- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్య దేశంలో.. నియంతృత్వ లక్షణాలు!
దేశంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ఇంచుమించు అన్ని పార్టీలు కుటుంబ వ్యవస్థలుగా, ప్రైవేటు ఆస్తులుగా మారాయి. ప్రజాస్వామ్యం పార్టీల చేతుల్లో ఉంది, పార్టీలు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికలు వరకు పెద్ద ప్రహసనంగా మారి ప్రజాస్వామ్యాన్నే సవాల్ చేస్తున్నాయి. గతంలో అభ్యర్థుల ఎంపిక వృత్తి, విద్య, సామాజిక సేవ, కుటుంబ నేపథ్యం తదితర అంశాలు అర్హతలుగా ఉండేవి. ఇప్పుడు కులం, డబ్బు మాత్రమే అర్హతలుగా మారాయి. ఆయా అభ్యర్థులకు చెందిన కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్లు పెడతారని ఆలోచిస్తున్నాయి. దీంతో ధన ప్రభావం బాగా పెరిగి ఎంత డబ్బు పెడితే అన్ని ఓట్లు అనే భ్రమల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు కన్సల్టెన్సీలను పెట్టుకుంటున్న తరహాలో రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను పెట్టుకునే కొత్త సంప్రదాయాలకు తెరతీశాయి. గతంలో ఆయా పార్టీల్లో ఉండే నాయకులే వ్యూహకర్తలుగా ఉండేవారు. ఇప్పుడు కోట్లు ఖర్చుపెట్టి అధికారమే పరమావధిగా వ్యూహకర్తలను పెట్టుకుంటున్నాయి.
మహారాజులుగా.. ప్రజాప్రతినిధులు!
ప్రస్తుతం ఈ సమాజం ఏ దశలో ఉంది. రాజకీయ పక్షాల ప్రతినిధులు ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఎంత దిగజారి ఎన్ని బూతులు మాట్లాడితే సమాజం అంత బాగా ఆస్వాదిస్తోంది. ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు. మీడియా కూడా వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శలు స్థాయికి తగ్గట్లుగా ఉండటం లేదు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్తవుతుంది. ఇక ఆత్మస్తుతి పరనిందలకు అంతేలేదు. స్వచ్ఛందంగా ప్రజాసేవ చేసే వేదిక రాజకీయం రంగం అనే భావన గడచిన తరంలో ఉండేది. ఈ తరం దానిని కాస్తా లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. ఇదో సామాజిక బాధ్యత అనేది మర్చిపోయారు. పదవి, అధికార హోదా అనేది ప్రజలపై స్వారీ చేయడానికనే ఫ్యూడల్ భావజాలం నేటి నాయకత్వంలో చోటుచేసుకుని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి.
సిద్ధాంతాలు, ఉన్నతమైన లక్ష్యాల పునాదులపై నిర్మితమైన రాజకీయ పార్టీలు క్రమంగా వాటికి దూరమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. అపవిత్ర కలయికలకు సైతం వెనుకాడటం లేదు. అవకాశవాద రాజకీయాలనే అజెండాగా మార్చుకుని ఎంతకైనా బరితెగిస్తున్నారు. అభ్యర్థులకు ఓట్ల కొనుగోళ్లకు ఎంత ఖర్చవుతుందో.. టికెట్ తెచ్చుకోవడానికి ఇంచుమించు అంతే ఖర్చవుతోంది. పార్టీ ఫండ్ రూపంలోనో, మరోరూపంలోనో ధనిక అభ్యర్థులు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక సామాన్యులకు, సమర్థులకు ఎన్నికల బరిలో చోటు లేకుండా పోయింది. ఇంత పేద దేశంలో శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి సుమారు 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేసిన తర్వాత తిరిగి వాటిని ఎలా సంపాదించుకోవాలో ఆలోచించకుండా ఎలా ఉంటారు? చట్టంతో సంబంధం లేని అధికారాలు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కట్టబెడుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు మకుటం లేని మహారాజులుగా వారు వెలుగొందుతున్నారు.
