చైనా మాంజాను కఠినంగా నిషేధించాలి

by Ravi |   ( Updated:2022-12-10 18:30:47.0  )
చైనా మాంజాను కఠినంగా నిషేధించాలి
X

సంక్రాంతి అనగానే పతంగులు ఎగురవేయడం ఒక సంప్రదాయంగా ఉంది. చిన్నలు, పెద్దలు సరదాగానూ, సంప్రదాయబద్ధంగానూ గాలిపటాలను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వం ఈ పతంగికి కట్టే దారం గట్టిగా ఉండేందుకు మాంజాను ఉపయోగించేవారు. దీనిని బియ్యం, జిగురు, చెట్టు చిగుళ్లు లాంటి సహజ సిద్ధ పూతతో తయారు చేసేవారు. కానీ, నేడు చైనా మాంజా రంగప్రవేశం చేసింది. అతి ప్రమాదకరంగా ఉండే ఈ మాంజానే పతంగులు ఎగురవేసేవారు ఎక్కువగా వాడుతున్నారు.

గాజు పొడి, అల్యూమినియం ఆక్సయిడ్, జిర్కోనియం, అల్యూమినియం తదితర పదార్థాలు వాడి ఈ మాంజాను తయారు చేస్తారు. దీంతో పతంగి దారం గట్టిగా ఉండి ఇతర పతంగిని కోసివేస్తుంది. ఇది ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా గాయపరుస్తుంది. తీవ్ర గాయాలతో కొన్ని పక్షులు చనిపోతాయి కూడా. ఒక్కోసారి ద్విచక్ర వాహనాల మీద, కాలినడకన వెళ్లేవారి మెడకు కూడా ఈ మాంజా చుట్టుకొని వారు మరణించిన ఘటనలు ఉన్నాయి. ఇది పేరుకు మాత్రమే చైనా మాంజా. చైనా నుంచి దిగుమతి కాదు. దీనిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలి చుట్టుపక్కల ప్రాంతాలలోనూ, మధ్యప్రదేశ్‌లోని మరి కొన్ని ప్రాంతాలలోనూ తయారు చేస్తారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చైనా మాంజా విక్రయాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసి, మనుషులను, పక్షులను రక్షించాలి.

ఆళవందార్ వేణుమాధవ్

8686 051752

Advertisement

Next Story