- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీటలు వారుతున్న భారత్, కెనడా బంధాలు..
2021 నుంచి భారత్, కెనడా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)ద్వారా కుదిరాయి. వివిధ వస్తువులు, సేవలు ఎగుమతులు, దిగుమతులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా వ్యవసాయం, సాంకేతికత, సహజ వనరుల వంటి రంగాల్లో మార్పిడి విషయాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం క్రమంగా పెరుగుతూ స్నేహ బంధం బాగా బలపడింది. భారతీయ కంపెనీలు కెనడాలో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఇంధనం వంటి రంగాలలో పెట్టుబడులు భారీగా పెట్టాయి. అలాగే కెనడియన్ కంపెనీలు కూడా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం వంటి భారతీయ పరిశ్రమలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అయితే, ఇరుదేశాల మధ్య కొద్దిపాటి వాణిజ్య సంబంధాలలో నియంత్రణ అడ్డంకులు, టారిఫ్ సమస్యలు, మేధో సంపత్తి హక్కుల రక్షణలో తేడాలు వంటి సవాళ్ల, విభేదాలు కూడా ఉన్నాయి. అయితే అవి వ్యాపార, వాణిజ్య సంబంధాలలో సహజంగా ఉండేవే.
జీ 20లో అంటీముట్టనట్లు..
ఈ మధ్య న్యూఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశాల్లో సైతం మన భారతదేశానికి కెనడాతో ఉన్న స్నేహ సంబంధాలు అంత బాగా లేనట్లుగా సదస్సులో స్పష్టంగా కనపడింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దేశాధినేతల విందుకు కూడా హాజరు కాలేదు. ఈ సదస్సులో మన ప్రధాని మోదీతో ట్రూడో ముభావంగా అంటీ ముట్టనట్టుగా ఉండటం కనిపించింది. అలాగే సమావేశాల అనంతరం తిరిగి కెనడా వెళ్ళే సమయంలో ఆయన వెళ్ళవలసిన విమానంలో రిపేర్లు వచ్చి ప్రయాణం వాయిదా పడితే మనం విమానం ఇస్తామంటే కూడా కాదని, కెనడా నుండి మరో విమానం వచ్చేంత వరకు వేచి ఉండి తిరిగి ప్రయాణం అయ్యాడు. సమావేశాల మొత్తంలో ట్రూడో ఎందుకో చాలా అన్ ఈజీగా ఉండటం మీడియాలో అందరూ గమనించారు. మొన్న కెనడా ప్రధాని ట్రూడో కెనడా పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ తన దేశ గడ్డపై, తన దేశ పౌరుడైన , ఖలిస్తానీ వేర్పాటు వాద నాయకుడిని హత్య చేశారనీ,దాని వెనుక భారతదేశ హస్తం ఉన్నదంటూ సంచలన ప్రకటన చేశారు.
ఈ హత్యను ప్రధాన కారణంగా పేర్కొంటూ, భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)తరపున పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఒక దౌత్యధికారి కెనడా నుండి బహిష్కరించారు. అందుకు ప్రతిస్పందనగా వెంటనే భారతదేశం కూడా కెనడా రాయబారిపై వేటు వేసింది. అతనిని ఐదు రోజులలో కెనడాకు తిరిగి వెళ్ళాలని ఆదేశించడం కూడా జరిగి పోయింది. ట్రూడో చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.
ట్రూడో ఆరోపణలతో…
ఖలిస్తాన్ ఉగ్రవాదులకు, తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తూ, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై భారత దేశం లోగడ అనేక ఫిర్యాదులు చేసినా కెనడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఖలిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలను నిలువరించలేకపోగా, కెనడా ప్రభుత్వం వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించింది. పైగా తన నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం విచిత్రం. ఈ అసంబద్ధ, అనాలోచిత ప్రకటనకు భారత్ ప్రభుత్వం దీటుగా సమాధానం ఇచ్చింది.
అయితే మనకు శతృదేశం నుండి లేదా మన దేశ ప్రగతిని చూసి అసూయతో పొరుగు దేశాలు చేసే ఇలాంటి అర్ధరహిత, అనాలోచిత ఆరోపణలు, సమస్యలు ఎదురైతే పెద్దగా లక్ష్యపెట్టవలసిన అవసరం లేదు. కానీ, కెనడా మనకు మిత్రదేశమే. అలాగే సంపన్న దేశాల కూటమి జీ.7, జీ 20లోనూ, అతి పెద్ద పాశ్చాత్య దేశాల కూటమి నాటోలో సభ్యదేశం కూడా. మన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలు కూడా చక్కగా కొనసాగుతున్నాయి. పైగా మూడున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చక్కగా చదువుకుంటున్నారు. కొందరు చిన్నపాటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన దేశ యువకులకు ఉద్యోగాల కల్పనా విషయంలో కెనడా మనకు కొంత మేరకు మంచి అవకాశాలను కూడా ఇచ్చింది. ఎంతో సాన్నిహిత్య స్నేహ సంబంధాలు ఉన్న తరుణంలో, చక్కటి వాతావరణం ఉన్న సమయంలో ట్రూడో ఆరోపణలు మన దేశానికే కాక ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు ట్రూడో ప్రకటనను ఆందోళనకరమైన విషయంగా పేర్కొన్నాయి. తన దేశం నడిబొడ్డున తన పౌరుడిని భారతదేశ ఏజెంట్లు హత్య చేశారని కెనడా పార్లమెంట్ నిండు సభలో ట్రూడో ప్రకటించటం ఓ సంచలనం. నిర్దిష్టమైన ఆధారం ఏది చూపకుండా ఓ ప్రధానమైన మిత్ర దేశంపై ఆరోపణలు చేయటం ఆశ్చర్యకరం. అవాంఛనీయం కూడా!
