ఎరుక గీతం

by Ravi |   ( Updated:2023-01-31 07:36:29.0  )
ఎరుక గీతం
X

ఇక ఆపుతున్న ఆ వాక్యాలు రాయడం

కేవలం ప్రేమను నింపిన కలంతో

యుద్ధభూమి లాంటి పేజీల్లో

తలలు వాలిపోయున్న గీతలపై

రాస్తాయి మట్టి పిసికిన చేతులు

శవాల్లాంటి పదాలు కానే కాదు

జీవమున్న నునుపైన పదునైన

కత్తిలాంటి మెరుగైన మేలురకానివి

చదివితే కంపించాలె వెన్ను

వెంటాడాలె నిద్రలో మెలుకువలో యాదిలో

లోతుల్లో కదపాలె ఉన్ముక్తున్ని గావించాలె

వాటికై వెతుకుతున్నా, ఏరుతున్నా

ప్రపంచ పటం నుదుటిపై

ఒక ముసలవ్వ బువ్వ గిన్నెలో

రైతన్న అరచేతి గీతలో

అమ్మ ఎదురుచూపులో

పక్షి రెక్కలో మొక్క వంపులో

ఏ వాక్యం ఇక తట్టనప్పుడు

పెల్లుబికొస్తున్న ఆ ప్రవాహం

ప్రమాదానికి గురై ఊపిరి సలపక

అసామాన్యంగా తయారవుతుంది

ఇక ఏ భావం తట్టనప్పుడు

అప్పుడు మళ్లీ చదువుతా చరిత్ర యుద్ధాల్ని

అప్పుడు మళ్లీ మేల్కొల్పుతా సున్నితత్వాన్ని

అయినా కిమ్మనని తొండల్ని దూరంగా ఆ

నదిలో విసిరేస్తే ఈదుతూ మోసుకొస్తాయ్

ఆ పదాలను ఆ వాక్యాలను ఆ భావాలను

అప్పుడు తడుతుంది ఓ పద్యం

అప్పుడు నిర్మితమవుతుంది ఈ ఎరుక గీతం

తరతరాల గుండెల్లో నిలిచే మెరుపు తత్వం

- రఘు వగ్గు

96032 45215

Advertisement

Next Story