ఫ్యూచర్‌ సిటీ సాకారానికి..

by Ravi |   ( Updated:2024-08-14 00:30:31.0  )
ఫ్యూచర్‌ సిటీ సాకారానికి..
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. 19 కంపెనీలతో సంప్రదింపులు జరిపి రూ.31,532 కోట్ల పెట్టుబడులు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు ఒప్పందాలు విజయవంతంగా ముగిశాయి. త్వరలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ఫ్యూచర్‌ సిటీ రూపుదిద్దుకోబోతోందని, ఈ సిటీలో ప్రవాసుల పెట్టుబడుల ఆవశ్యకత ఎంతో ఉందని సీఎం తెలిపారు.

అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు అమెరికాలో భారీ స్పందన లభించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో ప్రపంచంలోనే పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31,532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి.

తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా..

ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలురాయిగా నిలిచింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించడం తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలి రావటం శుభసూచకం. రాష్ట్రానికి ఫార్మా గ్లాస్‌ ట్యూబ్‌ల తయారీ కేంద్రం రానుంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందంపై ప్రాథమిక చర్చలు జరిగాయి.. కాగ్నిజెంట్ కొత్త సెంటర్‌లో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటీ సేవల విస్తరించటానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత..

ఇంజెక్షన్ల తయారీ సంస్థకు ఒప్పందం కోసం ప్రముఖ ఫార్మా కంపెనీ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా రూ. 400 కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఆర్అండ్ డీ కేంద్రం నిర్వహిస్తున్న వివింట్ ఫార్మా అక్కడే ఐదున్నర ఎకరాల్లో ఇంజక్షన్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లైఫ్‌ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇది దోహదం కాగలదు. అలాగే నగరంలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమ్జేన్ సంస్థ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల్లో అంతర్జాతీయ బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్(AMGEN) ఏర్పాటు చేయనున్న ఈ కొత్త సెంటర్‌లో సుమారు 3వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ఆర్థిక మాంద్యం అన్న సంకేతాలు ఇస్తున్నా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి.

టైర్-2 ప్రాంతాలకు విస్తరణ..

అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వీ-హబ్‌లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. రాబోయే ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల (రూ.839 కోట్ల) పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడుపోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకం. పెట్టుబడులంటే హైదరాబాద్ ఒక్కటే కాదని ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌ నగర్, నల్గొండ లాంటి టైర్- 2 ప్రాంతాలను కూడా వారు ఎంచుకోవడం వల్ల ఆ ప్రాంత ఆభివృద్ధితో పాటు అక్కడ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యత కల్పించడం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మందుకు సాగుతోంది.

-వి. సుధాకర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed