దళిత రత్నం బాబు జగ్జీవన్

by Ravi |   ( Updated:2023-04-05 00:15:34.0  )
దళిత రత్నం బాబు జగ్జీవన్
X

భారతదేశంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రోద్యమం, కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమ ముద్దుబిడ్డ డాక్టర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన జగ్జీవన్‌రామ్‌ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఆయనను స్మరించుకోవడమంటే దేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమ ప్రాంగణాన జరిగిన, ఉప్పొంగిన సమున్నత ఘట్టాలు గుర్తు చేసుకోవడమే. జగ్జీవన్‌రామ్‌ మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేవ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహా బలాన్ని చేకూర్చిపెట్టాయి. భారత రిపబ్లిక్‌ తొలి లోక్‌సభ 1952లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్‌ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచారు. ముప్ఫై మూడు సంవత్సరాలు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించాడు. మొదటి శ్రేణి పార్లమెంటేరియన్‌గా నిలిచాడు. హేతుబుద్ధి, సానుకూల దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధాశక్తి, స్థిరమైన, శాసనబలం, నిత్యకృషీతత్వం, ఓరిమి, కారుణ్యం, చర్చించే గుణం, ఒప్పించే గుణం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవానిరతి, కార్యనిర్వహణాదక్షత మొదలగు గుణాగణల నిండుదనంతో బలమైన సుగుణశీల వ్యక్తిత్వం, తనకి తాను నిర్మించుకున్న భారతదేశ ‘అమ్యూల్య రత్నం’ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌.

1908 ఏప్రిల్‌ ఐదవ తేదీన జగ్జీవన్‌రామ్‌ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు బసంతీదేవి, శోభీరామ్‌. ఆయనది సామాన్య కుటుంబం. చర్మకార కులం. చిన్ననాటే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్లమధ్య తల్లి బసంతీదేవి సంరక్షణలో జగ్జీవన్‌రామ్‌ తన చదువు కొనసాగించాడు. రాత్రింబవళ్ళు పట్టుదలతో చదివి, ఇంగ్లీషు భాషపై మంచి పట్టు సంపాదించి అణగారిన కులాల విద్యార్థుకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను తీసుకోవడానికి నిరాకరించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను పొందాడు. జగ్జీవన్‌రామ్‌ చిన్ననాటే భోజ్‌పురితోపాటు హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. 1922లో ఆర్రా టౌన్‌ స్కూల్‌లో ఉన్న సమయంలో ఈయన ముట్టుకున్న కుండలోని నీరు తాగడానికి కొందరు ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించడంతో హరిజన్ పేరుమీద ఉన్న ప్రతి కుండను పగలగొట్టాడు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్ అందరికీ ఒక్కటే కుండ ఏర్పాటు చేశాడు. తాను ఎదుర్కొన్న ఈ వివక్షాపూరిత విధానాలకు తీవ్ర ఆవేదన, ఆగ్రహం మనసులో రగిలింది జగ్జీవన్‌రామ్‌లో. 1925లో ఒక సభలో పాల్గొన్న పండిత మదన్‌మోహన్‌ మాలవ్య బనారస్‌ హిందూ విశ్వవిద్యాయంలో చదువుకోవటానికి రావల్సిందిగా జగ్జీవన్‌రామ్‌ని ఆహ్వానించాడు. దీంలో బీహెచ్‌యూలో చేరి ఇంటర్‌ పాసయ్యారు. ఆ తర్వాత, కలకత్తాలో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతో పాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశాడు. అప్పటికే కులరహిత, వర్గరహిత భావజాలం కలిగిన జగ్జీవన్‌రామ్‌పై ఇది ఎంతగానో ప్రభావం చూపింది. బ్రిటిష్‌ వలసవాద సంకెళ్ళుతెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్‌రామ్‌ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నాడు.

1934లో జగ్జీవన్‌రామ్‌ కలకత్తాలో సాంఘిక సంస్కరణ కోసం, వ్యవసాయ కార్మిక మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌లీగ్‌ మొదలైన సంఘంను స్థాపించాడు. షెడ్యూల్డు కులాల నాయకులను ఐక్యం చేసి, ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించాడు. బీహార్‌లో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టాడు. తన బృందంతో అహోరాత్రులు శ్రమించి ఆహారం, బట్టలు, ఔషధాలు, మంచినీరు, ఆశ్రయం మొదలగు సౌకర్యాలు బాధితులకు అందే విధంగా సహాయ శిబిరాలు జగ్జీవన్‌రామ్‌ నిర్వహించాడు. ఈ సందర్భంలోనే మొదటిసారి గాంధీని జగ్జీవన్‌రామ్‌ కలుసుకోవడం తటస్థించింది. అలాగే భారత రక్షణ శాఖ మంత్రిగా, పోస్టల్, రైల్వే, సమాచార, భారత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఈ దేశంలో ఆయా రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన రాజకీయ దార్శనికుడు. జగ్జీవన్ రాం తన 30 ఏళ్ల రాజకీయ కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అణగారిన, బడుగు, బలహీన వర్గాల కోసం అవకాశాలు కల్పించిన రాజకీయ సేవకుడు...నిస్వార్ధ రాజకీయ సేవకు ఆయన పరిపాలన విధానం ఎప్పటికీ ఆదర్శం. తనవారికి ఏదైనా చేయాలి అనే ఆరాటంతో సాగిన ఆయన స్ఫూర్తితో నేటితరం నాయకులు సాగాల్సిన అవసరం ఉంది. ఈ దేశం, ఈ ప్రజా బాబూజీ సేవను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సామాజిక, రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ, ఎల్లప్పటికీ స్ఫూర్తి దాత. ఆదర్శనీయుడు. అణగారిన సమూహా మహానాయకుడు, నిజమైన భారత అమూల్య ‘రత్న’ డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌.

సంపత్ గడ్డం

7893303516

Advertisement

Next Story

Most Viewed