- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూటమిది ఆరంభ శూరత్వమేనా?
అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీలకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి.
జంపింగ్ మాస్టర్ నితీశ్
కేంద్ర ప్రభుత్వం బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించిన మరుసటి రోజు, అనగా బుధవారం ఆయన జయంతి నాడు సందర్భంగా రాష్ట్రంలో రాజకీయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోసారి బీజేపీ వైపు జంప్ చేసి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ఇలా ఆయన మరోసారి యూటర్న్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి బీజేపీ.. మరోసారి కాంగ్రెస్ కూటమి.. ఇప్పటి వరకు పలుమార్లు ఎన్డీయేలో చేరిన నితీష్ కుమార్.. మళ్లీ ఇప్పుడు అదే కూటమికి దగ్గరైపోయారు. 2015 ఎన్నికల సమయంలో ఆయన బీజేపీతో ఉన్న 15 ఏళ్ల బంధాన్ని తెంచుకున్ని తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపి మహాకూటమిగా పోటీ చేసి విజయం సాధించారు. దీన్ని 2017 దాకా కొనసాగించి వెంటనే ఎన్డీయేలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళి 2022లో దూరమయ్యి మళ్ళీ కూటమితో జతకట్టారు.. కొన్ని రోజుల క్రితం కూటమికి దూరమయ్యి మరోసారి ఎన్డీఏలో చేరారు. దీంతో ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోయే లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, పొత్తు ఎవరితో ఉన్నా.. ఏ కూటమిలో ఉన్నా సీఎం పదవిని మాత్రం దక్కించుకుంటున్నారు. ఈసారి కూడా అదే బాటలో నడుస్తారా.. లేదా.. కొత్త ట్విస్ట్ ఏమైనా ఉంటుందో చూడాలి.
ముందు అంతా బాగున్నా…
5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇండియా కూటమి పరిస్థితి బాగానే ఉంది ఓ దశలో కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ అడిగిన స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో అఖిలేష్ యాదవ్.. ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారు. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత.. కాంగ్రెస్ అంటే మిగతా పార్టీలు లెక్క చేయకపోవడం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమత సైతం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల భారత కూటమికి గట్టి షాకిచ్చింది. కూటమిలో కీలక నేతగా ఉన్న ఆమె వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తుతో పోటీకి వెళ్లదని అన్నారు. కూటమిలోని పార్టీలతో తమ ప్రతిపాదలన్నీ తిరస్కరణకు గురయ్యాయని, అందుకే ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ఒంటిరిగానే పోటీ చేసినా, ఇండియా కూటమిలో కొనసాగుతామని తెలిపారు.
మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. లేదంటే తర్వాతేం చేసినా గత జల సేతు బంధనం అవుతుంది.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445