సినిమా అంటే ఇదేనా?

by Ravi |   ( Updated:2024-09-11 00:45:27.0  )
సినిమా అంటే ఇదేనా?
X

నేటి సినిమాలు చూస్తే రేపటి పౌరుల భవిష్యత్తు అంటే ఏమిటనే ప్రశ్న పుట్టుకొస్తుంది. సగటు ప్రేక్షకులు కాకుండా కాస్త సమాజం గురించి ఆలోచించే వారికి ఈ ప్రశ్న పుట్టకుండా ఉండదు. ఓ వైపు సైకాలజిస్టులు చిన్నపిల్లల ఎదుట తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు, వారితో ప్రేమగా మాట్లాడాలి.. అని చెబుతుంటే, మరోవైపు అదే తల్లిదండ్రులు సైకో సినిమాలను చిన్నపిల్లలతో కలిసి చూస్తున్నారు. తల్లిదండ్రులూ కాస్త ఆలోచించండి. మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారని. ఒకప్పుడు హీరో హీరోయిన్లు కాస్త సన్నిహితంగా ఉంటేనే ఆ సీన్ చూడకుండా తల్లిదండ్రులు పిల్లల కళ్లు మూసేవారు. ఇప్పుడు ఏకంగా అత్యాచారాలనే చూపిస్తు న్నాం. తేడా ఏంటనేది కాస్త ఆలోచించండి. నేటి బాలలే రేపటి పౌరులు కాదు.. రేపటి రౌడీలు అనే విధంగా ప్రేరేపిస్తున్న ఈ సినిమాలను పూర్తిగా బ్యాన్ చేస్తే బాగుంటుందని సమాజ సేవకులు, అలనాటి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

సినిమా అంటే క్రైమ్ అనే విధంగా..

సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కుటుంబం పరువు మర్యాద.. అనే కథలు ఉండేవి. ఆ కథలలో కథానాయిక, కథానాయకుడు ఇద్దరు భార్యాభర్తలుగా ఉండేవారు. వారికి లేదా ఆ కుటుంబానికి వచ్చిన ఆపదల నుంచి ఎలా బయటపడాలి, అందుకు కథానాయకుడు ఎదుర్కొనే ఎత్తుపల్లాలను కథనంగా చూపించేవారు. చివరికి సినిమా పూర్తి అయ్యేసరికి అందరూ హీరోకి క్షమాపణలు చెప్పి కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టేక్కించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ సంతోషంగా ఉన్న సమయంలో శుభం అని పడేది. ఆ తర్వాతి కాలంలో ప్రేమకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అయినప్పటికీ కుటుంబ విలువలు కొద్దోగొప్పో ఉండేవి. రాను రాను సినిమాలు అంటే కేవలం క్రైమ్ అనే విధంగా రూపుదాల్చుకున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులకు కూడా అవే నచ్చడం గమనార్హం. ఇప్పుడు ఏ సినిమా చూసినా హత్యలు, హత్యాచారాలు.. సైకో ఇజం.. దొంగతనాలు ఇవే. సినిమాలే కాకుండా కొత్తగా వచ్చే వెబ్ సిరీస్‌లు సైతం మర్డర్లు మానభంగాల వైపే మక్కువను చూపిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు పెద్ద హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు తీయడం బాధాకరమైన విషయమే.

సినిమాల ప్రభావం..

నాటి శివరామరాజు, సీతయ్య, అన్నయ్య సినిమాలు చూసి విడిపోయిన కుటుంబాలు కలిశాయి. ఇది జగమెరిగిన సత్యం. నేటి కాలంలో ఆ మధ్య వచ్చిన దండుపాళ్యం సినిమాతో ఒక రేపిస్టు తయారయ్యాడు. పుష్ప సినిమా చూసీ అదే రేంజ్‌లో కూరగాయల బండిలో ఎర్రచందనం రవాణా చేశారు. ఇక నిన్న మొన్న ఉత్తర ఢిల్లీలోని ఓ ఇంటిలో మొబైల్ ఫోన్ చోరీ చేసిన దంపతులను స్థానికులు చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలోని పాత్రల స్ఫూర్తితో దొంగలుగా మారామని చెప్పి పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది ఆ జంట. ఇక పద్నాలుగు ఏళ్ల బాలుడు 11 ఏళ్ల చెల్లిని, ఇంటర్ చదువుతున్న విద్యార్థి 8వ తరగతి బాలికపై అత్యాచారాలు అంటూ వచ్చిన వార్తల్లో కూడా ఇదే జరిగింది. వెబ్ సీరిస్‌లు బాగా చూడడం వల్లే వారు అలా చేశారని పోలీసులు తెలిపారు.

సినిమాల రూపంలో నిత్యం చెడును చూస్తూ.. వింటూ పెరుగుతున్న పిల్లల మంచిని ఎలా నేర్చుకుంటారు? అప్పట్లో ఆదివారం రోజు మాత్రమే ఓ ఛానల్‌లో నేరాలు, ఘోరాలు చూసేవారు. అది కూడా పెద్దలే. చిన్నపిల్లలు దాన్ని పలకడానికి కూడా భయపడేవారు. కనుక ప్రస్తుత సమాజంలో అత్యాచారాలను ప్రేరేపించే సినిమాలను సెన్సర్ బోర్డు అనుమతించకుంటే బాగుంటుంది. ఇదే విషయాన్ని రాణా నాయుడు సీరీస్ చూశాక చాలామంది సెలబ్రిటీలు కూడా చెప్పడం మనం విన్నాం.

అమీనా కలందర్

77994 26260

Advertisement

Next Story

Most Viewed