తొలిసారిగా... ఒక్కచోట కలిసిన చందమామలు

by Ravi |   ( Updated:2023-10-05 03:52:05.0  )
తొలిసారిగా... ఒక్కచోట కలిసిన చందమామలు
X

గత 50 ఏళ్లుగా చందమామలో కథలు రాస్తున్న రచయితలు అందరూ కూడా తమ సాటి రచయితలు రాసినటువంటి కథలు చదువుతూ ఉన్నారే కానీ ఎన్నడు కూడా ఆ రచయితలు అందరూ ఒకచోట కలుసుకోవడం కానీ, అలా కలుసుకోవాలని ఆలోచన రావడం గానీ ఇంతవరకు జరగలేదు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ ముఖాముఖి ఎదురుపడి ముచ్చటించింది లేదు. ఆ తరుణం ఇప్పుడు వచ్చింది. వాళ్ళందరూ కూడా చందమామ రచయితలే. ఒకరికొకరు నామ పరిచయం తప్ప ముఖపరిచయం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక రాష్ట్రేతరంలో ఉన్న రచయితలందరూ కూడా హైదరాబాదు వేదికగా ఒకరోజు కలుసుకుందాం అని అనుకున్నారు. ఇంతలో చందమామ మీద పరిశోధన చేసి పరిశోధనా వ్యాసం సమర్పించిన చందమామ రచయిత డాక్టర్ దాసరి వెంకటరమణకు డాక్టరేట్ పట్టా రావడంతో ఆ సందర్భంగా అందరూ 2023 అక్టోబర్ 1 ఆదివారం రోజు హైదరాబాదులో ఆయన నివాసంలోనే సమావేశం అయ్యారు.

వీరే చందమామ జ్ఞాపకాలు!

మొదట్లో తమ సాహితీ ప్రస్థానాన్ని చందమామలోనే మొదలు పెట్టి, అనంతర కాలంలో తెలుగు నవలా సాహిత్యాన్ని విశిష్ట స్థానం పొందిన యండమూరి వీరేంద్ర నాథ్, ‘వసుంధర’ కలం పేరు కలిగిన జొన్నలగడ్డ రాజగోపాల రావు జొన్నలగడ్డ రామలక్ష్మి, జొన్నలగడ్డ రత్న కలం పేరు కలిగిన నారాయణమూర్తి, ‘రాంబాబు’ కలం పేరు కలిగిన జొన్నలగడ్డ వెంకట రామారావు, జొన్నలగడ్డ మార్కండేయులు, మాచిరాజు కామేశ్వరరావు, డా.దాసరి వెంకటరమణ, ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి, ఎంవివి సత్యనారాయణ, ఎన్. శివనాగేశ్వరరావు, కోనె నాగ వెంకట ఆంజనేయులు, లక్ష్మీ గాయత్రి, నందిరాజు పద్మలత జయరాం, ‘వాణిశ్రీ’ కలం పేరు కలిగిన సిహెచ్ శివరామ ప్రసాద్, రామవరపు గణేశ్వరరావు మొదలైన రచయితలంతా ఒకచోట చేరి తమ కథల గురించి తమ అనుభవాల గురించి తమ ప్రస్థానం గురించి తమ ప్రశస్థి గురించి ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. చందమామ రచయితల ఆత్మీయ సమావేశానికి హాజరు కావలసిన సుప్రసిద్ద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి, గంగిశెట్టి శివకుమార్, మల్లవరపు మనోహర్ రెడ్డి, ఆరుపల్లి గోవిందరాజులు, బూర్లె నాగేశ్వరరావు, గవ్వల నిర్మలాదేవి, అంగేరి బాలసుబ్రహ్మణ్యం గార్లు ఆరోగ్యం తదితర కారణాల వల్ల చివరి క్షణంలో రాలేకపోతున్నట్లు బాధపడుతూనే చెప్పారు.

చందమామ చరిత్రలోనే కాదు ఒక పత్రికలో రచనలను అందించినటువంటి రచయితలందరూ దాదాపు 15 మంది ఒకచోట కూడి చందమామ పత్రికతో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను కలబోసుకోవడం అనేది చాలా చాలా అరుదైనటువంటి విషయం. తెలుగు పిల్లల్ని కాకుండా, యావత్ భారతీయులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలని ప్రభావితం చేసి తమ అభిమానులుగా మార్చుకున్నటువంటి ఘనత చందమామ పత్రికది. ఇప్పటికీ కూడా బాల్యాన్ని నెమరేసుకున్న ప్రతి తెలుగువాడు, చందమామ చదివిన ప్రతి భారతీయుడు చందమామను ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు అనేది అతిశయోక్తి కాదు. 1947 జులై లో మొదలైన చందమామ 2013 అక్టోబర్ లో చివరి సంచికతో ఆగిపోయింది. ఇప్పుడు చందమామ లేదు. కానీ చందమామలో రచనలు చేసిన రచయితలున్నారు. వారిలో చందమామ జ్ఞాపకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను ఒకసారి కదల్చి పరస్పరం పంచుకోవడానికి ఈ సమావేశం. ఇది ఒక అరుదైన అపురూపమైన, అపూర్వమైన ఆత్మీయ కలయిక.

