కాకతీయ వైభవ కీర్తి పురస్కారాలు

by Ravi |   ( Updated:2023-08-12 22:30:56.0  )
కాకతీయ వైభవ కీర్తి పురస్కారాలు
X

కాకతీయుల సీమలో ఆదికాలం నుంచీ, దేశ భాషా సాహిత్యంతో బాటు సంస్కృత సాహిత్యం కూడా పోషిస్తూ వచ్చారు. ఈ సీమలో సంస్కృతి విద్యాభివృద్ధికి సాక్ష్యాలు ఆ రాజ్యారంభం నుంచే గోచరిస్తూ ఉన్నాయి. ఆనాటి శాసనాలలో అనేకం మధుర కవిత లొలికినవి ఉన్నాయి. వీటిలో వినియోగించిన ప్రశంసలు, అతిశయోక్తులు సమకాలీన చరిత్రకు ఆధారంగా ఉన్నాయి. సుప్రసిద్ధ వేయి స్తంభాల గుడిలో రుద్రదేవుని శాసనం ఒక చిన్న కావ్యంలా ఉంటుంది. ఈ రచయిత రామేశ్వర దీక్షితుని పుత్రుడు. అధ్యయామృత యతికి శిష్యుడైన అచింతేంద్రియతి ఈయన కావ్య శైలి వైదర్భి రీతిలో అత్యంత మధురంగా సరళంగా ఉంది. కాకతీయుల ధ్వజ చిహ్నమైన వరాహమూర్తిని శాసన ఆరంభంలో వర్ణించే శ్లోకం ఆయన రచనా శక్తికి అద్దం పడుతుంది. రుద్ర దేవ ప్రభువును బ్రహ్మతోనూ విష్ణువుతోనూ పోల్చే పద్యాలు మధ్యయుగ సంస్కృత కావ్యధోరణికి పతాక వంటివి.

సత్యసక్తమనానిరస్త వరకేలశశ్చలక్ష్మ్యాశ్రయః పృథ్వీభృద్యనంత/ బోధినిలయః శశ్యద్ధిజేంద్రప్రియః/ దుష్టారిష్ట విమర్దనస్సు మనసా మభ్యర్ధితార్ధ ప్రదః/ గోత్ర ప్రోద్దరణో సుదర్శన కరో రుద్రః స్వయం కేశవః

రాజు.. కవి కావడంతో

కాకతీయ యుగంలో ప్రతాపరుద్ర దేవుని పాలన సంస్కృతాంధ్ర సాహిత్యాలకు వసంతోదయం. మహా ప్రభువు స్వయంగా గొప్ప కవి, రూపకర్త కూడా. ఆ విద్యత్యవి ప్రభువు సంస్కృతంలో నీతిసారము, షారాగోదయము, యయాతి చరిత్రము అను నాటకాలను రచించినాడు. శాకల్యమల్లన ముఖ్యులు అగస్త్యుడు, విద్యానాథుడు, ఇద్దరు కారనీ ఒక్కరేనని వాదం ఉంది. అయితే విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణమన్న లక్షణ గ్రంథం రచించినాడు. కాగా అగస్త్యుడు బాల భారతము, నలకీర్తి కౌముది, కృష్ణ చరిత్రము మొదలైన 74 గ్రంథాలు రచించిన మహా పురుషుడు. గంగాదేవి తన మధురా విజయంలో చతుస్సప్తతి కావ్యోక్తి వ్యక్త వైదుష్య సంపదే అగస్త్యాయ జయత్యస్మన్ స్పృషయేతోకనకోవిదః అని కొనియాడింది. ఈయన బాల భారతానికి తిమ్మరుసు మంత్రి వ్యాఖ్యానం రాశాడు. శాలక్య మల్లన దాత్త రాఘవమనే నాటకాన్నీ, నిర్ధోష్ట్య రామాయణ కావ్యాన్ని రచించాడు. ఆయన తరువాతి కాలం నాటి అవధాన విద్యకు ఆరంభకుడట. ప్రతాపరుద్రుని ఆస్థానంలో గుండయ భట్టు అనే విద్వాంసుడు శ్రీహర్షుని ఖండన ఖండ బాష్యమునకు వ్యాఖ్యానం రచించాడు.

సకల శాస్త్రవేత్త వీరభల్లట దేశికుడు ఈ ఆస్థానంలోని వాడే. ఇంకా ప్రతాపరుద్రుని ఆస్థానంలోని సంస్కృత కవులలో ముఖ్యులు అగస్యతుని మేనల్లుడు సౌగందికాపహరణ నాటక కర్త విశ్వనాథుడు. మహాభారతాన్ని నాటక రూపంగా రచించిన గంగాధర కవి, కాదంబరి నాటక కర్త నరసింహ కవి. జినేంద్ర కళాణాభ్యుదయము రచించిన రావిపాటి త్రిపురాంతకుడు ఈ కాలంలో సంస్కృత కవులలో విద్యానాథుడు నాయక మణి వంటి వాడు. ఆయన రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం, అలంకార శాస్త్రగ్రంథం, అలంకార శాస్త్ర విద్యార్థులకు పరామర్శక గ్రంథంగా నిలిచి ఉన్నది. మధ్య యుగాల తాత్త్విక, సాంస్కృతిక, సారస్వత లోకానికే మధ్యందిన భాస్కరుని వంటివాడు విద్యారణ్యుడు, మాధవ సాయణులు ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లులో ఉండేవారనీ, కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత అక్కడి అధికార స్థానాలలో ఉన్న హరిహర బుక్క రాయలను ప్రేరేపించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింప జేశారనీ స్థూల వృత్తాంతం.

చరిత్ర పుటల్లో కవులు..

చతుర్వేదాలకు సాయణుడు భాష్యం రచించాడు. అది అపూర్వమూ అసాధారణమైన కావ్యం. సాయణుల ఇతర రచనలలో ధాతవృత్తి, పురుషార్ధసుధా నిధి, ఆయుర్వేద సుధానిధి, యజ్ఞతంత్ర సుధానిధి, ప్రాయశ్చిత్త సుధానిధి ముఖ్యమైనవి. వీటిలో ధాతువృత్తికి మాధవీయ ధాతువృత్తి అని పేరు. అలాగే మాధవాచార్యుడు పరాశరమాధవాయము, జైమినీయ న్యాయమాల, వైయాసిక న్యాయమాల, వేదాంత పంచదశి, జీవన్ముక్తి, వివేకం, వివరణ ప్రమేయం, కాలమాధవీయం, సంగీత సారం మొదలైన అనేక గ్రంథాలు రచించారు. జగద్గురువులైన ఆదిశంకరుల జీవనాన్ని శంకర విజయంగా రచించారు. సుత సంహిత వాఖ్య కూడా మాధవ రచనయే. దీనినే విద్యారణ్యుల రచనగా తరువాతి కాలం పేర్కొన్నది.

వీటన్నింటికన్న ముఖ్యమైంది సర్వదర్శన సంగ్రహం. నాడు వ్యాప్తిలో ఉన్న తాత్త్విక దర్శనాల సంగ్రహ వివరణం ఇది. ఇవి కాక భోగనాధుని రచనలు కూడా ఉన్నవి. ఈయనే తరువాతి కాలంలో శృంగేరిలో పీఠాధిపతియై భారతీ తీర్థ నామంతో వ్యవహరించాడు. ఆయన దగ్గరే విద్యారణ్యుడు తరువాత పీఠాధిపత్యం స్వీకరించినట్లుగా తెలుస్తున్న ఈ వాజ్మయమంతా విద్యారణ్యులు కేంద్రంగా కలది వేద వేదాంగాలు, దర్శనాలు, సర్వశాస్త్రాలు మరోమారు వ్యాఖ్యాతములైనాయి. ఆధునిక కాలంలో లభిస్తున్న ఆధారాలను బట్టి మధ్య యుగాలలో ఈ ప్రాంతంలో సంస్కృత భాషా వాజ్మయ కృషి అవిచ్చిన్నంగా కొనసాగిందనే భావించవచ్చు. పరశురామానంతుల లింగమూర్తి తెలుగులో సీతారామాంజనేయ సంవాదకర్తగా ప్రసిద్ధుడు. ఈ యోగ శాస్త్ర కావ్య రచన పోతన కవితకు దీటైంది. వీరు కాక మరి కొందరు కూడా సంస్కృత కవులు, పండితులు చరిత్ర పుటలలో కనబడుతున్నారు.

( నేడు ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా, పుడమి సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కాకతీయ వైభవ కీర్తి పురస్కారాల సందర్భంగా)

(ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు సౌజన్యంతో...)

కొలనుపాక కుమారస్వామి,

99637 20669

Advertisement

Next Story