- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒప్పందాలు పట్టించుకోని పామాయిల్ కంపెనీలు!
ప్రపంచవ్యాపితంగా వంట నూనెల వాడకంలో పామాయిల్ అత్యధికంగా ఉంది. అయితే, ఈ పామాయిల్ సాగు, ఉత్పత్తిలో ఇండోనేసియా అగ్ర స్థానంలో ఉంది. ఇక్కడి విదేశీ కంపెనీలు పామాయిల్ వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలు లాభాలు పొందుతుంటే, పామాయిల్ తోటలకు కేంద్రంగా ఉన్న గిరిజన తెగల ప్రజలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు. భూములు కోల్పోయిన గిరిజన ప్రజలకు ఉపాధి సమస్యగా మారటమే అందుకు కారణం.
ఒక వార్తా చానల్ డాక్యుమెంటరీ ప్రకారం, తమ్ యాడి అనే గిరిజనుడు, ఆహారం కోసం నదీమార్గాన బయల్దేరగా, అతనికి ఏ జంతువు దొరకలేదు. కారణం అక్కడ అడవి లేకపోవడం. ఇతను ఇండోనేసియాలో విదేశీ కంపెనీల వలన అంతరించిపోతున్న సంచార తెగలలో రింబా తెగకు చెందినవారు. ఈ తెగకు చెందినవారు సుమత్రా ద్వీపంలోని అడవిలో నివసిస్తున్నారు. రబ్బరు పండించడం, వేటాడటం, పండ్లను సేకరించటం వారి ప్రధాన వృత్తి.
ఏటా 600 కోట్ల నష్టం!
1990లో ఒక పామాయిల్ కంపెనీ డబ్బులు ఇస్తామని, అభివృద్ధి చేస్తామంటూ మారుమూల ప్రాంతమైన టెబింగ్ టింగికి వచ్చింది. మాయ మాటలతో పూర్వీకుల నుంచి హక్కుగా పొంది ఉన్న వారి భూములను స్వాధీనం చేసుకుంది. భూముల్లో పామాయిల్ మొక్కలు నాటింది. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకునేందుకు ఆ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి హామీ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సమకూర్చుకునేందుకు ‘ ప్లాస్మా' (అభివృద్ధి చేసిన భూమిలో ఇచ్చే వాటా భూమి)అని పిలిచే ప్లాట్లలో స్థానికులకు భాగం కల్పిస్తామని చెప్పింది. 2007 ఇండోనేసియా చట్ట ప్రకారం కంపెనీలు కొత్తగా ఫ్లాంట్లేషన్ మొదలు పెడితే అందులో ఐదో వంతు కమ్యూనిటీలకు ఇవ్వాలి. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి వాగ్దానాలు చేశాయి. కంపెనీలన్నీ ఇచ్చిన హామీలను అమలు జరపలేదు. చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చలేదు.
ఈ భూమి ఒక్క సెంట్రల్ కాలి మంతన్ ప్రావిన్స్‌లోనే 2.5లక్షల ఎకరాలు ఉంది. ఈ భూముల విస్తీర్ణత లాస్ ఎంజల్స్ నగరమంత ఉంది. ఇవన్నీ ప్రభుత్వ డాక్యుమెంట్లలో వెల్లడైన వివరాలే.పామాయిల్ నుండి లభించే లాభాలను కొలిచే సాంప్రదాయ ప్రమాణాల ప్రకారం ఈ స్థానిక తెగలు ప్రతి సంవత్సరం 90 మిలియన్ల డాలర్లు (667కోట్లు) నష్టపోయారు. ఇండోనేషియాలో కార్పొరేట్ కంపెనీల మొత్తం పామాయిల్ సాగులో ఈ ప్రాంతంలోనే ఐదవ వంతు ఉంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటాను పరిశీలించినప్పుడు ఇతర ప్రాంతాల్లోని పామాయిల్ తోటల్లో కూడా కంపెనీలు ఒప్పందాలను అమలు జరపలేదు.
అడవితో నిండిన తోటలు నేడు..