ఫలించిన 3 నెలల నాటి ప్రయత్నం

చందమామ రచయితలందరూ కలుసుకోవాలనే ఆశయంతోనే వాట్సాప్ లో ఒక గ్రూపు తయారుచేసి, ఒక్కో రచయితను వెతుకుతూ నంబరు సంపాదించి, గుంపులో చేర్చుతూ పోతే మొత్తం 22 మంది రచయితలను ఒక్కచోట చేర్చడం జరిగింది. తేదీ నిర్ణయం విషయంలో కప్పల తక్కెడ తంతు జరిగింది. ఇది పని కాదని, దాదాపు మూడు నెలలు అడ్వాన్సుగా అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అని నిర్ణయించడం జరిగింది. ఇద్దరు తప్ప అందరూ అరవై నుండి ఎనభై మధ్య వయసు వారే. ముదిమి పైన బడినప్పటికీ, ఒకరిద్దరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఎలాగోలా రావడానికి ఆసక్తి, ఉత్సాహం కనపరిచారు.

అక్టోబర్ ఒకటో తేదీ ఆదివారం హైదరాబాదులోని డా. దాసరి వెంకటరమణగారి నివాసంలో ఉదయం తొమ్మిది గంటలకు పది నిమిషాలు అటూ ఇటుగా అందరూ వచ్చేశారు. వాళ్ళందరూ దాదాపు 1969 ప్రాంతం నుండి చందమామలో కథలు రాసిన రచయితలు. ఒకరి గురించి మరొకరికి పరోక్షంగా తెలుసు తప్ప ప్రత్యక్షంగా చూడటం (ఒకరిద్దరిని మినహాయిస్తే) అదే మొదలు. వాళ్ళు ఒకరినొకరు మొదట చూసుకున్నప్పుడు వాళ్ళ మొహాల్లో మెరిసిన మెరుపులు ఏ కొలతలకూ అందనివీ, విరిసిన చిరునవ్వుల పువ్వులు ఎన్నటికీ వాడనివి. వాళ్ళ కబుర్లకు అంతే లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఇన్నేళ్ళు దాచిపెట్టుకున్న తలపులు ఒక్కసారిగా మది తలుపులు తోసుకొని బయటకు వస్తూంటే ఉక్కిరి బిక్కిరై అనుభవించిన ఆనందం అలౌకికం, అనుభవైకవేద్యం.

మంచినే పంచుకున్న చందమామలు

వాళ్ళ కబుర్లు వాళ్ళ కథలతో ఆగిపోలేదు. చందమామ సంస్థాపకులు నాగిరెడ్డి చక్రపాణి గురించి, చందమామ స్తంభాలైన సంపాదకవర్గం లోని, కొడవటిగంటి కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం, విశ్వం గురించి, చిత్రకారులైన చిత్రా, శంకర్, వడ్డది పాపయ్య, గురించి కూడా ఎన్నో జ్ఞాపకాలు.. ఒక్క క్షణం కాలం వెనక్కు తిరిగి చందమామ స్వర్ణయుగానికి వెళ్ళిందా అనిపించింది. సమావేశమైన రచయితలూ ఇతర రచయితలలోని మంచిని ఎంచి పంచుకోవడం అబ్బుర పరచింది, దాదాపు ఇరవై కలం పేర్లతో పుంఖానుపుంఖాలుగా కథలు రాసిన కథా సవ్యసాచి పాలంకి వెంకట రామచంద్రమూర్తి, ఇంద్రజాల కథల సర్కార్, రాసిన మొదటి కథ, చివరి కథా చందమామకే రచించి, జీవితాన్ని ముగించిన అవసరాల రామక్రిష్ణరావు, కలువకొలను సదానంద, విలక్షణ కథలు రాసిన కోలార్ కృష్ణా అయ్యర్, యజ్ఞారామయ్య, ఎండి.సౌజన్య, వీరెపల్లి జయరాం రెడ్డి, బొమ్మిడి అచ్చరావు మొదలైన వారి గురించిన జ్ఞాపకాలు కలబోసుకున్నారు. మాచిరాజు కామేశ్వరరావు రాగానే, లక్ష్మీ గాయత్రి, కొనే ఆంజనేయులు ఒక్కసారిగా మీరు ఒక్కరే వొచ్చేరేమిటి మీ పిశాచాలను ఎక్కడ వదిలేసి వచ్చేరు అంటూ ఆట పట్టిస్తూంటే రచయితలందరూ వయసును మరిచి, పిల్లలై పోయి కేరింతలు కొట్టారు.

