- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షన్ల అమలుపై జగన్ అబద్దాలు!
పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నించడం దాతృత్వం కాదు. అదే అసలైన న్యాయం కూడా. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగం. అంతేకాదు. పేదలు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కు. ఈ విధమైన కనీస హక్కులను కాలరాసి సామాజిక పెన్షన్లలో పెద్ద ఎత్తున కోత పెట్టి 6 లక్షల మంది పింఛన్లను తొలగించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం. ఒక పక్కన పెన్షన్లను రద్దు చేస్తూ, మరో పక్క పెన్షన్లపై గొప్పలు చెప్పుకొంటున్నది జగన్ ప్రభుత్వం. జనవరి నుండి కొత్తవారికి పింఛను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, అదే సమయంలో పెన్షన్లు అందుకొంటున్న వారి పింఛన్లు రద్దు చెయ్యడం ఏమిటి? అనర్హులను గుర్తించి పింఛన్లు తొలగించడంలో తప్పులేదు కానీ పింఛను అందుకోవడానికి అర్హత వున్నవారి పింఛన్లు తొలగించడం అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎంత బాధ్యత వున్నదో అర్థం అవుతుంది.
2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన బలమైన హామీ అవ్వాతాతలకు రూ 3000 పెంచుతాను అని చెప్పడమే. కానీ ప్రస్తుతం అసలుకే ఎసరు పెట్టే విధంగా చర్యలు చేపడతారని పింఛన్ దారులు ఊహించలేదు. వీరంతా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కొందరు కళాకారులు. కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చిందనో, రేషన్ కార్డులో పేర్లున్న వారిలో ఎవరో ఒకరికి ఆదాయం ఎక్కువగా ఉందనో, మోటర్ బైక్ ఉందనో అనేక నిబంధనలు విధించి వీరిని లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం ఎంత దారుణం? ఏ దిక్కు లేకుండా అనాథలుగా ఉంటేనే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పదలుచుకొన్నదా? పోనీ, ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఖచ్చితంగా వున్నాయంటే అదీ లేదు. వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నవారికి పది ఎకరాలు పొలం వున్నా పెన్షన్లు ఇస్తున్నారు. వారికి మద్దతుగా నిలవని అనాధల పెన్షన్లను దారుణంగా తొలగిస్తున్నారు. ఇది న్యాయమా?
ఒక్కొక్కరికి 33వేల నష్టం
జగన్ అబద్దాలతోనే పరిపాలన సాగిస్తున్నారు. నోరు తెరిస్తే అబద్దాలు, తప్పుడు లెక్కలు తప్ప నిజం చెప్పే పరిస్థితి లేదు. తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు ప్రజలకు చేకూర్చిన లబ్ధిపై తప్పుడు లెక్కలతో ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం దిగిపోవడానికి 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే అని, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోవడానికి రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమేనని, ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి మాత్రమే రూ 2 వేలు ఇచ్చారు అని, ముఖ్యమంత్రి రాజమండ్రి బహిరంగ సభలో మాట్లాడటం చూస్తే అబద్దాలతో ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నారో అర్థం అవుతుంది. 2018 ఏప్రియల్ నుంచి 2018 అక్టోబర్ వరకు ప్రతినెలా 42,66,729 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు, 2018 నవంబర్ నుంచి 2019 మార్చి వరకు తెలుగుదేశం ప్రభుత్వం 51,66,732 పెన్షన్లు పంపిణీ చేసిందని అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం వెల్లడించింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యపై కూడా తాము తప్పుడు లెక్కలు చెప్పామని అసెంబ్లీ సాక్షిగా గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిన విషయం ప్రజలందరూ చూశారు.
