- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర సాధనలో అమరుడైన శ్రీకాంతాచారి గురించి తెలుసా?
నెత్తురు చుక్క చిందకుండా, ప్రాణత్యాగం లేకుండా ఏ ప్రజా ఉద్యమమూ విజయం సాధించిన ఆనవాళ్లు లేవని చరిత్ర చెబుతున్నది. ఎందరో అమర వీరులు తమ రక్తాన్ని ధారపోస్తే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు అర్పిస్తే, మలి దశ ఉద్యమంలో 1200 పైగా అమరులయ్యారు. మనం అమరుల భుజాల మీద నిలబడి ప్రత్యేక తెలంగాణ శ్వాస పిలుస్తున్నాం. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి.
3 డిసెంబర్ 2009 తెలంగాణ అంతటా విషాదఛాయలు. పాట మూగపోయింది, గజ్జె కునుకు తీసింది. భవిష్యత్తు తెలంగాణ యువ కిషోరం దివికేగి తెలంగాణ ఉద్యమానికి వెలుగు దారి చూపిండు. ఆ వీరుడిని గన్న తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. శ్రీకాంతాచారి రగిలించిన ఉద్యమ జ్వాలతో తెలంగాణ సమాజం నిప్పు కణికలా మారింది. యావత్ తెలంగాణ ప్రజానీకం ఒక్కటై స్వరాష్ట్రాన్ని సాధించుకునేందుకు ప్రతిన పూనింది. నేడు శ్రీకాంతాచారి భౌతికంగా లేకున్నా ఆ అమరుని త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు.
హుషారుగా పెరిగి
కరకర పొడిచే పొద్దును చీల్చుకుంటూ కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కొడుకుగా 1986 ఆగస్టు 15న శ్రీకాంతాచారి జన్మించాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వీరిది మధ్యతరగతి కుటుంబం. శ్రీకాంతాచారికి రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు. తండ్రి వెంకటాచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేసేవాడు. శ్రీకాంతాచారి అందరి పిల్లల లెక్కనే ఆడుతూ పాడుతూ ఎగురుతూ, దునుకుతూ మస్తు హుషారుగా ఉండేటోడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పుట్టడంతో దోస్తులందరూ 'నువ్వు అదృష్టవంతుడివి' అనేవారు. ఆ రోజు ప్రత్యేకత తెలుసుకునే సందర్భంలో శ్రీకాంతాచారి భగత్ సింగ్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎందరో యోధుల చరిత్ర చదివి స్ఫూర్తి పొందాడు. ఎవరు సాయం కావాలన్నా కాదనేవాడు కాదు. సమాజం హితం కోసం తపించేవాడు. దాచుకున్న డబ్బును పేదలు, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు.
ప్రాథమిక విద్యను మోత్కూరు, నకిరేకల్ గ్రామాలలో అభ్యసించిన శ్రీకాంత్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే తెలంగాణ స్థితిగతులను అధ్యయనం చేశాడు. తోటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను చెబుతుండేవాడు. ఇలా విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవులలో ఇంటికి వెళ్లినా, తెలంగాణ ధ్యాసే. తెలంగాణ పాటలు పాడటంతో పాటు కవితలు రాస్తూ, గ్రామస్తులను చైతన్యపరిచే వాడు. 'ఒకసారి నేను ఎందుకు బిడ్డా, మంచిగా సదువుకోక. రోజులు మంచిగా లేవు. ఈ ఉద్యమాలు మనకు వద్దు, కేసులు అయితై, పోలీసులు పట్కపోతరు. నీ సదువు ఏదో నువ్వు సదువు. ఎట్లా అయ్యేది ఉంటే గట్ల అయితది' అంటే, 'అట్ల కాదు బాపూ ఎవ్వరూ మనకేంది అంటే ఎట్లా చెప్పు. మన దేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు, వారు కూడా మాకేంది అనుకుంటే మనం ఇయ్యాల ఇట్ల ఉందుమా? అని భగత్‌సింగ్ గురించి చెప్పిండు' అంటూ కన్నీరు పెట్టుకుండు తండ్రి వెంకటాచారి.
Also read: మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడెవరు?
మళ్లీ పుడతానంటూనే
అప్పుడప్పుడే స్వరాష్ట్ర ఆకాంక్ష మలిదశ ఉద్యమం ప్రతి బిడ్డకు చేరుతున్న రోజులు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మీడియా ద్వారా చెప్పిండు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్ష స్థలికి పోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్యమాలు, నినాదాలతో రాష్ట్రం మార్మోగింది. నిరసనలు ఉధృతమయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం అణచివేత కొనసాగించడం ప్రారంభించింది. ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, మరుగుతున్న రక్తంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ ప్రభుత్వంలో చలనం తెవాలనుకున్నడు. తన శరీరంలో అణువణువు తెలంగాణ కోసం తపించే శ్రీకాంతాచారి హైదరాబాద్ ఎల్బీనగర్ సర్కిల్‌లో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నడు.
అగ్నికి ఆహుతి అవుతూనే 'జై తెలంగాణ'' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని కాలిన గాయాలతో వేడుకున్నడు. పోలీసులు, ఉద్యమకారులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసి కామినేని హాస్పిటల్‌కు, అనంతరం యశోదకు తరలించారు. రెండు రోజుల తర్వాత ఉస్మానియాకు తీసుకెళ్లారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ మూడున శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. 'నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి మళ్లీ మళ్లీ ప్రాణత్యాగం చేస్తా' అని పిడికిలి బిగించి కన్నుమూశాడు. శ్రీకాంతాచారి మంటలలో కాలుతున్న దృశ్యాలను టీవీలలో చూసిన తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి. యావత్ తెలంగాణ విద్యార్థులు, రైతులు, కార్మికులు, సకల జనులు కదం తొక్కారు. ఆ అమరుడు చూపెట్టిన దారిలో పోరాటాలు చేసి ప్రాణాలను అర్పించి, ఉడుకుతున్న తమ గుండెలను తీసి మన చేతిలో పెట్టి, భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని పంచి, వారు కలలు గన్నా తెలంగాణ సాకారం అయిందా అని పైనుంచి చూస్తున్నారు!? జోహార్ శ్రీకాంతాచారి.
(నేడు శ్రీకాంతాచారి వర్ధంతి)
బద్ది గణేశ్
81066 84729