పేరుపేరునా పలకరించిన యండమూరి

యండమూరి వీరేంద్రనాథ్ రాగానే తాను గుర్తుపట్టే అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలుకరించారు. గుర్తు పట్టని వాళ్ళను పేరు అడిగి మరీ పలుకరించారు. ఆయన దాదాపు రెండు గంటల సేపు వున్నారు. కొడవటిగంటి కుటుంబరావు అల్లుడు (శాంత సుందరి భర్త) రామవరపు గణేశ్వరరావు తనకు చందమామతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఉంటే అందరూ చెవులు నిక్కబొడుచుకొని విన్నారు.

65 ఏళ్ల చందమామలు ఒకచోట...

డాక్టర్ దాసరి వెంకటరమణ సేకరించిన 1947 జులై సంచిక నుండి, 2013 అక్టోబర్ లోని చివరి సంచిక వరకు (మధ్యలో 1950 దశకంలో కొన్ని మినహాయించి) ఏర్పాటు చేసిన చందమామల ప్రదర్శన అందర్నీ మంత్ర ముగ్ధులను చేసింది. యండమూరి ఆ పుస్తకాలను చూస్తూ కాసేపు గడిపారు. అనంతరం ఆయన మాచిరాజు కామేశ్వర రావు 'దేశసేవ' కథల పుస్తకం ఆవిష్కరించి, తొలి ప్రతిని స్వీకరించారు. రచయితలందరూ ప్రదర్శనలోని ప్రతి చందమామను చూస్తూ తమ తమ అనుభవాలనూ, అనుభూతులనూ, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సమయం మరిచి పోయారు. వచ్చేముందు 'ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేయాలి ఎలా పొద్దు పోతుంద'న్న వాళ్ళే వెళ్ళేటపుడు 'సమయం ఎలా గడిచిందో మాకు తెలియలేదు' అని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఈ సమావేశానికి దాదాపు పదిహేను మంది రచయితలు హాజరయ్యారు.

1. యండమూరి వీరేంద్రనాథ్, 9246502662

ముందు కథా, నాటక రచయితగానూ, నవలా రచయితగానూ, వ్యక్తిత్వ వికాస పుస్తకాల విలక్షణ రచయితగానూ, పాపులర్ అయిన వీరి మొదటి కథ చందమామలోనే వచ్చింది. 1969 జూన్ బేతాళకథ ‘అమానుష శక్తులు’. మొదటి కథలోనే తులసిదళం లోని కథాంశాన్ని చర్చించారు. రాజీ (సెప్టెంబర్ 1969), విదూషకుడు, (జనవరి 1970), చక్రవడ్డి (అక్టోబర్ 1970), చెల్లు (నవంబర్ 1973) మొదలైనవి చందమామలో వీరి కథలు.

2. వసుంధర, 9885620065

డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), శ్రీమతి రామలక్ష్మి (గృహిణి)- వెరసి వసుంధర. చందమామలో మొదటి కథ ‘పొదుపుకు కారణం’ డిసెంబర్ 1971. అనేక కలం పేర్లతో చందమామలో అత్యధిక కథలు రాసిన ఘనత వీరికి దక్కుతుంది.

3. డా. దాసరి వెంకటరమణ, 90005 72573

మొదటి కథ ‘నీకే లాభం’ 1982 మార్చి చందమామలో ప్రచురితం. చందమామ కథలతో సంపుటిగా వేసిన ‘ఆనందం’ అనే పుస్తకానికి 2014 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొని, చందమామకు అరుదైన గౌరవాన్ని అందించారు. డా. దాసరి వెంకటరమణ ‘చందమామ కథలు బాలల వ్యక్తిత్వ వికాసం’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇటీవలే పీహెచ్‌డీ డాక్టరేట్ పొందారు. పిల్లలకు కథల ద్వారా వ్యక్తిత్వ వికాసం అనేది వీరి ఇష్టమైన సబ్జెక్ట్.

