- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్తీ ఫుడ్‌తో జనరేషన్లకు జబ్బు!
ఈ రోజుల్లో ఆరోగ్యంగా బతకడం గగనమైపోయింది. ఏ మద్యపానం, ధూమపానం, గుట్కా అలవాట్లు వంటి దురలవాట్లు లేనివారు సైతం ప్రమాదకర రోగాల బారిన పడుతూ అతి తక్కువ వయస్సులోనే తనువు చాలిస్తున్నారు. ఇదివరకు 70-80 ఏళ్ల వయసుగల వారికి వచ్చే గుండె జబ్బులు ఇప్పడు టీనేజ్ యువకుల నుండి, నడి వయసు వ్యక్తులకు వచ్చి మరణిస్తున్నారు. ఇక బీపీ, షుగర్ వ్యాధులకైతే వయసుతో సంబంధం లేకుండా పోయింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగిపోయింది. వీటన్నిటికి ప్రధాన కారణం కల్తీ ఆహారం. పిల్లలు తినే చాకోలేట్, ఐస్ క్రీమ్‌లతో పాటు.. అందరూ తాగే పాలు, పెరుగు, నీరు ఒక్కటేమిటి అన్ని ఆహార పదార్థాలు, పానీయాలు కల్తీమయమైపోయాయి. నకిలీ ఆహార పదార్థాలతో తరాలకు తరాలు జబ్బుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.
మనం రోజూ ఎంతో ఇష్టంగా త్రాగే ఇరానీ ఛాయ్.. ఎంతో చిక్కగా కనిపిస్తూ.. రుచిగా ఉంటుంది. అయితే.. దీని తయారీలో కొందరు హోటళ్ల యజమానులు జంతువుల కళేబరాల నుండి సేకరించిన ఎముకల పొడిని వినియోగిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక శాతం టీ దుకాణాదారులు బల్క్‌గా, లూజ్‌గా లభించే ఏ బ్రాండ్‌కూ సంబంధం లేని టీ పొడినే వినియోగిస్తుంటారు. అయితే ఇలాంటి కొన్ని టీ పొడుల్లో హానికరమైన రంగులు కలుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
కుక్క మాంసంతో బిర్యానీ
ఇక ఏదేని వంటకం కోసం ఒకసారి మరిగించిన ఏ నూనెనైనా మరోసారి వినియోగించకూడదు. అయితే, మనం తరచుగా తినే బజ్జీలు, ఇతర తినుబండారాల తయారీల్లోనూ కల్తీ నూనె వినియోగం జరుగుతోందని చెప్పవచ్చు. హైదరాబాద్‌లోని ఓ ప్రఖ్యాతిగాంచిన బిర్యాని హోటల్లో మటన్‌కు బదులుగా కుక్క మాంసంతో బిర్యానీ తయారు చేసి వినియోగదారులకు పెట్టిన ఘటన మీడియా సాక్షిగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడి తినే మరో వీధి తినుబండారం పానీ పూరి. దీన్ని అందించేవారు పానీ పూరీలో కలిపే నీటిలో మూత్రం కలుపుతున్న వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఎండాకాలంలో అందుబాటులోకి వచ్చే పుచ్చకాయకు ఇంజక్షన్ ద్వారా కృత్రిమ కెమికల్ రంగు, చక్కెర రుచిని అందించి అమ్ముతున్నారు కొందరు వ్యాపారులు. పిల్లలు, అమ్మాయిలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీములు కెమికల్ మాయమైపోయాయి.
ఎముకలను పెళుసు చేసే కల్తీ నీరు
ప్రస్తుత సమాజంలో మినరల్ వాటర్ ప్రతి ఇంట్లో నిత్యకృత్యమైపోయింది. ఇప్పుడు పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని కుటుంబాలు మినరల్ వాటర్ వినియోగిస్తున్నాయి. దీంతో, మినరల్ వాటర్ తయారు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. అత్యధిక మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులు నిపుణులను నియమించుకోకుండా ఇష్టారీతిన మినరల్ వాటర్లో మోతాదుకు మించి కెమికల్స్ కలుపుతున్నారు. ఇలాంటి కల్తీ నీటి వినియోగం మూలంగా ఎముకలు పెలుసుబారి, కండరాల పటుత్వం పోతుందని నిపుణులు తెలుపుతున్నారు.
తరాల భవిష్యత్తును కాలరాస్తూ...
ఫలానావాడు సిగరెట్ తాగుతాడు, లేదా మద్యం సేవిస్తాడు, లేదా గుట్కా పాన్ పరాగ్‌లు నములుతాడు కనుక ఫలానా జబ్బుతో చనిపోయాడని అనుకోవడం ప్రస్తుత జనరేషన్‌లో మూర్ఖత్వం అని తేలిపోయింది. ఈ రోజుల్లో ఏ దురలవాటు లేనప్పటికీ తినే ఆహార పదార్థాలు, తాగే పానీయాలతోనే పసితనం, యవ్వనం, నడివయస్సు, ముసలితనం అనే తేడా లేకుండా మనుషులు వివిధ జబ్బుల బారిన పడుతున్నారు. అతి తక్కువ వయసులోనే మృత్యువాత పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ జనరేషన్ల సగటు గరిష్ట ఆయుర్దాయాన్ని 40 ఏళ్ల కంటే ఎక్కువగా అంచనా వేయలేం. రేపటి తరాలను కల్తీ ఫుడ్ బారి నుండి రక్షించుకోలేక మనమే వారి భవిష్యత్‌ను కాలరాస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
డ్రగ్స్ కంటే ప్రమాదకారి
ఈ దేశానికి, రాష్ట్రానికి అతి భయంకరమైన ప్రమాదం డ్రగ్స్ కాదు.. అంతకంటే అతి భయంకరమైన విపత్తు కల్తీ ఆహార పానీయాలు. ఎందుకంటే, డ్రగ్స్ కొని వినియోగించేవారు కొంత శాతమే.. కానీ కల్తీ ఆహారం, పానీయాలు వినియోగించేవారు ఇంచుమించు దేశ ప్రజలందరూ.. కాబట్టి దేశ, రాష్ట్ర పాలకులు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్య పరిరక్షణకు నడుం బిగించాలి. ప్రభుత్వంలోని సంబంధిత యంత్రాంగాన్ని పటిష్టపరిచి కల్తీ ఆహార పానీయాలను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలి. లేదంటే ముందు తరాల భవిష్యత్ చీకటిమయమైపోయి, దేశం, రాష్ట్రాలు రోగ పీడితంగా మారిపోతాయని అంచనా వేయవచ్చు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీ ఆహార పదార్థాలను నిషేధించాయి. మన తెలుగు ప్రభుత్వాలు సైతం ఓట్లను రాల్చే ఫ్రీ పథకాలపై పెట్టిన శ్రద్ధలో కాస్తయినా ప్రజారోగ్య పరిరక్షణకు చొరవ చూపండి.
శ్రీనివాస్ గుండోజు
99851 88429
- Tags
- adulterated food