కాంతి కాలుష్యాన్ని నియంత్రిద్దాం!

by Ravi |   ( Updated:2024-07-02 00:45:37.0  )
కాంతి కాలుష్యాన్ని నియంత్రిద్దాం!
X

ప్రపంచంలోని 75 శాతం పులులు అంటే 3,682 మన భారతదేశంలోనే ఉన్నాయన్న విషయం మనలో ఎంత మందికి తెలుసు? నానాటికీ క్షీణిస్తున్న అడవి పులుల సంతతిని పెంచేందుకు కృషి చేస్తున్న మనదేశం ఈ శతాబ్దంలో ప్రపంచంలోనే స్వేచ్ఛా శ్రేణి అడవులలో పులుల జనాభాను అత్యధికంగా సంరక్షించింది అని తెలిస్తే కించిత్ గర్వంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2024 జనవరి 11న మహారాష్ట్ర లోని ‘పెంచ్ టైగర్ రిజర్వ్’ భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ‘డార్క్ స్కై పార్క్‌గా’ ఆసియా ఖండంలో ఐదవదిగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇంటర్నేషనల్ డార్క్-స్కై అసోసియేషన్ (డీఎస్ఏ) ధృవీకరించింది.

ఈ ఉద్యానవనం తన పరిధిలో రాత్రిపూట ఆకాశంలో ఉండే సహజ చీకటిని సంరక్షించి కాంతి కాలుష్యాన్ని నివారించడంలో విజయం సాధించడంతో పాటు ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు అత్యంత అనువైన ప్రదేశంగా మార్చిందన్న ఘనతను నమోదు చేసుకుంది. ‘పెంచ్’ నది ఈ పార్క్ మధ్య నుండి ప్రవహించడం మరో విశేషం. భారతదేశంలోనే అత్యధిక రాయల్ బెంగాల్ పులుల జనాభా కలిగిన పెంచ్ టైగర్ రిజర్వ్ దాని నిర్వహణ, సామర్థ్య పద్ధతులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇవే కాక ఈ దట్టమైన అడవిలో స్లాత్ ఎలుగుబంటి, నక్క, నీల్గై, అడవి కుక్క మొదలైన క్షీరదాలు, నెమళ్ళు, మాగ్పై రాబిన్, పిన్‌టైల్, డ్రోంగో, యూనియా, మైనా లాంటి 325 జాతులకు చెందిన స్థానిక, వలస పక్షులు కూడా కనిపిస్తాయి. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉండడంతో రెండు రాష్ట్రాలు సంయుక్తంగా దీని నిర్వహణ బాధ్యతను చేపడుతాయి.

డార్క్ స్కై పార్క్ ప్రాధాన్యత?

డార్క్ స్కై పార్క్ అనేది కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నిరోధించే పార్క్ లేదా అబ్జర్వేటరీ చుట్టూ రూపొందించబడిన ప్రాంతం. గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా రాత్రి వేళలలో ఆకాశం ప్రతి సంవత్సరం 10 శాతం అధిక ప్రకాశవంతంగా మారుతోంది. బహిరంగ కృత్రిమ కాంతిని అధికంగా ఉపయోగించడం వలన అది మానవ ఆరోగ్యం, వన్యప్రాణుల ప్రవర్తన, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువులను గమనించే మన సామర్థ్యంపై ప్రతికూల ప్రభావితం చూపుతుంది. కాంతి కాలుష్యం ఎక్కువవుతోంది. ఈ సమస్యకు ప్రధాన పరిష్కారాలలో ఒకటి అటువంటి డార్క్ స్కై పార్కుల స్థాపన ద్వారా ఆకాశంలో సహజ చీకటి ఏర్పడే పరిస్థితులను తిరిగి తీసుకురావడం.

దుష్పరిణామాలు

జనవరి 2019లో అర్బన్ క్లైమేట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 1993 నుండి 2013 మధ్య కాలంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో (అవుట్‌డోర్) ఏర్పాటు చేసే విద్యుత్ దీపాల వలన పరిసరాలు అధిక ప్రకాశవంతంగా మారుతున్నాయి. న్యూఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ లలో ఈ కాలంలో కాంతి కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. మితిమీరిన కృత్రిమ కాంతి నిద్రలేమి, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు.. పలు మానసిక రుగ్మతలకు కూడా కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాంతి కాలుష్యం వివిధ జంతువుల సహజ ప్రవర్తన, ప్రత్యేకించి పగలు నిద్రించి రాత్రుళ్లు మెలకువగా ఉండే జంతువులలో వాటి వలస విధానాలు, వేటాడే పద్ధతులు, ఆవాసాల నిర్మాణం లాంటి పలు అంశాలను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే పరిణామం.

అందుకే కాంతి కాలుష్యాన్ని వీలైనంత మేర తగ్గించి గగనతల సహజత్వాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. 1988లో అమెరికాలో స్థాపించబడిన ‘ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్’ రాత్రిపూట ఆకాశపు సహజత్వాన్ని సంరక్షించడానికి ప్రత్యేక శ్రద్ధతో చురుకుగా పనిచేస్తోంది. ఈ సంస్థ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, కాంతి ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న పార్కులు ఇతర ప్రదేశాలను ధృవీకరించడంతో పాటు, అవసరమైన సలహాలు సూచనలు అందిస్తుంది.

యధేచ్చగా అడవుల నరికివేత, ప్రపంచవ్యాప్తంగా జనావాసాలు పెరిగి పట్టణీకరణ ఊపందుకోవడం, భూతాపం పెరగడం, ఇబ్బడిముబ్బడిగా శిలాజ ఇంధనాల వాడకంతో వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు, భూగర్భ జలాలు అడుగంటడంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, జీవవైవిధ్యంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నగరాల పరిధి పెరుగుతున్నందున, కాంతి కాలుష్యానికి హద్దంటూ లేకుండా పోతోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఇప్పటికైనా పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు సమిష్టి కృషితో కాంతి కాలుష్యాన్ని నియంత్రించడానికి, రాత్రిపూట ఆకాశంలో సహజ చీకటిని సంరక్షించడానికి ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యేచన్ చంద్ర శేఖర్

భారత్ స్కౌట్స్ & గైడ్స్, మాజీ రాష్ట్ర కార్యదర్శి

88850 50822

Advertisement

Next Story