ఇండోనీషియా వ్యాప్తంగా ప్రతి ఏటా వందల మిలియన్ డాలర్లు స్థానిక తెగలు నష్ట పోతున్నారు. తమ ప్లాంటేషన్లను స్థానిక కమ్యూనిటీలతో పంచుకోవటానికి చేసిన వాగ్ధానాలను, చట్టపరమైన హక్కులను నెరవేర్చటంలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న13 కంపెనీలు ఉన్నట్టు తెలుస్తుంది. పామాయిల్ తోటల పెంపకంతో కంపెనీలకు డబ్బుల వర్షం కురిసింది. పెద్ద ఎత్తున పంట మిల్లుకు చేరింది. పామాయిల్ కంపెనీలు ఒప్పందాలను అమలు జరపని ఫలితంగా ప్రజలు తీవ్రంగా ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒరాంగ్ రింబాలో ప్రజల లాగానే తెగ పెద్ద సితి మణినా పండి రాలిన ఆయిల్ పండ్లను ఏరుకుని వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నాడు. ఎక్కువగా పండ్లు దొరికినప్పుడు బియ్యం, కూరగాయలు కొనడానికి డబ్బులు ఉంటాయి. పామాయిల్ తోటలు మూలంగా ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం కల విస్తారమైన అడవులు ఇండోనేషియాలో నరికివేశారు. ఒకప్పుడు అడవి తో నిండి ఉన్న ఇండోనేషియా దీవులైన బోర్నియా, సుమత్రాలో ఇప్పుడు పామాయిల్ తోటలతో నిండిపోయాయి.
పామాయిల్ కంపెనీలు ప్లాస్మాను, ఒప్పందాలను అమలు జరపక పోవటంతో భూములు కోల్పోయిన గిరిజనులు గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల ఫిర్యాదులతో నిరసన ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వాటిని నిర్బంధంతో అణచివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది. వివాదా పరిష్కారానికి 2015లో స్థానిక రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో సలీం గ్రూప్ ప్లాస్మాను అందజేస్తానని వాగ్దానం చేసి కొత్త ఒప్పందంపై సంతకం చేసింది. అయినా ఒప్పందం అమలు జరగలేదు. ఒప్పందాలు అమలు చేయని సలీమ్ గ్రూప్ పై ప్రజలు ఆగ్రహం చెంది కంపెనీపై విరుచుకపడితే, సాయుధులైన పోలీసులు విరుచుకుపడి 40 మందికి పైగా ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఇప్పటికీ సమస్యకు ఎటువంటి పరిష్కారం లభించలేదు. వ్యవస్థ విఫలతే ఇందుకు కారణం.
ప్రజలు మద్దతు ఇవ్వాలి..
ప్రజల నిరసనల తర్వాత, ఒరాంగ్ రింబా తెగ పూర్వీకుల భూమిని తిరిగి ఇవ్వాలని పార్లమెంటరీ కమిషన్ సలీం గ్రూప్ ని కోరింది. కమిషన్ తీరు దొంగను బ్రతిమిలాడుకున్న విధంగా ఉంది.సలీం గ్రూప్ పార్లమెంటరీ కమిషన్ సూచనను పట్టించుకోలేదు. ఇండోనేసియా ప్రభుత్వానికి సలీం గ్రూప్ లాంటి కంపెనీలపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు. కారణం వాటి ప్రయోజనమే పాలకులకు ముఖ్యం కాబట్టి. తమ భూముల కోసం, ఒప్పందాల అమలు కోసం పోరాడుతున్న గిరిజన ప్రజలను నిర్భందం ద్వారా అణచి వేసే విధానాలు అనుసరిస్తున్న ఇండోనేషియా ప్రభుత్వం, పామాయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం ఎడిబుల్ ఆయిల్ విదేశాలకు ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. ప్రపంచ వ్యాపితంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో పామాయిల్ కంపెనీలకు బాగా లాభాలు పెరిగి వాటి అధిపతులు బిలియనీర్లుగా మారారు. తమ భూముల కోసం, హక్కుల కోసం పామాయిల్ కంపెనీలకు వ్యతిరేకంగా గిరిజన తెగల ప్రజలు చేసే పోరాటం న్యాయమైనది. ప్రపంచ ప్రజలు అందరూ వారికి మద్దతు ఇవ్వాలి. బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలి.
బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం
98859 83526