ప్రభుత్వాలు సరే.. ప్రజల మాటేంటి?

by Ravi |   ( Updated:2024-01-13 00:45:08.0  )
ప్రభుత్వాలు సరే.. ప్రజల మాటేంటి?
X

ఇటీవల భారత ప్రధాని లక్షద్వీప్ పర్యటన సందర్భంగా మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ వ్యాఖ్యలు మాల్దీవుల టూరిజంపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సోషల్ మీడియా ప్రేలాపనలను పక్కనపెట్టి పరస్పర సంబంధాల పట్ల బాధ్యతగా వ్యవహరించడం మాల్దీవులకే కాదు, భారత్‌కి కూడా అవసరమే.

భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు..

భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్ష దీవుల్లో పర్యటించి అక్కడి సముద్రం ఒడ్డున సేదతీరుతున్న ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై స్పందించిన ముగ్గురు మాల్దీవుల మంత్రులు మరియం షియునా, అబ్దల్లా ముజూం మజీద్, మల్షా షరీఫ్ 'మాల్దీవులకు లక్షదీవులకు పోలికేంటి?' అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారత్‌ను అపరిశుభ్ర దేశంగా అభివర్ణిస్తూ, మోడీని జోకర్, తోలుబొమ్మ అని సంబోధిస్తూ ట్వీట్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో బాయికాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మొదటికే నష్టం వస్తుందని గ్రహించిన ఆ దేశ అధ్యక్షుడు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాడు. వెంటనే ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశాడు. వారి వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

ఆది నుంచీ అండగా భారత్..

మాల్దీవులు స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి భారత్ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంది. కేవలం 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ద్వీప దేశానికి పొరుగునే ఉన్న అత్యంత సమీప దేశం భారత్ మాత్రమే. దీంతో ఆ దేశానికి రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ సాయం చేస్తూనే ఉంది. కరోనా సమయంలోనూ కోవిడ్ వ్యాక్సిన్లను ఎగుమతి చేసి పెద్ద మనసు చాటుకుంది. అంతేందుకు ఆ దేశ రక్షణ బలగాలకు 70 శాతం అవసరాలను భారత్ తీరుస్తోంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ కేవలం టూరిజంపైనే ఆధారపడి ఉంది. 2023లో ఏకంగా 2 లక్షల పైగా భారతీయులు మాల్దీవులను సందర్శించారు. 2014 నుంచి నేటి వరకు భారత్, మాల్దీవుల వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. 2020 నుంచి రెండు దేశాల మధ్య కార్గో నౌక సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో వాణిజ్య బంధం మరింత మెరుగైంది.

ప్రజల వ్యథల మాటేంటి?

ముందు నుంచి అండగా నిలుస్తున్న భారత్‌ను కాదని మాల్దీవుల ప్రభుత్వం ప్రస్తుతం చైనా అనుకూల వైఖరి అవలంబిస్తోందన్నది నిజం. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారు. కానీ, ఏ దేశంతో తాము సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలనేది ఆ దేశం హక్కు. చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవులతో సరైన సంబంధాలను నెలకొల్పుకోవలసిన బాధ్యత భారత్ పైనే ఉంటుంది. ప్రభుత్వాలు పరస్పరం ఘర్షించడం, సత్సంబంధాలు నెలకొల్పుకోవడం సహజ క్రియ. కానీ ప్రజల మధ్య సంబంధాలు సమతుల్యంగా ఉండాలి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రెచ్చగొట్టు ప్రకటనలు చేయడం, సోషల్ మీడియాలో ఆవేశ ప్రకటనలతో ఊగిపోవడం, చీటికీ మాటికీ మాల్దీవులకు పరిగెత్తుతూ, అందాలు ఆరబోస్తూ, షూటింగులు జరుపుకునే సెలబ్రిటీలు కూడా సంయమనం కోల్పోయి మాల్దీవులపై వ్యతిరేక ప్రకటనల్లో మునిగిపోవడం దేశ ప్రయోజనాలకే ప్రమాదకరం. పైగా మాల్దీవులకు రాకపోకలతో సహా అన్నీ రద్దు చేసుకోవాలని చెబుతున్నవారు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక తదితర సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దేశాల మధ్య సంబంధాలను ఆయా ప్రభుత్వాలు చూసుకుంటాయి కానీ ప్రజల స్థాయిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం సబబైన చర్య కాదు. దేశాల మధ్య సంబంధాల విషయంలో బాధ్యతగా వ్యవహరించడం మాల్దీవుల ప్రభుత్వానికి ఎంత అవసరమో, ఆ దేశంతో దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ సంబంధాలను దృఢపర్చుకోవడం భారత్‌కీ అంతే అవసరమని చెప్పాలి. ప్రజల ఆగ్రహావేశాలను బ్యాలెన్స్ చేయడం ప్రధానంగా ప్రభుత్వ బాధ్యతే. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సరైన చర్య చేపట్టకపోవడం గమనార్హం. దేశ భవిష్యత్ ప్రయోజనాలకు ఇది భంగకరమని గుర్తించాలి.

కాసాని కుమారస్వామి

96762 18427

Advertisement

Next Story

Most Viewed