పోడు పట్టాల హామీ గాల్లో కలిసినట్లేనా?

by Harish |   ( Updated:2023-05-03 18:45:58.0  )
పోడు పట్టాల హామీ గాల్లో కలిసినట్లేనా?
X

ఫిబ్రవరి నెలాఖరులోగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా సాగుదారులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయినట్లేనా అన్న అనుమానం పోడు సాగుదారుల్లో కలుగుతోంది. మే నెల మొదటి వారం నడుస్తున్న ఈ హామీకి అతీగతీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీల మాదిరిగానే ఈ హామీ కూడా మరుగున పడుతుందేమోనన్న భయం కూడా గిరిజన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆదివాసీ రైతుల అనుమానానికి కారణం లేకపోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఆదివాసీలకు చేసింది కూడా ఏమీ లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర ప్రాంతాల్లో ఖర్చు పెట్టారు. ఏటా ట్రైకార్ పేరుతో ఆదివాసీలకు ఇచ్చే రుణాలను కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయింది. అనేక చోట్ల బ్యాంకర్లు ట్రైకార్ లబ్దిదారులకు ఏదో ఒక కారణం చూపి రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నిస్సహాయులుగా ఉండిపోయారు. ముఖ్యంగా ఐటీడీఏలు నిర్వీర్యం అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అనేక కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల నమ్మకాన్ని కోల్పోయిందనే చెప్పాలి.

ఇటు ఆదివాసీలు, అటు అధికారులు

పోడు వ్యవహారం మరీ ముఖ్యంగా అటవీ శాఖ అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడంతో ఆదివాసీల్లో ఆ భూమిపై ఆశ కలిగి పెద్ద మొత్తంలో అడవి ధ్వంసానికి గురై పోడు సాగు పెరిగింది. మరో పక్క అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఆక్రమణకు గురైన అటవీ భూములు గుంజుకొని వాటిల్లో తిరిగి అడవులు పెంచాలని ఒత్తిడి తీసుకు వస్తుంది. అనేక చోట్ల పేదలు సాగుచేస్తున్న పోడుభూములు గుంజుకొని వాటిల్లో ప్లాంటేషన్లు ఏర్పాటు చేశారు. ఇంకో పక్క హరిత హారాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ అటవీ అధికారులకు టార్గెట్లు ఇస్తుంది. దీంతో ఓ వైపు పోడుసాగుదారులను పట్టాల పేరుతో ప్రోత్సహిస్తూ ఇంకో పక్క అటవీ అధికారులకు అటవీ విస్తీర్ణం పెంచాలని ఆర్డర్లు వేయడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏంటో అంతుపట్టడంలేదు.

వ్యవసాయ సీజన్ రానే వచ్చింది

ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుంది. వ్యవసాయం కోసం ఆదివాసీలు తమ పోడు భూములను సిద్ధం చేస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే అటవీ శాఖ పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటూనే ఉంది. వ్యవసాయ సీజన్ మొదలైందంటే ఇటు పోడు సాగుదారులు అటవీ అధికారులకు మధ్య రోజుల తరబడి ఆదివాసీ గ్రామాల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ కొట్లాటల్లో రెండు వైపుల నుంచి తీవ్ర గాయాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం (భద్రాద్రి కొత్తగూడెం ఎర్ర బోరు రేంజర్ హత్య) వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇస్తానన్న పట్టాలు ఇంతవరకూ పత్తాలేవు. పైగా ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలోనే తిరిగి వ్యవసాయ సీజన్ ప్రారంభం అయింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు ఏంచేయాలో, ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదు. పోడు సాగును అడ్డుకుంటే అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదురవుతున్నాయి. పోడు సాగు ఆపకుంటే ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదురవుతుంది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌లో పోడు సాగుదారులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సీఎం మాట నిలుపుకో పోతే!

కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ పోడు భూముల సమస్యను ఆషామాషీగా తీసుకొని మాట తప్పితే ఆదివాసీలు కేసీఆర్‌ను ఎప్పటికీ నమ్మరు. తెలంగాణలో ఉన్న ఆదివాసీ సమాజం బీఆర్ఎస్ పార్టీకి దూరం కాక తప్పదు. రాష్ట్రంలో ఉన్న 12 గిరిజన అసెంబ్లీ స్థానాలపై ఆ ప్రభావం ప్రత్యక్షంగాను, మరి కొన్ని స్థానాల్లో పరోక్షంగాను పడనుంది. ఆదివాసీలను మోసం చేసిన చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారు. ఇప్పటికే అనేక సామాజిక వర్గాల్లో ఆ పార్టీ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని ప్రభుత్వంగా ముద్రపడినమాట వాస్తవం. వర్షాకాలం మొదలు కాకముందే, ఎలాంటి భయం లేకుండా హక్కు పత్రాలతో తమ పోడు భూముల్లోకి ఆనందంగా అడుగుపెట్టి వ్యవసాయం చేసుకునేలా ప్రభుత్వం మాట నిలుపుకోవాలి. ఆ దిశగా కేసీఆర్‌ను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు ఒకటికి పదిసార్లు వెంటపడి పోడు భూములకు పట్టాలు వచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయకపోతే అధికార పార్టీ నుంచి తిరిగి ఎన్నికల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా ఆదివాసీలు ఐక్యం కాక తప్పదు.

- పి. క్రాంతి, జర్నలిస్టు

85019 05444




Advertisement

Next Story