4. మాచిరాజు కామేశ్వరరావు, 90000 80396

మొదటి కథ 'గుడ్డి వాడి డబ్బు' చందమామ సెప్టెంబర్, 1969 సంచికలో ప్రచురితం అయింది. వీరు చందమామలో అత్యధిక కథలు రాసిన రెండో రచయిత. దయ్యాలు, పిశాచాల కథల ద్వారానే వీరికి చందమామ లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 'పారిపోయిన దొంగ' కథ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు సిలబస్ లోకి తీసుకున్నారు. 'విధి నిర్వహణ' కథను మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు.

5. ఎన్. వి. ఆర్. సత్యనారాయణ మూర్తి, 94408 94087

చందమామలో తొలి కథ ‘దారికి వచ్చిన పశువు’ 1979, డిసెంబర్. 1985లో వచ్చిన కథ కోడలి భయం.. దూరదర్శన్‌లో నాటికగా ప్రసారం చేసారు. వీరి పుస్తకం. పొట్టి వాడు.. హాస్య కథలకు పొట్టి శ్రీ రాములు యూనివార్సిటీ ఉత్తమ గ్రంథ పురస్కారం వచ్చింది.

6. ఎం.వి.వి. సత్యనారాయణ, 92901 24862

చందమామలో వీరి తొలి కథ 'మూడు గుభేళ్లు' 1971 డిసెంబర్ సంచికలో మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ అనే పూర్తిపేరుతో ప్రచురితమైంది. ఈయన రాసిన కథలను చందమామ కథలు పేరుతో Reem publications వారు కథల సంపుటిని ప్రచురించారు. ఇది చాలా ప్రజాదరణ పొందింది. 2014-18 న శ్రీవాణి అనే పిల్లల పత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు.

7. జొన్నలగడ్డ రత్న (నారాయణమూర్తి), 9963922718

వీరి మొదటి కథ ‘వైద్య ప్రయత్నం’ డిసెంబర్ 1977 చందమామలో ప్రచురించబడింది. పిల్లల సమగ్ర వ్యక్తిత్వవికాసానికి పాఠ్యగ్రంథమైన చందమామలో జొన్నలగడ్డ రత్న, సాయిరాం ప్రసాద్, కమలిని పేర్లతో కథలు రాశారు.

8. కోనే నాగ వెంకట ఆంజనేయులు, 92906 60220

మొదటి కథ 'జమిందారు-దున్నపోతు' 1981 జనవరి చందమామలో ప్రచురితం. 'వజ్రాల హారం' బాలల కథా సంపుటికి బాల సాహిత్య పరిషత్ అవార్డ్ వచ్చింది.

9. వాణిశ్రీ (సి.హెచ్. శివరామప్రసాద్), 93900 85292

మొదటి కథ అవమానం నవంబర్ 1984 చందమామలో ప్రచురితం. వేలం వెర్రి, దేవాలయం, మానవ వనరులు పిల్లల కథలు పుస్తకాలుగా వచ్చాయి. 2009లో బాల సాహిత్యంలో కృషి చేసినందుకు చిలుమూరు రామా విద్యాసంస్థల చక్రపాణి-కొలసాని అవార్డ్ అందుకున్నారు.

10. రాంబాబు (జేవీ రామారావు), 87907 16754

మొదటి కథ ‘పుట్టుమచ్చ’ డిసెంబర్ 1978 చందమామలో ప్రచురితం. వీరి 'పనికిమాలిన సలహాలు' అనే కథను ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనను బాగా ప్రభావితం చేసిన చందమామ కథ అంటూ ప్రముఖంగా మెచ్చుకోవడం అన్నది ఆ కథ గొప్పతనానికి తార్కాణం.

11. డా. జొన్నలగడ్డ మార్కండేయులు, 94402 19338

మొదటి కథ ‘సకిలింపు మాన్యం’ డిసెంబర్ 1971 చందమామలో ప్రచురితం. పురాణాల్లోని అపరిచిత విశేషాల్ని, వెతికి వెలితీసి రాసిన ‘అపూర్వగాథలు’ పుస్తకం వీరికి మంచి పేరు తీసుకు వచ్చింది.

12. ఎన్. శివ నాగేశ్వరరావు, 96032 26457

మొదటి కథ 1984 జనవరి చందమామలో పద్మనాభుడి పెళ్లి ( బేతాళ కథ). చందమామలో ప్రచురించిన కథల సంఖ్య శతాధికం. అందులో బేతాళ కథలు 25పై చిలుకు.

