ఇంకెన్నాళ్ళు ఈ 'వివక్షా రాగం '!

by Ravi |   ( Updated:2024-10-01 01:15:20.0  )
ఇంకెన్నాళ్ళు ఈ వివక్షా రాగం !
X

'నీళ్లు-నిధులు-నియామకాల 'మీద ఆంధ్రవారి పెత్తనం సాగుతోందని, తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతున్నారనే ప్రచారంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆ ఉద్యమానికి సారధ్యం వహించిన వ్యక్తులు, శక్తులు స్వరాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలొస్తాయని, పల్లెలు సశ్యశ్యామలమవుతాయని, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అందరూ అభివృధ్ధి చెందుతారని ప్రజలను నమ్మించారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారంతా రాజకీయ ఊసరవెల్లులు, పాతకాపులే! అటువంటి వారిని ప్రజలు నమ్మడానికి ప్రధాన కారణం వాళ్ల పల్లకీ మోసిన వామపక్ష, విప్లవ పార్టీలు, మేధావులనే చెప్పుకోవాలి.

పదేళ్ల పాలన అనంతరం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్ ఏదోలా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి తిరిగి ప్రజలలో కోల్పోయిన పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉంది. దానిలో భాగంగానే తాజాగా ' తెలంగాణ రచయితలు వివక్షకు గురవుతున్నారనే'వాదన ముందుకు తెచ్చినట్టుగా అనుమానం కలుగుతోంది.

స్వరాష్ట్ర సాధనే పరిష్కారమని..

నిజాం రాచరికం కాలం నుండి తెలంగాణ ప్రజలతో మమేకమై, ఎన్నో నిర్బంధాలు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ, ప్రాణ త్యాగాలతో పల్లెపల్లెలో కమ్యూనిస్టులు విశ్వసనీయత పొందారు. వారి వారసులుగా నక్సలైట్లుగా పిలువబడే యంయల్ పార్టీలు అదే సంప్రదాయాన్ని, విశ్వసనీయతను కొనసాగించాయి. కమ్యూనిస్టులు సృష్టించిన ప్రజాసాహిత్యం, సాంస్కృతిక కళారూపాలు ఎంతో ఆదరణకు నోచుకున్నాయి. అటువంటి కమ్యూనిస్టు/నక్సలైట్ పార్టీలు (ఒకటి రెండు మినహాయించి) ఈ స్వరాష్ట్ర సాధననే అన్ని సమస్యల పరిష్కారానికి మార్గమని పిలుపునివ్వడంతో ఆనాటి రాజకీయ నాయకత్వానికి ప్రజలలో దూసుకు పోవడానికి దారి దొరికింది! ఇహ కమ్యూనిస్టులు తమ పార్టీ పంధా ప్రచారానికి నిర్దేశించబడిన సాహితీ సాంస్కృతిక కళారూపాలన్నింటినీ దొరల ఎజెండాకు తాకట్టు పెట్టారు. ఫలితంగా పెద్దఎత్తున ప్రజాఉద్యమం చెలరేగింది. యువకులు, విద్యార్థులు నిర్బంధాలనెదిరించి పోరాడారు. ప్రాణ త్యాగాలు చేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

రచయితల్నీ, కళాకారుల్నీ టోకున కొనేశారు!

ప్రజల పోరాటాలు, త్యాగాల మీద అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా దోపిడీ పాలన కొనసాగిస్తూ తన పాలకవర్గ స్వభావాన్ని బైటపెట్టుకుంది. అది అధికారంలోకి రావడానికి తోడ్ప డిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన కమ్యూనిస్టు/యం-యల్ నాయకుల్లో కొందరిని తనవైపు తిప్పుకుని వాళ్లకు పదవులు కట్టబెట్టి లోబరుచుకుంది. ఎన్నో దశాబ్దాల కృషితో ఏర్పర్చుకున్న వామపక్ష సాహితీ, సాంస్కృతిక కళారూపాలను, కళాకారులను హైజాక్ చేసి తన దర్బార్‌లో వందిమాగధులుగా, తన పార్టీ /ప్రభుత్వ సాంస్కృతిక సైన్యంగా మార్చుకుంది. మరోవైపు గత ప్రభుత్వాల ఒరవడిలోనే తీవ్ర నిర్బంధాన్ని, కేసుల పరంపరను, ఎన్‌కౌంటర్లను అమలుచేసి విప్లవోద్యమాలను అణచివేసింది. అప్పటికి గాని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఒళ్ళుమరచి బలపరిచిన విప్లవ శక్తులకు కళ్ళు తెరుచుకో లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

పదేళ్ల మౌనం తర్వాత వివక్ష గుర్తొస్తోందా?

పదేళ్ల పాలన అనంతరం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్ ఏదోలా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి తిరిగి ప్రజలలో కోల్పోయిన పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ' తెలంగాణ రచయితలు వివక్షకు గురవుతున్నారనే' వాదన ముందుకు తెచ్చినట్టుగా అనుమానం కలుగుతోంది. తెలుగు భాష పేరిట ఆంధ్ర రచయితలు ఆధిపత్యం చలాయిస్తున్నారని, వాళ్ళ సభలు, ప్రచురణలు, కార్యకలాపాలలో తెలంగాణ వారిపట్ల వివక్ష చూపుతున్నారని ఇటీవల ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులలో తెలంగాణ రచయితలకు దక్కింది తక్కువేనని ఎత్తి చూపారు. ఇక నుండి ఆంధ్ర వాళ్ళ సభలు ఆంధ్రలోనే జరుపుకోవాలని, తెలుగు భాష ముసుగులో ఆధిపత్యం చలాయిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

రాజకీయ నిరుద్యోగుల కొత్త నాటకం

ఒక కుల, అస్తిత్వ వాది అయిన రచయిత పేరున వచ్చిన 'మీది మీదే మాది మాదే 'అనే ఆ ప్రకటన మీద తెలంగాణ రచయితలు కొందరు సంతకాలు చేశారు. వారిలో బీఆర్ఎస్ పాలనలో అధికార పదవులనుభవించి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారిన రచయితలే ముందు వరసన ఉండడంతో ఆ అనుమానం మరింత బలపడుతోంది. వారితో పాటు, రకరకాల వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళున్నారు. ఇదంతా కూడా ఆరిపోయిన తెలంగాణ కుంపటిని మళ్ళీ రగల్చాలనే ప్రయత్నంగా కనబడుతోంది. అంతేకాదు, అధికారం కోల్పోయిన దొరలకు తిరిగి విశ్వసనీయత ఆపాదించేందుకు, కవులు, కళాకారులను పోగేసే కార్యక్రమం లాగుంది. ఈ ప్రకటనలో తెలుగు ప్రజల మధ్య వైషమ్యం పెంచేలా, రెచ్చ గొట్టే వ్యాఖ్యలున్నాయి. ఈ ప్రకటన సంతకాలలో సమై క్య రాష్ట్రాన్ని బలపరచిన సీపీఎం అనుయాయ 'సాహి తి' సంఘ రాష్ట్ర నాయకులుండడం ఆశ్చర్యకరం!

వీరే ఫత్వాలు జారీ చేస్తే ఎలా?

ఆంధ్ర ప్రాంత రచయితలు తమకు నచ్చిన పేరుతో దేశంలో ఎక్కడైనా సభలు పెట్టుకునే హక్కు వుంది. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, వాక్ స్వాతంత్య్రంలో భాగం. 'రాజ్యాంగాన్ని రక్షించాలని 'నినదించే రచయితలు దానికి వ్యతిరేకంగా ఫత్వాలు జారీచేయడమేమిటి!? తమ డిమాండ్లు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధించుకోవాలి తప్ప సాటి రచయితల మీద విరుచుకుపడడమేమిటి!? స్వరాష్ట్రం వచ్చినా ఇంకా వివక్షకు గురవుతున్నామంటే దానికి పదేళ్ళు పాలించిన తమ రాజకీయ నాయకత్వానిదే బాధ్యత తప్ప, పరాయి రాష్ట్రం వారెలా అవుతారు!?అందులోను పదేళ్ల పాటు ముఖ్యమంత్రి చెవిదగ్గరే వున్న రచయితకు ఆ రోజుల్లో ఈ వివక్ష గుర్తుకు రాలేదా!? మరొకాయన సాహిత్య అకాడమి ఛైర్మన్‌గా పనిచేస్తూ సైలెంటుగా బతికేశాడు. వాళ్ల పార్టీ ఓడిపోగానే తెలంగాణ సోయి కలిగిందా!? పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి, మాట్లాడలేదనడం, ఒక కుంటి సాకు మాత్రమే!

ఈ కొత్త రాగానికి తాళం వేయొద్దు!

గతంలో ప్రభుత్వమిచ్చే ఎటువంటి అవార్డులను స్వీకరించరాదని, సినిమాలకు రాయరాదనే నైతిక కట్టుబాటు ప్రజా రచయితలు పాటించేవారు. అక్కడనుండి అవార్డుల కోసం సాటి రచయితలతో గొడవపడే స్ధితికి దిగజారామా!? ప్రగతిశీల రచయితల మీద మతోన్మాదుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ ఐక్యం చేసి తిప్పికొట్టాల్సిన కాలంలో, ఇలాంటి వాదనలతో చీలికలు పెంచడం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది!? తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు ఎవరూ ఈ కొత్త రాగానికి తాళం వేసి, అనవసర విద్వేషాలకు గురికాకుండా, బలికాకుండా జాగ్రత్త పడాలి. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు వారిగా కలసే వుందామనే నినాదానికే కట్టుబడి వుండాలి. తమ కలాలు, గళాలను ప్రజలకు పునరంకితం చేసే లక్ష్యంతో ఐక్యం కావాలి.

జనార్ధన్. యస్

[email protected]

Advertisement

Next Story

Most Viewed