నేరస్థులు.. చట్టసభల్లోకి
ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను పరిగణనలోకి తీసుకోవడం పార్టీలు, ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. పార్టీలు ఫిరాయిస్తున్నా, కోట్లు కొల్లగొడుతున్నా, నేరచరిత్ర ఉన్నా ప్రజలు పట్టించుకోవడం మానేసి చట్టసభలకు పంపిస్తున్నారు. ఇలా ఎన్నికైన వారు ఎలాంటి తప్పు చేసినా కులం ముసుగుకప్పి వెనకేసుకొస్తున్నారు. ఓట్లు కొంటున్నారు, సారా పంచుతున్నారు, కులం, మతం, ప్రాంతం అన్నింటిని ప్రయోగిస్తూ ఎన్నికల వాతావరణాన్ని అందరూ సమిష్టిగా కలుషితం చేస్తున్నారు. ఇలాంటి సంప్రదాయాలు లోక్ సభ, శాసనసభకే పరిమితం కాకుండా పెద్దల సభల్లో సైతం నేర నేపథ్యం కలిగినవారు, అవినీతిపరులు ప్రవేశిస్తున్నారు. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. దీంతో ఏ సభలో కూడా నిర్మాణాత్మకమైన చర్చలు జరగడం లేదు. ఎన్నికల్లో పోటీకి నిలబడినప్పుడు ప్రకటించిన ఆస్తులు ఐదేళ్ల తర్వాత రెట్టింపు అవుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కడా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం లేదు. కానీ కొన్ని దేశాల్లో విలువలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. మనదేశంలో విలువలు పతనమై ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో పాలకపక్షాలు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయి. చివరకు న్యాయవ్యవస్థను సైతం వదిలిపెట్టకపోవడంతో వీటి స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారింది. రాచరికపు వ్యవస్థలో సైతం కొన్ని పరిమితులు, పరిధులు ఉన్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మాత్రం నియంతృత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల సమ్మతితో శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే. చట్టబద్ధ పాలన చంకనాకిస్తూ, యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం అప్రజాస్వామికం అవుతుంది. ఓట్లు కొనకుండా ఏ ఎన్నికల్లోనైనా గెలవడం ఊహించగలమా పేరుకు మాత్రమే చట్టపాలన ఉంది. అది ఎవరికీ కనిపించదు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం సమర్థంగా అమలుచేస్తున్న దేశాల జాబితాలో మన దేశం 67వ స్థానంలో ఉంది.
ప్రజాసమస్యలపై.. చర్చ ఉండదు!
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలకపక్షాలలో పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అవి మచ్చుకైనా కనిపించడం లేదు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు, పెన్షన్లు, అలవెన్స్‌ల రూపంలో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ ఇంత ధనం వెచ్చిస్తున్నా ప్రజల ప్రయోజనాలు మాత్రం నెరవేరడం లేదు. చట్టసభల్లో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు. ప్రజాసమస్యలపై చర్చించడమే సమయం వృధా అన్నట్లుగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పార్లమెంట్, శాసనసభ సమావేశాలు జరిగే కాలాన్ని కూడా కుదించేశారు. ఎక్కువ రోజులు సభ నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. మొక్కుబడిగా సమావేశాలు జరుగుతున్నాయి. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలే ఎన్నికవడంతో సభ లోపల, వెలుపల సమస్యల పట్ల బొత్తిగా అవగాహన లేకుండా పోయింది. పేదరికం పేరిట ఉచిత పథకాల ముసుగులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమదృష్టితో చూడకుండా కేవలం సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. దీనికోసం భవిష్యత్ తరాలను తాకట్టుపెట్టి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తున్నారు. ఆ డబ్బుతో దర్పం వెలగబెడుతూ వారిపైనే స్వారీ చేస్తున్నారు.
మనతో పాటు స్వాతంత్య్రం పొందిన దేశాలుకాని, మన పొరుగున ఉన్న దేశాలతో పోల్చినప్పుడు మన ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పొచ్చు. ఎన్నికల నిర్వహణ, అధికార మార్పిడి సక్రమంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక ప్రగతి, ఆదాయ వనరులు ఆశాజనకంగానే ఉన్నాయి. కరోనా నియంత్రణ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మన విదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో మన కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగాయి. అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిని తట్టుకుని నిలిచింది. భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ భారత ప్రజాస్వామ్యం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఆస్తులు ధారాదత్తం చేసే విషయం, కొన్ని రాష్ట్రాల్లో మితిమీరిన జోక్యంతో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, ప్రతిపక్షాల అణచివేత, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు, విమర్శలు స్వీకరించే స్థితిలో లేకపోవడం తదితర అంశాలతో కేంద్ర ప్రభుత్వం అప్రతిష్టతను మూటగట్టుకుంది. న్యాయ వ్యవస్థలో జోక్యం, ఎన్నికల కమిషన్‌ని ను సైతం ఏకపక్షంగా నియమించుకునే ప్రయత్నాలు ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి.
ఓటర్ల నిర్లిప్తత.. ప్రమాదం!
ఎవరు గెలిచినా తమకు చేకూరే ప్రయోజనం శూన్యం, తమ బతుకులు మారవు అనే నిర్లిప్తతతో ఓటర్లు ఉన్నారు. దీంతో ఓటు హక్కు అమ్ముకోవడానికి ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. ఓటు అమ్మకపు వస్తువుగా మారడంతో ప్రజాస్వామ్యానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్యం ఇంకా పరిణితి చెందాలి. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోవడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతారు తప్ప న్యాయస్థానాలు, ఎన్నికల కమిషన్ కాపాడలేవు. ప్రజల్లో మార్పు వస్తేనే రాజకీయ పార్టీల ఆలోచనా రీతుల్లో మార్పులు వస్తాయి. మానవ పురోగతికి ప్రజాస్వామ్యం అత్యంత కీలకమైంది. దాని విలువ తెలుసుకుని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై తమ విజ్ఞతను ప్రదర్శించాలి.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్
99497 77727