాల ఓట్లే కీలకం కానున్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 36 శాతంగా ఉన్న ఎంబీసీ కులాలు ఎటు మొగ్గు చూపితే అటు వైపు గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి. అంటే ఈ దఫా ఎన్నికల్లో ఎంబీసీల ఓటు బ్యాంకు నిర్ణయాత్మక శక్తి కానుంది. బీసీలలో 5 కులాలను మినహాయిస్తే సుమారు వందకు పైగా కులాలు ఎంబీసీలుగా ఉన్నారు. అయితే, ఎవరు ఎంబీసీ అన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం కొంత గందరగోళంలో పడవేసి వేడుక చూస్తోంది కానీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో స్పష్టమైన విధానాలు ఉన్నాయి.

ఆ రాష్ట్రాలు బీసీలను బీసీ, ఎంబీసీలుగా వర్గీకరించి వారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ మన తెలుగు రాష్ట్రాలు బీసీల విషయంలో గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా బీహార్‌లో జరిగిన కులఘటనలో బీసీల జనాభా 63 శాతంగా తేల్చింది. అందులో 27% బీసీలు కాగా 36% ఎంబీసీలుగా తేల్చింది. సగటున దేశవ్యాప్తంగా కూడా ఇదే గణాంకాలు వర్తిస్తాయి.

ఎంబీసీల ఓట్లకు గాలం

తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీ కులాలకు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తెలంగాణలో నిర్వహించిన సకల జనుల సర్వేలో ఎంబీసీల ఓట్లు 38% ఉన్నట్టు కేసీఆర్ ప్రభుత్వానికి సమాచారం అందడంతో ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఫెడరేషన్ లేని కులాలను ఎంబీసీలుగా ప్రకటించి సంచార జాతులకు తీరని అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేసింది రాష్ట్రస్థాయిలో ఇలాంటి ప్రత్యేక బోర్డ్‌లు లేకపోవడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సంచార జాతులు లబ్ది పొందలేక పోతున్నాయి. బీసీ జాబితాలో ఉన్న సంచార కులాలు డి.ఎన్.టి ఐడెంటిటీ కోసం చాలా కాలంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వీరి స్థితిగతులపై ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ ఇప్పటికే తన నివేదికను రాష్ట్రపతి పరిశీలనకు పంపింది. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర క్యాబినెట్‌కు వస్తే కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల వేళ దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వనికి ఇది తోడైతే బీజేపీ విజయాన్ని నిలవరించడం కష్ట సాధ్యం.

తెలంగాణ ఎంబీసీల ఓట్లు కీలకం కావడంతో ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఎంబీసీలను ఆర్గనైజ్ చేయడంలో కాంగ్రెస్ కొంత వెనుకబడి ఉన్నప్పటికీ, ఢిల్లీ పెద్దలు మాత్రం తాజాగా కసరత్తు మొదలుపెట్టారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఎంబీసీ ఓటు కీలకం కానుంది.

దొమ్మాట వెంకటేష్

భారతీయ ఎంబీసీ ఆందోళన్ మంచ్

98480 57274

Advertisement

Next Story