- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జన నాయకుడికి సమున్నత గౌరవం
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ధీరుడు కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించడం హర్షణీయం.
రాజకీయ లబ్ధి కోసమే కర్పూరీ ఠాకూర్కు ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించిందని విమర్శకులు విమర్శిస్తున్నా, కనీసం ఏదో ఒక రూపంలో. దేశంలోని అణగారిన వర్గాలకు చెందిన కర్పూరీ లాంటి దిగ్గజ నేతను ఇన్నాళ్లకైనా గుర్తించడం ప్రశంసనీయం.
క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలై...
కర్పూరీ ఠాకుర్ 1924 జనవరి 24న బీహార్‌లో జన్మించిన ఆయన గాంధీజీ, సత్యనారాయణ సిన్హాల స్వత్రంత్ర పోరాట పద్ధతులకు ఆకర్షితులై వారి బాటలో నడిచారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని స్వాత్రంత్ర్య కాంక్షను ప్రజల్లో రగిలించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చేరి డిగ్రీలో కళాశాల విద్యకు దూరమయ్యారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఈ క్రమంలోనే 26 నెలలపాటు జైలు జీవితం గడిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, సొంత గ్రామంలో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, తదనంతర కాలంలో సోషలిస్టు పార్టీ విధానాలకు ఆకర్షితుడై 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున విధాన సభకు ఎన్నికయ్యారు. విధాన సభకు ప్రాతినిధ్యం వహిస్తూనే అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు.
విద్యకు ఎంతో ప్రాధాన్యత
బీహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసే సమయంలో విద్యా మంత్రిగా ఉన్న ఆయన బ్రిటిషు వారు రుద్దిన ఇంగ్లిష్‌ను పరిహరించాలని మెట్రిక్యులేషన్‌లో ఇంగ్లిషు తప్పనిసరి అనే నిబంధనను తొలగించారు. ఆ తర్వాత రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగానూ, రెండు సార్లు కొద్ది కాలం వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. 36 సంవత్సరాలు ఓటమి ఎరుగని నేతగా వెలుగొందారు. బీహార్ రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఆయనే. ఆయన పాలనలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు.
కర్పూరీ ఠాకూర్ విద్యకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు. ఆయన హయాంలో బిహార్‌లోని అనేక వెనుకబడిన ప్రాంతాలలో కర్పూరీ ఠాకూర్ పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ఆయన తీవ్ర కృషి చేశారు. 1975లో దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితిలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌తో కలిసి 'సంపూర్ణ విప్లవం' పేరిట సమాజంలో మార్పు కోసం ఉద్యమించారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో 1977లో బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేశారు. తర్వాత కాలంలో ఓబీసీల అభ్యున్నతి కోసం మండల్ కమిషన్ ఏర్పాటుకు అది తొలి అడుగుగా మారింది.
రాజకీయ దిగ్గజాలకు గురువుగా..
సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన ఠాకూర్ లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారికి రాజకీయ గురువుగా వ్యవహరించారు. ప్రజలు ఆయన్ని 'జన్ నాయక్' అని కీర్తించేవారు. 1988 ఫిబ్రవరి 17న తన 64 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. సమస్తీపూర్ జిల్లాలోని ఆయన పుట్టిన పితౌంఝియా గ్రామానికి ఆయన మరణానంతరం 'కర్పూరీ గ్రామ్'గా పేరు మార్చారు. దర్భంగా -అమృత్‌సర్ మధ్య ప్రయాణించే రైలుకు 'జన్ నాయక్ ఎక్స్‌ప్రెస్'గా నామకరణం చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.
(కర్పూరీ ఠాకూర్కు భారతరత్న అవార్డు ఇచ్చిన సందర్భంగా)
- కాసాని కుమారస్వామి
96762 18427