ఎందరో త్యాగధనులు..

by Ravi |   ( Updated:2024-08-15 00:45:13.0  )
ఎందరో త్యాగధనులు..
X

ఈ రోజు యావత్ భారతదేశానికి పండగ రోజు. కులం, మతం, వర్గ విచక్షణ లేకుండా సమిష్టిగా అందరూ జరుపుకునే జాతీయ జెండా పండుగ ఇది. నేడు దేశభక్తి అభినయం చూసి చప్పట్లు చరిచే వారు కోకొల్లలు. నేడు దేశంలో ప్రతిచోటా ఈ వేడుకలు జరుపుతారు. దేశభక్తి పాటలు ఆ కొద్దిసేపే వినిపిస్తారు. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనైతే మొక్కుబడిగా జెండా ఎగురవేయడం పరిపాటే. మరికొన్ని చోట్లా ఏదో మొక్కుబడిగా జెండా ఎగరవేశామని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ జెండా రెపరెపలాడటం వెనకాల ఎందరో మహనీయుల త్యాగం ఉంది. ఈనాడు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది వారు ప్రసాదించినదే. మన భారతీయులను నీచాతినీచంగా చూసి తెల్లదొరలు తమ పబ్బం గడుపుకున్నారు. కొందరు ఇది చూసి సహించలేక ఎదురు తిరిగారు. ఈ దిశలో సామాన్య ప్రజలు చైతన్యవంతులై వారిని ఎదిరించడం జరిగింది. ప్రతి భారతీయుడు మొక్కవోని ధైర్యంతో తెల్ల దొరలను ఎదురించారు. తమకు సాధ్యమైన విధానాల్లో పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తరువాత.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ఒక వేదిక లభించింది. ఆ తరువాత, మహాత్మా గాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతా ఒక్కటిగా ఆహింసనే ఆయుధంగా చేసుకుని పోరాటం సాగించింది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అహింసాయుత మార్గంలో భారత్ స్వాతంత్ర్యం సంపాదించింది. క్విట్ ఇండియా అంటూ సాగిన ఆ పోరు బ్రిటిష్ వారిని గడగడ లాడించింది. మహాత్మా గాంధీ ‘డూ ఆర్ డై’ పిలుపునిచ్చారు. ఆ పిలుపు ప్రజలలో బాగా నానింది. దేశం మొత్తం గాంధీ వెంట నడిచింది. ఆ చైతన్యం ఉవ్వెత్తున ఎగిసిన కెరటాల వల్లే వస్తున్న ప్రజావాణి చూసి బ్రిటిష్ సైన్యం బిత్తరపోయింది. భారతీయుల అవమాన పోరాటం ముందు బ్రిటిష్ ప్రభుత్వం తల వంచింది. ఉద్యమకారులు రెట్టించిన ఉత్సాహంతో పోరాడారు. ఆ ఉధృత పోరు చూసి బెంబేలెత్తిన బ్రిటీష్ వారు మన దేశం వీడక తప్పలేదు. ఇలా ఎందరో ఎన్నో పోరాటాలు, ఎందరో మహానీయులు స్వాతంత్ర్యం సమరంలో అశువులు బాశారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలం గానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దినం (ఆగస్టు 15) వారందరిని తలుచుకుంటూ వారి పోరాట పంధాను గుర్తుకు చేసుకుంటూ ఆ త్యాగ మూర్తులకు వందనం సమర్పిస్తాం. బ్రిటిష్ వారి పతాకం దిగి మువ్వన్నెల భారత పతాకం రెపరెపలాడుతుంటే ఆ జెండాను చూస్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి మనకు స్వేచ్ఛ ప్రసాదించిన ఆ త్యాగ మూర్తులకు సెల్యూట్.

స్వాతంత్ర పోరాటం భారతదేశ చరిత్రలో మైలురాయి. వేలమంది అమరవీరుల త్యాగ ఫలితం. బ్రిటిషర్ల 200 ఏళ్ల వలస పాలనలో భారతదేశం అర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో నష్టపోయింది. ఆ తర్వాత క్రమంగా దేశ ప్రజల్లో చైతన్యం పెరిగింది. అలాంటి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు నిండిపోయాయి. ఇన్ని సంవత్సరాలలో దేశం ఎన్నో రంగాలలో ఎంతో ప్రగతిని సాధించింది. దేశ ప్రజలను ధర్మ మార్గంలో పాలించి శాంతి సౌఖ్యాలను అందించాల్సిన దేశ రక్షకులు దేశ భక్షకులుగా తయారవుతున్నారు.

లకావత్ చిరంజీవి

99630 40960

Advertisement

Next Story