13. రామవరపు గణేశ్వరరావు, 96189 33043

మొదటి కథ ‘విమర్శకుడు’ 1984 నవంబర్ చందమామలో ప్రచురితం. మొత్తం కథల సంఖ్య 25 (బేతాళ కథలు 5)

14. పేరు లక్ష్మీ గాయత్రి, 63025 55947

మొదటి కథ 1983 జూన్‌ చందమామలో వచ్చిన స్వార్ధ పండితుడు. చందమామ లో వందకు పైగా కథలు, మూడు చిన్న సీరియల్స్, ఒక పెద్ద సీరియల్ వచ్చాయి. లలిత - శర్మిల. వాళ్లిద్దరి పేర్లతో కూడా చందమామలో కథలు రాశారు.

15. పద్మలతా జయరాం నందిరాజు, 94929 21383

చందమామలో మొదటి కథ అచ్చొచ్చిన హారం 2003 ఆగస్టు చందమామ. మొత్తం 18 కథలు వచ్చాయి.

అనివార్య కారణాల వల్ల ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కాలేకపోయిన వారు

16. మల్లాది వెంకట కృష్ణమూర్తి, 98490 22344

ఆంధ్రుల ఆహ్లాద నవలా రచయితగా పేరు గాంచిన మల్లాది వెంకట కృష్ణమూర్తి మొదటి కథ కూడా చందమామలోనే అచ్చయ్యింది. 1970 ఆగస్టులో 'ఉపాయశాలి'. నవలా రచయితగా స్థిరపడిన అనంతరం కూడా వీరు చందమామలో కథలు రాయడం విశేషం.

17. గంగిశెట్టి శివకుమార్, 94418 95343

చందమామలో మొదటికథ 'యథారాజా తథాప్రజ' డిసెంబర్ 1974. కుటుంబరావుగారి శైలి అంటే ప్రాణం. ఆంధ్ర,కర్ణాటక ప్రభుత్వాలు వీరి కథల్ని పాఠ్యాంశాలుగా చేర్చాయి.

18. మల్లవరపు మనోహర రెడ్డి, 85000 11299

1974 డిసెంబర్ చందమామలో ‘ఇద్దరు మంత్రులు’ పేరిట తొలి కథ ప్రచురించారు. చందమామతోపాటు బాలానందం లాంటి పలు బాలల పత్రికల్లో శతాధిక రచనలు చేశారు.

19. బూర్లె నాగేశ్వరరావు, 9848419950

మొదటి కథ ‘గుమ్మడి కాయల దొంగ’ చందమామ 1972 మార్చిలో ప్రచురితం. చిన్నడి కథల ద్వారా వీరు బాగా ప్రసిద్ధులు.

20. ఆరుపల్లి గోవిందరాజులు, 88015 13061


మొదటి కథ దొంగబుద్ధి చందమామ 1978 ఏప్రిల్ లో ప్రచురితం. వీరి 'జ్ఞాపకార్థం' 1997 చందమామ జూన్ మంచి పేరు తెచ్చింది.

21. గవ్వల నిర్మలాదేవి,

మొదటి కథ ‘పిశాచాల వంటవాడు’ ఎస్.నిర్మల పేరుతొ చందమామ మే, 1968లో ప్రచురితం. అనంతరం గవ్వల నిర్మలాదేవి పేరుతో అనేక కథలు రాశారు.

22. అంగేరి బాలసుబ్రహ్మణ్యం

1980ల మొదటి నుంచి 2009 చివరి వరకు చందమామ పత్రిక సహసంపాదకులుగా వ్యవహరించారు. మొదటి కథ సెప్టెంబర్ 1983 చందమామ లోని ‘శ్రమకు తగ్గ ఫలం’. చందమామలో పురాణ బాలవీరులు శీర్షిక నిర్వహించారు. ‘బంగారు లోయ’ వంటి కొన్ని సీరియల్స్‌ను తెలుగులోకి అనువాదం చేశారు.

నిఝ్ఝం.. కొసమెరుపు

యండమూరి గారితో పాటు ఈ సమావేశానికి మల్లాది గారు కూడా వచ్చారు. ఆయన మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా సాయంత్రం వరకు ఉన్నారు. అందరినీ తృప్తిగా చూసుకున్నారు. అందరి మాటలను శ్రద్ధగా ఆసక్తిగా విన్నారు. అయితే ఆయనకు ఫోటోలు వీడియోలు ఇష్టం ఉండవు కాబట్టి, చందమామ కథల్లోని మాయా టోపిని ధరించి వచ్చారు. అందువలన ఆయన ఎవరికీ కనిపించలేదు. కెమెరాకు చిక్కలేదు. నాకు మాత్రమే కనిపించారు. వెళ్ళేటపుడు మరోసారి ఇలాంటి సమావేశం జరిగితే, నా నియమాన్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అంటూ చెప్పి వెళ్ళారు.

-డా. దాసరి వెంకటరమణ

Advertisement

Next Story

Most Viewed