2014లో అధికారంలోకి రాగానే రూ.200 ఉన్న పెన్షన్‌ని చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి రూ.1000కి పెంచింది. అంటే వృద్ధుల పెన్షన్ ఐదు రెట్లు పెరిగింది. 2019 జనవరి నుంచి దానిని తెలుగుదేశం ప్రభుత్వం రూ.2వేలు పెంచి రెట్టింపు చేసి లబ్ధిదారుల సంఖ్యను 54 లక్షలకు పెంచారు. పెన్షన్లు రూ 3,000 కు పెంచుతానని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి దానిని పెంచుకుంటూ పోతానని చెప్పానని ఒకేసారి ఇస్తానని రూ. 3000 ఇస్తానని చెప్పలేదని మాట తప్పారు. రూ.3,000 కు పెంచుతానని జగన్ హామీఇచ్చి మాట తప్పడం వల్ల ఇప్పటి వరకు ఒక్కో పెన్షన్ దారుడు రూ 33 వేలు నష్టపోయినట్లు సమాచారం. మొదటిసారి రూ. 250లు పెంచి రూ. 2,250 చేశారు. తర్వాత రెండేళ్ల తర్వాత మరో రూ.250 పెంచి రూ. 2,500 చేశారు. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత మరో రూ 250 పెంచి రూ. 2,750 చేశారు. గత ప్రభుత్వం దిగిపోవడానికి 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ కేవలం రూ. 1000 మాత్రమే అని అబద్దపు ప్రకటనలు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేకూర్చిన ప్రయోజనాన్ని చిన్నదిగా చూపించి తానూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేశారు.
ఎకనామిక్ సర్వే ప్రకారం..
గత ప్రభుత్వ హయాంలో 54 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వగా దానిని 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని పచ్చి అబద్దాలు చెప్పడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. 2019 మార్చి నాటికి ఎకనామిక్ సర్వే గణాంకాల ప్రకారం పెన్షన్ల సంఖ్య 54,28,247. 2016--17లో పెన్షన్ల సంఖ్య 45,39,678 కాగా 2018-19 లో 54,28,247కి పెరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 75 నుండి రూ. 200 లకు పెంచగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ 200 నుండి రెండు దఫాల్లో రూ.2000 లకు పెంచారు.2018- 19లో తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లకు ఖర్చు చేసింది రూ. 8,234,62 కోట్లు అయితే రూ. 4,000 కోట్లు మాత్రమే అని తప్పుడు ప్రకటనలు ఇస్తూ, పచ్చి అబద్ధాలు చెబుతూ మోసం చేయడాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం హయాంలో రాష్ట్ర బడ్జెట్ చూస్తే రూ. 1,41 లక్షల కోట్లు కాగా, వైసీపీ హయాంలో బడ్జెట్ రూ. 2,35 లక్షల కోట్లకు పెరిగింది. తెలుగుదేశం హయాంలో రాష్ట్ర అప్పులు ఏడాదికి సగటున రూ. 30 వేల కోట్లు కాగా వైసీపీ హయాంలో ఏడాదికి రూ. 1,30 లక్షల కోట్లకు పెరిగాయి.
రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వంలో వృద్ధులు, వితంతువులకు రూ. 200, దివ్యాంగులకు రూ. 500 పెన్షన్‌గా ఇచ్చేవారు.అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో 39 లక్షల మందికి పంపిణీ చేసేవారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు. వృద్ధాప్య, వితంతువుల పెన్షన్లు రూ 200 నుండి రూ. 1000కు, దివ్యాంగులకు రూ. 500 నుండి రూ. 1500కు పెంచారు. అంచెలంచెలుగా పెన్షన్ల సంఖ్యను కూడా పెంచారు. 2019లో రూ. 1000 నుండి రూ. 2000లకు పెంచారు. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేతలు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, ఏఆర్‌టీ పేషంట్లకు పించను రూ. 1000 నుంచి రూ. 2వేలకు పెంచారు. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.1500 నుంచి రూ.3వేలకు పెంచారు. కిడ్నీ పేషెంట్లకు రూ. 2500 నుంచి రూ. 3వేలకు పెంచారు. డప్పు కళాకారులకు రూ. 3 వేలు, చర్మకారులకు రూ. 2 వేలు పంపిణీ చేశారు. అంతేగాక వయోపరిమితి విషయంలో కూడా పలు వర్గాలకు మినహాయింపులు ఇచ్చారు. ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే వరకూ 54,28,247మందికి పంపిణీ చేసింది. కానీ వాస్తవాలు ఇలా ఉంటే జగన్ రెడ్డి పెన్షన్ల అమలు పై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది.
నీరుకొండ ప్రసాద్
హైదరాబాద్
9849625610
Also Read...
మానసిక విశ్లేషణాత్మక సినిమా 'కాసవ్'