ఖలిస్తాన్ వాదుల పట్ల మెతక వైఖరి
ప్రస్తుతం కెనడాలో సుమారు 7 నుంచి 8 లక్షల సిక్కు జనాభా ఉంది. అక్కడ సిక్కులు బలమైన రాజకీయ వర్గంగా ఉన్నారు. వీరు ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని బలపరుస్తారు. పైగా, గురుద్వారా నిర్వహణ ద్వారా సమకూరిన నిధులతో మన దేశంలో, పంజాబ్‌లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు హర్దీప్ సింగ్ నిజ్జర్ కృషి చేస్తున్నాడన్న అనుమానాలు భారత ప్రభుత్వానికి ఎప్పటినుండో ఉన్నాయి. పైగా 2021లో జస్టిన్ ట్రూడోకు ప్రభుత్వ ఏర్పాటుకు చాలినంత బలం లేకపోవడంతో ఖలిస్తానీ మద్దతు దారుడైన 'జగ్మీత్ సింగ్ ధలీవాల్' నేతృత్వంలోని ఎన్డీపీ మద్దతు తీసుకోవలసి వచ్చింది. అందువల్ల ఖలిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో ట్రూడో మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన గురుద్వారా ముందు వ్యాన్‌లో ఉన్న నిజ్జర్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటన కెనడాలోనే కాక ఖలిస్తానీ సానుభూతి పరులున్న ఇతర దేశాల్లో కూడా సంచలనం రేపింది. నిరసనల పేరిట భారత దౌత్య కార్యాలయాల పైనా, హిందూ దేవాలయాల పైన అన్నింటి పైన దాడులు జరగాయి. ఈ హత్య వెనక భారతదేశ హస్తం ఉన్నదని అప్పట్లోనే వీరంతా ప్రకటించారు. 45 రోజుల వ్యవధిలో విదేశాల్లో ఉంటున్న ముగ్గురు ప్రముఖ ఖలిస్తానీ నాయకులు మరణించడం వెనక కూడా భారత సీక్రెట్ ఏజెంట్ల కుట్ర ఉన్నదని వారి అనుమానం.
ఈ హత్యకు నాలుగు రోజులు ముందు ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అధినేత 'అవతార్ సింగ్ ఖండా' బ్రిటన్ లోని ఒక ఆసుపత్రిలో మరణించాడు. ఇది క్యాన్సర్ మరణమని బ్రిటన్ పోలీసులు కూడా ధృవీకరించారు, అయినా అతని మద్దతుదారులు మాత్రం భారత సీక్రెట్ ఏజెంట్లు విషం పెట్టి చంపారని ప్రచారం చేస్తున్నారు. ఇక, భారతదేశం తీవ్రవాదిగా ప్రకటించిన ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అధినేత 'పరమగీత్ సింగ్ పంజ్వార్' పాకిస్తాన్ లోని లాహోర్ నడివీధిలో మే 6న హత్యకు గురయ్యాడు. దీనికితోడు, మన దేశీయ మీడియా సంస్థలలో కొన్ని అత్యుత్సాహంతో ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని మొగ్గలోనే తుదముట్టించడానికి మన నేతలు సాహసోపేతమైన చర్యలు తీసుకుంటున్నారు అంటూ ఉదహరించారు. అందుకే 'నిజ్జర్' మృతి విషయంలో కేవలం ఆరోపణలుగా ఉన్న వాటినే ఇప్పుడు ట్రూడో ధ్రువీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజం నిలకడ మీద నిగ్గు తేలుతుంది. అంత వరకు వివాదం మరింత ముదరకుండా, పరస్పర స్నేహ సంబంధాలు తెగేంతవరకు లాగకుండా సామరస్యంతో సహకార భావంతో తెలివిగా ఇరు దేశాలు వ్యవహరించడం ఉభయ దేశాలకు శ్రేయస్కరం. అప్పుడే జీ 20 దేశాల ఐక్యత నిలబడుతుంది.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496
- Tags
- india vs canada