అనువాదం ఒక కళ.!

by Ravi |   ( Updated:2023-09-29 00:15:33.0  )
అనువాదం ఒక కళ.!
X

మానవ ప్రపంచం భిన్న నాగరికతల సమ్మిళితం. అనేక భాషలు, భావాలు, సంస్కృతులు, సంప్రదాయాల నిలయం. ఒక వ్యక్తికి మరో వ్యక్తితో, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రంతో, ఒక దేశానికి మరో దేశంతో అవసరాలు, ఇచ్చిపుచ్చుకోడాలు, ఎగుమతులు, దిగుమతులు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాలు, రాకపోకలు, లావాదేవీలు సర్వ సాధారణం. ఒకరి అవసరాలు మరొకరికి తెలియాలన్నా, ఒకరి భావాలు మరొకరికి అర్థం కావాలన్నా భాష చాలా కీలకం. ప్రపంచ మానవులందరిదీ ఒకే భాష కాదు కాబట్టి, ప్రపంచంలోని దేశాలన్నీ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఒకరికొకరు సహకరించుకునేందుకు అనువాదం సహాయకారి అవుతుంది. ప్రపంచ ప్రజలందరి భాష ఒకటి కానందున, ఒక భాషను మరో భాషలోకి తర్జుమా చేసినప్పుడే వారు చెప్పదలుచుకున్నది, వారు మాట్లాడదలుచుకున్నది ఏమిటో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్నప్పుడే వివిధ దేశాల నాగరికతలు మనకు అవగతమవుతాయి. అందుకే అనువాద ప్రక్రియ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఒకరి భావాన్ని ఒకరు పలికించి..

అభివృద్ధి, నాగరికతల పెరుగుదల, రాష్ట్రాలు, దేశాల మధ్య విస్తరిస్తున్న సంబంధాలు, ప్రపంచాన్నే ఓ కుగ్రామంగా మార్చేసిన అంతర్జాల ప్రభంజనం నేపథ్యంలో విదేశీ, స్వదేశీ భాషల పట్ల అవగాహనకు అనువాదం ఎంత అవసరమైన ప్రక్రియో మనకు అర్థమవుతోంది. దీని ఆవశ్యకతను, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ సమాఖ్య (ఫిట్) గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ భాషా సమూహాల మధ్య సమాచార వారధికి, సమన్వయానికి, దేశాలు, దూరాలు దగ్గరవ్వడానికి, పరస్పర సహకారాలకు, ప్రపంచ శాంతి, జీవన భద్రతకు అనువాద ప్రక్రియ చోదక శక్తిగా పని చేస్తుంది. అందుకే, 1991లో అనువాదకుల కృషికి, సేవలకు ఓ అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న'ఫిట్' ఆలోచన ఫలితంగా 2017, మే 24న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. అప్పటి నుండి ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

అనువాదం అనేక రూపాలను ఆవిష్కరిస్తుంది. నేటికీ వివిధ దేశాలూ, సంస్కృతుల మధ్య అనేక అడ్డంకులు, అపార్ధాలు, అపనమ్మకాలు ఉన్నాయి. దీన్ని నివారించాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషల ప్రజలు ఒకరినొకరు తెలుసుకోవాలంటే అనువాదమే మార్గం. నేటికీ పంచాయితీ మొదలు, పార్లమెంట్ స్థాయి వరకు ‘అనువాదం’ లేనిదే అణు మాత్రమైనా కాగితం ముందుకు కదలని, గొంతు పెకలని పరిస్థితి. అసలు, ‘అనువాదం’ అంటే పునః ఉచ్చారణ అని చెప్పుకోవచ్చు. ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరు చెప్పడం, ఒక భాషలో భావాన్ని మరో భాషలో పలికించడం అన్నమాట. భారతీయ భాషలు మొదలు, విదేశీ భాషలు, విదేశీ సాహిత్యం వరకు తెలుగులోకి అనువాదాలు జరిగాయి. అయితే ఇతర భాషల నుండి తెలుగు భాషలోకి అనువాదాలు అయినంతగా, తెలుగు నుండి ఇతర భాషలలోకి అయిన అనువాదాలు తక్కువే.

అప్పుడే అనువాదం రక్తి కడుతుంది..

అనువాదమంటే, మూలరచనను యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి కాగా, మూల రచన ఉద్దేశ్యం చెడకుండా స్వేచ్ఛానువాదం చేయడం మరొక పద్ధతి. తెలుగు అనువాద సాహిత్యాన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. భారతీయ సాహిత్యం నుండి తెలుగు భాషలోకి అయిన అనువాదాలు ఒక భాగమయితే, విదేశీ భాషా సాహిత్యం నుండి తెలుగులోకి చేయబడిన అనువాదాలు మరొక భాగం. జనరంజకమైన భారతీయ సాహిత్యం ఇంగ్లీషు, సంస్కృతం, ఉర్దూ భాష నుండి తెలుగు భాషలోకి ఎన్నో గ్రంథాలు, నవలలు అనువదించబడ్డాయి. ప్రపంచంలోని ఎన్నో భాషలకు చెందిన సాహిత్యం, ఆయా దేశాలు అనుసరించే చట్టాలు.. తదితర విషయాలన్నీ కేవలం అనువాదం పైనే ఆధారపడి ఉన్నాయి. ఇంతటి ఘనమైన నేపథ్యం ఉన్న అనువాద కళ ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక రకంగా ఇది కత్తిమీద సామే.

రచన ఒక కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల సాము. ఒక భాష వచ్చిన ప్రతి ఒక్కరూ రచయిత కాలేరు. అలాగే, రెండు భాషలు వచ్చిన ప్రతీవారూ అనువాదకులు కాలేరు. అయినా, అనువాదకుడికి రెండు భాషలపై గట్టి పట్టుండాలి. ప్రామాణికతతో కూడిన సాధికారత ఉండాలి. ఇరుభాషలపై అధికారం చెలాయించగల సత్తా ఉండాలి. అప్పుడు మాత్రమే అనువాదం రక్తి కడుతుంది. లేకపోతే అది కృత్రిమంగా ఉండి చదువరిని చిరాకు పరుస్తుంది. మూల రచయితకు ఉన్న స్వేచ్ఛ అనువాదకులకు ఉండదు. అతడు లేదా ఆమె కొన్ని పరిధులకు లోబడి అనువదించాల్సి ఉంటుంది. అయినా సరే అనువాదం రంజింపజేయాలంటే, మూల రచనకు సంబంధించిన విషయావగాహన, దాని సంబోధితులు, రచనాకాలం లాంటి అనేక విషయాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. శ్రమ, శ్రద్ధ, కృషి, సాధన, నిరంతర అధ్యయనం ద్వారా అనువాద కళను రంజింప జేయవచ్చు. సాధన ఉంటే ఏదైనా సాధ్యమే. అందుకే అనువాదం నిత్య అవసరం, నిత్య నూతనం, అజరామరం.

(రేపు అంతర్జాతీయ అనువాద దినోత్సవం)

యండి. ఉస్మాన్ ఖాన్

ఉర్దూ, తెలుగు అనువాదకులు

99125 80645

Advertisement

Next Story

Most Viewed